ఆడు మగాడ్రా బుజ్జీ!   మనం ఏ శతాబ్దంలో అయినా ఉండవచ్చుగాక. ఆడవాళ్లు ఎంతైనా సాధించవచ్చుగాక. కానీ ఆడపిల్లలు బలహీనురు, తెలివితక్కువవారు అన్న నమ్మకం మాత్రం మన మెదళ్లలో ఉండిపోయింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ విషయాన్ని సమాజం నిరంతరం తరతరానికీ అందచేస్తూనే వస్తోంది. అనుమానంగా ఉంటే ఈ పరిశోధన గురించి చదవండి.. హీరో అంటే మగవాడే చిన్నపిల్లల మనసులో ఆడ, మగ తేడాలకు సంబంధించి ఎలాంటి అభిప్రాయాలు స్థిరపడిపోతాయో తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేపట్టారు. ఇందుకోసం వారు 5 నుంచి 7 సంవత్సరాల వయసు మధ్య ఉన్న కొందరు పిల్లలను ఎన్నుకొన్నారు. వీరందరికీ ఓ కథని వినిపించారు. ఆ కథలోని ముఖ్యపాత్ర ఎవరన్నది చెప్పకుండానే, ఆ పాత్ర చాలా చాలా తెలివైనదని చెప్పుకొచ్చారు. కథంతా చెప్పేసిన తరువాత ఆ తెలివైన పాత్ర ఆడవారై ఉంటారా మగవారై ఉంటారా అని అడిగితే... 5 ఏళ్ల ఆడపిల్లలు ఆడవారనీ, మగపిల్లలు మగవారనీ ఊహించారు. కానీ 6,7 వయసు ఆడపిల్లలు, మగపిల్లలు మాత్రం ఆ తెలివైన ముఖ్యపాత్ర మగవాడే అయి ఉంటాడని తేల్చేశారు. ఏ జాతి పిల్లలైనా, వారి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా కూడా చిన్నపిల్లల్లో ఈ వివక్ష కనిపించడం గమనార్హం. అంతటితో ఆగలేదు కేవలం కథ చెప్పడంతోనే పరిశోధకులు ఆగలేదు. తమ ప్రయోగంలోని రెండో దశలో భాగంగా వారికి ఓ రెండు ఆటలని పరిచయం చేశారు. నిజానికి ఆ రెండు ఆటలు ఒకే తీరున ఉన్నాయి. వాటిని ఆడే పద్ధతి, విధివిధానాలలో పెద్దగా తేడాలు లేవు. కానీ వాటి గురించి చెప్పేటప్పుడు మాత్రం ఓ ఆట ‘చాలా చాలా తెలివైనవారి కోసం’ అనీ, రెండో ఆట ‘బాగా కష్టపడేవారి కోసం’ అనీ చెప్పుకొచ్చారు. మగపిల్లలు ఈ రెండు రకాల ఆటలనీ ఆడేందుకు సిద్ధపడిపోయారు. ఆశ్చర్యంగా 6,7 వయసు ఉన్న ఆడపిల్లలు మాత్రం ‘తెలివైనవారి కోసం’ ఆడే ఆట జోలికి పోనేలేదు. అయితే 5 ఏళ్ల వయసులో మాత్రం ఆడ, మగ మధ్య ఇలాంటి తేడాలు ఏమీ కనిపించలేదు. అదీ సంగతి! ఆడవారు మగవారు సమానమే అంటూ పైకి ఎన్ని కబుర్లు చెబుతున్నా, సమాజంలో ఆ వివక్ష ఇంకా కనిపించకుండా కొనసాగుతూనే ఉంది. మనం చూసే సినిమాలు, టీవీ సీరియల్స్, చదివే పుస్తకాలు... ఆఖరికి జానపద కథలు సైతం స్త్రీలకంటే పురుషులు బలవంతులు, సమయస్ఫూర్తి కలిగినవారు అన్న అభిప్రాయాన్ని కలగచేస్తాయి. ఇక ‘నువ్వు ఆడపిల్లవి’ అంటూ పరోక్షంగా వినిపించే హెచ్చరికలు, పరిమితులు సరేసరి. ఇవన్నీ కూడా ఆడపిల్లల మనసు మీద చిన్నవయసులోనే ముద్ర వేసేస్తాయి. భవిష్యత్తులో వారి వ్యక్తిత్వాన్నీ, ఎంచుకునే చదువునీ, చేసే వృత్తినీ ప్రభావితం చేసేస్తాయి.     - నిర్జర.

