మెగా స్పెషల్ స్టొరీ: ''మెగా దగా'' పార్ట్ -1
on Sep 29, 2015
ఇంతవరకూ 149 సినిమాలు అవలీలగా చేసిన ఓ మెగా హీరోకి, 150వ సినిమా చేయడానికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఎందుకని..? సినీ మేధావుల మెదళ్ళకు మేత పెడుతున్న ప్రశ్న ఇది.! కాస్త జాగ్రత్తగా విశ్లేషించి చూస్తే కారణాలు స్పష్టంగా కళ్ళముందుకు వస్తాయి. ఒకసారి దీనిపై ఓ లుక్ వేద్దాం.
వెన్నుదన్నుగా సినీ పరిశ్రమలో ఎవరూ లేకున్నా స్వయంకృషితో పైకి వచ్చిన డైనమిక్ హీరో 'చిరంజీవి'. సినీ పరిశ్రమలో మకుటంలేని మహారాజుగా ఎదిగి మెగాస్టారయ్యారు. తన నట వారసులకు సినీ బాటలు నిర్మించారు. బలమైన మెగా ఫ్లాట్ ఫారాన్ని ఏర్పాటు చేశారు. అభిమానుల సాయంతో సామాజిక సేవాకార్యక్రమాన్ని చేపట్టి, వాటిలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే! మరోవైపు చూద్దాం.
ముదిరిన రౌడీ అయినా, ముదిరిన నటుడైనా....ఎంచుకునే ఫైనల్ టార్గెట్ ''రాజకీయం''. దీనికి అనుగుణంగానే చిరంజీవి, రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. చిరంజీవి వ్యక్తిత్వ దిగజారుడుతనానికి బాట వేసింది ఈ రాజకీయ మార్గమే! ముఠామేస్త్రి,, ఠాగూర్ వంటి సినిమాలు చూసి ..చిరంజీవి వంటి నాయకులు మన దేశ రాజకీయాల్లో ఉంటే బాగుంటుందని లక్షలాది మంది అభిమానులు ఆశించారు. అభిమానుల ఉద్దేశ్యాన్ని బట్టి చిరంజీవి కూడా గొప్ప రాజకీయ నాయకుడైపోదామని ఉవ్విళ్ళూరాడు. 'ప్రజారాజ్యం' అనే పార్టీ పెట్టి హడావుడి చేసి ప్రజల్లోకి వచ్చాడు. వివిధ రంగాల ప్రముఖులు కొంతమంది అతనికి అండగా నిలవడం జరిగింది. సినీ మాయ ప్రపంచం నుండి చిరంజీవి, జనానికి చేరువగా వచ్చే కొలదీ అతని వ్యక్తిత్వం గురించి వేసుకున్న అంచనాలను తలక్రిందులు కావడం మొదలయ్యాయి.
అండగా నిలిచిన పెద్దలు ఒక్కొక్కరుగా దూరమయ్యారు. వెండితెరపై హీరోగా ఆయన చెప్పిన కబుర్లకి, నిజజీవిత ప్రవర్తనలకూ..భూమికి ఆకాశానికీ ఉన్నంత వ్యత్యాసం ఉందని చాలామందికి అర్థమైపోయింది. నందమూరి తారకరామారావులా కొంతకాలమైనా కొన్ని మంచి పనులు చేస్తాడనుకున్న ప్రజలకు, చిరంజీవి చేతకానితనాలు అశనిపాతాలయ్యాయి. ఫలితంగా ముఖ్యమంత్రి అయిపోదామనుకున్న చిరంజీవికి ఎన్నికల్లో స్వల్ప విజయం మాత్రమే దక్కింది. పోనీ ఆ స్వల్పమెజారిటీతోనైనా, ప్రజల ప్రక్షాన అసెంబ్లీలో దేనికోసమైనా పోరాడాడా అంటే అదీలేడు. సమన్యాయమేదో చేస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి, ఎవరికీ ఏ న్యాయమూ చేయలేక..చివరకు ఒక అన్యాయ పార్టీ అయిన కాంగ్రెస్ కూపంలోకి తన పార్టీని నిస్సిగుగా కలిపేశాడు. 'మీ పార్టీని కాంగ్రెస్ లో ఎందుకు కలిపేశారని' పాత్రికేయులు ప్రశ్నించగా, చిరంజీవి చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా..? ''తాను సాధించాలనుకున్న సమన్యాయం, కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే బాగా సాధించగలనని" చెప్పాడు. అరవై సంవత్సరాల పాలనతో దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీ గురించి, చిరంజీవి అలా చెప్పడం ..ఆయన రాజకీయ అవివేకానికి పరాకాష్ట. అంతటితో అంధ్రప్రదేశ్ ప్రజలు తనపై పెట్టుకున్న కాసిన్ని ఆశలన్ని తుంగలో తోక్కేశాడు. అక్కణ్నుంచి చిరంజీవిలో స్వార్ధరాజకీయ నాయకుడు నిద్రలేచాడు. పదవులు కావాలి. ఎలాగైనా ఎదిగిపోవాలి..ఇదే అతని ఆకాంక్షగా మారిపోయింది.