  షోకేసు బొమ్మలు కూడా మోసం చేస్తాయి   ఆడవాళ్ల చర్మం రంగు ఎలా ఉండాలో, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, ఎంత సన్నగా ఉండాలో... సూచించే ప్రకటనలకి కొదవే లేదు. మీడియాలో ఎక్కడ చూసినా ఇలాంటి ప్రకటనలు వెంటాడుతూనే ఉంటాయి. ఇలా కాకుండా వేరే విధంగా ఉండే ఆడవాళ్లని సమాజం పట్టించుకోదనీ, అసలు విజయమే దక్కదనీ హెచ్చరిస్తుంటాయ. మనం షాపులో చూసే నిలువెత్తు ప్లాస్టిక్ బొమ్మలు (mannequins) కూడా ఇందుకు మినహాయింపు కాదంటున్నారు పరిశోధకులు. ఈ రోజుల్లో ఎంత చిన్న బట్టల షాపులోకి అడుగుపెట్టినా mannequins పలకరిస్తూనే ఉంటాయి. సన్నగా పీలగా ఉండే ఈ షోకేసు బొమ్మల్ని చూసి ఇంగ్లండులోని కొందరు పరిశోధకులకు అనుమానం వచ్చిందట. వెంటనే ఆ దేశంలోని రెండు పెద్ద నగరాల్లో ఓ సర్వేని నిర్వహించారు. అక్కడ రద్దీగా ఉండే బట్టల దుకాణాల్లోని mannequins కొలతలు తీశారు. చాలా బట్టల దుకాణాల్లో కనిపించే mannequins పీనుగుల్లా ఉన్నాయని తేలింది. షాపులోకి అడుగుపెట్టిన ఆడవాళ్లని ఈ బక్కపలచ బొమ్మలు తప్పుదారి పట్టించడం ఖాయం. ఇది Body Image Problem అనే తరహా సమస్యలకి దారితీస్తుదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ సమస్య మొదలైనవారు, ఇలాంటి పోలికలు చూసి... తమ శరీరం ఆకర్షణీయంగా లేదేమో అని అనుమానించడం మొదలుపెడతారు. దాంతో ఆత్మన్యూనత, సరైనా ఆహారం తీసుకోకపోవడం వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఇప్పటికే సెలబ్రెటీల దగ్గర్నుంచీ న్యూస్ రీడర్ల వరకూ బక్కపల్చగా కనిపిస్తున్నారు. మన శరీరం కూడా ఇలా ఉండాలి కాబోసు అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఆ జాబితాకి ఇప్పుడు షోకేసు బొమ్మలు కూడా తోడయ్యాయి! తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పరిశోధకులు. పైపై మెరుగులకంటే ఆరోగ్యమూ, ఆత్మవిశ్వాసమూ ముఖ్యమని హెచ్చరిస్తున్నారు. - నిర్జర.    