దేశమంతా ఛీ కొడుతున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీల తోకలా తయారయ్యాడు. 'సినిమాల్లో ఏముంది గాడిద గుడ్డు కొడితే రాజకీయ పదవుల ద్వారా కుంభస్థలమే కొట్టాలి' అనుకుంటూ రాజకీయంగా వెర్రి పరుగులు తీశాడు. ఆత్మను అమ్మేసుకున్నాడు. దాని ఫలితంగా కేంద్రమంత్రి పదవిని దక్కించుకున్నాడు. కౌరవులతో జతకట్టి, దృష్టచతుష్టయంలో ఒకనిగా మారి, స్వంత తముళ్లను (పాండవులను) కోల్పోయిన కర్ణుణ్ణి తలపింపజేశాడు చిరంజీవి. తన స్వంత తమ్ముడైన పవన్ కళ్యాణ్ కు దూరమయ్యాడు. తమ్ముణ్ణి, ధర్మాన్ని కోల్పోయినా..కేంద్రమంత్రిగా మన రాష్ట్రానికి ఆయన ఏం చేసాడో...ఆ భగవంతునికే ఎరుక! సినిమాల ద్వారా నాకింత చేసిన ప్రజలకు తనూ తిరిగి ఏదో చెయ్యాలని, రాజకీయాల్లోకి వచ్చినట్లుగా చెప్పేవాడు చిరంజీవి. అయితే చివరకు ఏం చేశాడయ్యా అంటే ..రాష్ట్ర విభజనకు పరోక్షంగా సహకరిస్తూ తెలుగుతల్లిని రంపంతో నిలువునా చీల్చడంతో 'చిరు'భాగం పంచుకున్నాడు. పోనీ..జరిగిన ఆ అక్రమానికి బాధపడి తుచ్చరాజకీయాలంటూ, తన సినీ రంగానికి వచ్చేశాడా అంటే..అదీ లేదు. రాష్ట్రం ముక్కలు కాబోతున్న చిట్టచివరి దశలో ఒక్కరోజైనా ముఖ్యమంత్రి సీటులో కూర్చోవాలని తహతహలాడి నుజ్జునుజ్జైపోయాడు. ముఖ్యమంత్రి సీటు అరంగుళం దూరంలో ఉండగా...ఆ ఆశ 'అడియాశ' అయింది. ఖిన్నుడైపోయాడు. ఈలోగా రాష్ట్రం ముక్కలైపోయింది. కాంగ్రెస్ దుష్టత్వం మొత్తం దేశవ్యాప్తమైపోయింది.
ఈ లోగా దేశవ్యాప్త లోకసభ ఎన్నికలొచ్చాయి. న్యాయానికి నిలబడిన తమ్ముడు పవన్ కళ్యాణ్ నూ. దేశభక్తుడైన నరేంద్రమోడీని నిర్లజ్జగా విమర్శిస్తూ...కాంగ్రెస్ తరపున తెగ తిరిగాడు చిరంజీవి. చివరికి ఏది ఏమైతేనేం...ధర్మమే గెలిచింది. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా దేశం మొత్తం మీద దుష్టకాంగ్రెస్, అధఃపాతాళానికి పోయింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నూ మళ్ళీ బ్రతికిద్దామని సోనియా, రాహుల్ చెంచాలా లేచి నిలబడి, తన జట్టుగాళ్ళతో బస్సుయాత్ర చేశాడు చిరంజీవి. ప్రజలు ఛీ కొట్టారు. ఇంకా ఖిన్నుడైపోయాడు. తన కర్తవ్యం ఇక ఏమిటా అని ఆలోచనలో పడ్డాడు. పెట్టిన పార్టీ పెటాకులయింది. నమ్ముకున్న మరో పార్టీ వల్ల నట్టేట మునిగాడు. ఇంకో పార్టీలో దూరిపోదామనుకుంటే నామోషీగా వుంది. అప్పుడు గుర్తొచ్చింది చిరంజీవికి..'తెలుగు సినీ కళామతల్లి!'