ఐర్లండ్‌ దేశాన్ని కుదిపేస్తున్న భారతీయురాలి చావు...   ఇంగ్లండ్ దేశానికి పక్కనే ఉండే ఐర్లండ్‌ దేశం గురించి తెలియనివారుండరు. నిన్న ఆ దేశంలో ఓ ముఖ్యమైన విషయం మీద రిఫరెండంను నిర్వహించారు. ఇవాళ ఆ రిఫరెండం ఫలితాలు వెలువడనున్నాయి. ఇంతకీ ఏమిటా రిఫరెండం? దానికీ ఓ భారతీయురాలికీ సంబంధం ఏమిటి?   ఐర్లండ్‌లో ఎక్కువ మంది క్రైస్తవ మతాన్నే అనుసరిస్తుంటారు. అందుకే ఆ దేశంలో కొన్ని చట్టాలు క్రైస్తవ సంప్రదాయాల మీద ఆధారపడి ఉంటాయి. వాటిలో ఒకటి- అబార్షన్లకు సంబంధించిన నిబంధన! క్రైస్తవ మతం ప్రకారం అబార్షన్ చేయడం అంటే హత్య చయడమే! అందుకే అక్కడ అబార్షన్లను నిషేదించారు. ఒకవేళ ఎవరన్నా కన్నుగప్పి అబార్షన్‌ చేయించుకుంటే వారికి భారీ జరిమానాతో పాటు 14 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. ఈ చట్టమే ఓ భారతీయురాలి పాట యమపాశంగా మారింది.   ఐర్లండులో దంతవైద్యురాలుగా స్థిరపడిన సవిత హలప్పనావర్‌ అనే మహిళ 2012లో తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది. అప్పటికామె మూడు నెలల గర్భిణి. సవిత కడుపులోని బిడ్డ చాలా విషమంగా ఉందని వైద్యులు తేల్చారు. దానివల్ల సవిత కూడా చనిపోతుందని హెచ్చరించారు. కానీ చట్టానికి భయపడి వైద్యులు అబార్షన్ చేయలేదు. ఫలితం! సవిత రక్తంలో ఇన్ఫెక్షన్ పెరిగిపోయి ఆమె చనిపోయింది.   సవిత మరణంతో ఐర్లండ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిజానికి ఇలాంటి వార్తలు వాళ్లకి కొత్తకాదు. ఐర్లండ్‌లో అత్యాచారానికి గురైన స్త్రీలు కూడా గర్భం తీయించుకోవడానికి వీల్లేదు. అందుకనే వాళ్లు రహస్యంగా ప్రమాదకరమైన మందులు వాడటమో, పక్క దేశాలకి వెళ్లి అబార్షన్‌ చేయించుకోవడమో చేస్తుంటారు. కానీ సవిత కేసు తర్వాత చట్టాలు మార్చాలన్న ఒత్తిడి మొదలైంది.   ఐర్లండులో ప్రస్తుతం ఉన్న అబార్షన్‌ చట్టాన్ని మార్చాలా వద్దా అని నిర్ణయించేందుకే నిన్న రిఫరెండంని చేపట్టారు. అక్కడి ప్రస్తుత ప్రధానమంత్రి లియో వరాద్కర్‌ కూడా భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి కావడం వల్ల, ఈ రిఫరెండంకు మరింత బలం చేకూరింది. ఇందుకోసం ఏకంగా 35 లక్షల మంది ఓటర్లు తమ నిర్ణయాన్ని తెలియచేయనున్నారు. ఇప్పటికే ఐర్లండ్‌లో క్రైస్తవ నిబంధనల ప్రాధాన్యత తగ్గుతోంది. కాబట్టి ఈ రిఫరెండంను ఎలాగైనా అడ్డుకోవాలన్న ఆలోచన కూడా చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఇవాళ సాయంత్రం ఫలితం వచ్చే వరకు సవిత ఆత్మకు శాంతి చేకూరుతుందో లేదో చెప్పలేం! -Nirjara  