తెలుగు తల్లికి చేసిన ద్రోహం, తెలుగు సినీ కళామతల్లికి ఇంకా తెలియదు కదా! అనుకున్నాడు. ఫలితంగా తెలుగు సినీ వార్తల్లోకి దూసుకువచ్చింది...''చిరంజీవి 150వ సినిమా వార్త!'' "ఏ రంగంలోనైనా ఏ పెంటపని చేసి వచ్చినా, నా సినిమా రంగం నాకు ఎప్పుడూ వుంది. వెర్రి ప్రేక్షకులు నేనేం చేసినా, నోళ్ళు వెళ్ళబెట్టి మరీ చూస్తారు. నా 150వ సినిమాతో సినీరంగాన్ని మరోసారి ఊపేద్దా౦" అనుకున్నాడు చిరంజీవి.అప్పటి నుండీ సినీ జనాల్లోకి దూరిపోతూ ''మీరే కదా నా స్వంత మనుషులు...ఈ లొకేషన్లూ..ఈ లైట్లూ..ఇది కదా నా అసలు సామ్రాజ్యం అంటూ సెంటిమెంటు డైలాగులు కొడుతూ, రాని నవ్వును పదేపదే ఒలకబోస్తూ 'నటన'ప్రారంభించేశాడు.
అయితే ఈ నటన సంగతి సరే ! 150 సినిమాలో చేయవల్సిన నటన సంగతే భయంగా వుంది చిరంజీవికి! కార్యాచరణ కోసం అడుగు వేసేసరికి, ప్రస్తుత సినీరంగ పరిస్థితి ఆయనకు అర్ధమౌతూ వస్తోంది....తాను అనుకున్నది అంత ఈజీ కాదని! ప్రస్తుత౦ ప్రేక్షకుల తీరు, సినిమా చిత్రీకరణ తీరు చాలా మారింది. అరడజను మంది విలన్లను తన్నేసి, నలుగురు హీరోయిన్లతో డాన్సులు చేసేస్తే హిట్ అవుతుందనే నమ్మకం లేని రోజులు ఇవి!! అవినీతిపై భారీ డైలాగులు చెబుదామంటే..వెనుకటి తన రాజకీయ రంగుటద్దాల దగా జీవితం గుర్తుకొస్తోంది. ప్రజలు కూడా ఛీ కొడతారు. మరి ఏ విధంగా ఏ మాయచేసి, తిరిగి ప్రేక్షకులకు దగ్గరవ్వాలి? ఎలా...ఎలా? తన రాజకీయ జీవితం సమాధి అవుతున్న ఈ తరుణంలో తనకు మిగిలిన ఓకే ఒక పట్టుగొమ్మ...'సినిమా!!" తిరిగి తాను సినీ సామ్రాజ్యానికి రారాజు అయిపోవాలి. మరి దానికోసం తను ఏం చెయ్యాలి? ఎలాంటి సినిమా తీయ్యాలి? ప్రస్తుతం మెగాకు ఉన్న ''దడ'' ఇదే!!
చిరంజీవి150 సినిమాకి.. సెలబ్రేషన్ 60 కి వెనుక వున్న లింక్ ఏమిటి? చిరు 150సినిమాని భయపెడుతున్న అంశం ఏమిటి? చిరు ఎలాంటి సబ్జెక్టు పై కసరత్తు చేస్తున్నాడు? ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే..వాచ్ థిస్ స్పేస్ ఫర్ ''మెగా దగా'' పార్ట్ -2 మీ కోసం బుధవారం..
..........పోలిశెట్టి వేణు గోపాల రావు