నేచురల్‌ ఫ్లోర్‌ క్లీనర్‌ ఇలా తయారుచేసుకోండి...   మార్కెటింగ్‌ పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఇంట్లో రకరకాల ఫ్లోర్‌ క్లీనర్స్ వాడేస్తున్నారు. వీటిలో ఉండే స్ట్రాంగ్‌ కెమికల్స్ వల్ల ఫ్లోర్‌ శుభ్రంగా ఉండటం మాటేమో కానీ, రకరకాల జబ్బులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటితో కేన్సర్‌లాంటి తీవ్రమైన సమస్యలూ వస్తాయని పరిశోదనలు సూచిస్తున్నాయి. అందుకే మనమే ఓ ఫ్లోర్‌ క్లీనర్‌ని తయారుచేసుకుంటే ఏడాదికి రెండు మూడు వేలు ఆదా అవడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. కెమికల్‌ క్లీనర్స్‌తో పోల్చుకుంటే వీటివల్ల లాభాలు కూడా ఎక్కువే! * నేచురల్‌ ఫ్లోర్‌ క్లీనర్‌ కోసం పటిక, ఉప్పు, కర్పూరం బిళ్లలు ఉంటే సరిపోతుంది. పటిక ఫ్లోర్‌ మీద ఉండే చిన్న చిన్న క్రిములను చంపే యాంటిబయాటిక్‌లా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇంట్లో పసిపిల్లలు ఉన్నవారు పటికతో ఫ్లోర్‌ శుభ్రం చేస్తే, పిల్లలకి ఎలాంటి అలెర్జీలు రాకుండా ఉంటాయి. * ఉప్పుతో మార్బుల్‌ ఫ్లోరింగ్‌ తళతళలాడిపోతుంది. చీమలు, చిమట్లు నేల మీద పాకకుండా చేస్తుంది. * ఇక కర్పూరం ఓ గొప్ప రిపెల్లంట్‌గా పనిచేస్తుంది. దీంతో ఈగలు, దోమలు, బొద్దింకలు అంత త్వరగా ఇంట్లో రావు. పైగా కర్పూరం వల్ల మంచి వాసన కూడా వస్తుంది. ఈ పదార్థాలన్నీ నీటిలో వేసి అవి కరిగిపోయేదాకా ఉంచాలి. తర్వాత వాటిని కాస్త సర్ఫ్‌, ఫినాయిల్‌ కలిపిన నీళ్లలో కలిపి ఫ్లోర్‌ క్లీన్ చేసుకోవాలి. ఒకటి రెండు సార్లు ఈ హోమ్‌ మేడ్ క్లీనర్‌ వాడి చూడండి. ఆ తర్వాత ఇంక మీరు కెమికల్స్ జోలికి పోనేపోరు.

దీంట్లో కూడా ఆడవారే ముందుంటున్నారా.?   ప్రస్తుత ఆధునిక యుగంలో తాము పురుషులకు ఏ విషయంలోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు.. రంగమేదైనా సరే అందులో మగవారిని సైతం వెనక్కునెట్టి టాప్ ప్లేస్‌లో కూర్చొంటున్నారు. అయితే అన్నింట్లో ముందున్నట్లే అనారోగ్యంలోనూ నెంబర్‌వన్ ప్లేస్ తమదే అంటున్నారు. వాటిలో ప్రధానమైనది డిప్రెషన్.. మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, హర్మోన్ల అసమతౌల్యత ఇలా కారణం ఏదైనా అది అంతిమంగా డిప్రెషన్‌కు దారి తీసి మహిళలను కృంగదీస్తోంది. ఈ నేపథ్యంలో అసలు దీనికి కారణాలు.. డిప్రెషన్ లక్షణాలు, చికిత్సా విధానం తదితర వివరాల కోసం ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=Z7RduReslBo  

ఇంట్లోనే హోలీ రంగులు ఇలా చేసుకోవచ్చు..  

పెళ్లికి ముందు అమ్మాయిలు కోరుకునేవి ఇవే..!   ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టం. వయసుకొచ్చినప్పటి నుంచే పెళ్లి గురించి రకరకాల కలలు కంటూ ఉంటారు అమ్మాయిలు. తనకు కాబోయేవాడు అందంగా ఉండాలని.. మంచివాడై ఉండాలని.. తనను, తన కుటుంబాన్ని బాగా చూసుకునేవాడు కావాలని అనుకుంటారు. కానీ ఇటీవలి కాలంలో పెళ్లి విషయంలో అమ్మాయిల ఆలోచన సరళి పూర్తిగా మారిపోయింది. అదేంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి. https://www.youtube.com/watch?v=VhI_6urqrSk

నీటిలో దీపాలు.. ఇళ్లంతా అందం   దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపం దీప్తినిస్తుంది.. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతికి అద్దం పడుతుంది. దీపావళి రోజున సాయంసంధ్య వేళ నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి దీపలక్ష్మీకి నమస్కరించుకుంటారు. అనంతరం దీపాలను తులసికోట వద్ద.. వాకిట్లో ఉంచుతారు.. పండుగనాడు మట్టిప్రమిదలను వాడటం ఆనవాయితీగా వస్తోంది. అయితే కాస్తంత క్రియేటివిటీ జోడించి మన ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతో దీపాలు వెలిగించవచ్చు. కుందన్స్, రంగు రంగుల రాళ్లతో దీపాలను తయారు చేసి వాటిని నీటిలో ఉంచితే వచ్చే అందమే వేరు. అవి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.  https://www.youtube.com/watch?v=iG0MqO5maXg  

మట్టిప్రమిదను ఇలా మోడ్రన్‌గా తయారు చేసుకోండి..!   దీపావళి వస్తుందంటే ముందుగా అందరూ చేసే పని ఇంటిని శుభ్రపరచడం, తర్వాత ఇంటిని అందంగా అలంకరించుకోవడం, డిఫరెంట్ లైట్లు, ఆకర్షించే ముగ్గులు, రంగు రంగుల ప్రమిదలు ఇలా రకరకాలుగా ఇంటిని డెకరేట్ చేస్తుంటారు. అయితే తరతరాలుగా దీపావళీ నాడు మట్టిప్రమిదలను వాడటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఎప్పుడూ పాత పద్దతులేనా..? కొత్తగా ప్రయత్నించరా..? అంటూ కొందరు మొహం మీద అనేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి సమాధానంగా కేవలం మట్టి ప్రమిదనే ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చంటున్నారు ఇంటీయర్ డిజైనర్లు. అలా ప్రమిదలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=yDqvkzbgWcE    

చాలా సింపుల్‌గా కుందన్ రంగోళి చేసుకోండి   దీపావళి వచ్చిందంటే చాలు పండుగకు నెల రోజుల ముందు నుంచే ప్రమిదలు, నెల రోజులకు కావాలసిన వొత్తులు తయారు చేస్తుంటారు మహిళలు. కానీ కాలం మారింది.. ఫెస్టివల్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు రంగు రంగులతో, సరికొత్త డిజైన్లతో అలంకరణ వస్తువులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. అందుకు తగినట్లుగానే చుట్టుపక్కలవారి కంటే కొత్తగా పండుగను జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా డెకరేషన్ ఐటమ్స్ కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో అలంకరణ వస్తువులు తయారు చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=m2ngT7CusFs    

దీపావళికి పూజా తాలీని సింపుల్‌గా తయారు చేసుకోండి   సిరులు ప్రసాదించే చల్లని తల్లి శ్రీమహాలక్ష్మీని పూజించడం దీపావళి స్పెషల్. దీపోత్సవానికి ప్రతీక అయిన దీపావళిని స్పెషల్‌గా జరుపుకోవాలని పండగకు నెల రోజుల ముందు నుంచే ప్లాన్ చేస్తుంటారు అతివలు. వెలుగుల పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవటానికి డెకరేషన్ ఐటమ్స్‌ని ప్రిఫర్ చేస్తుంటారు. మార్కెట్‌లో కొత్తగా వచ్చిన డిఫరెంట్ ఐటమ్స్.. అంటే తోరణాలు, హ్యాంగర్స్, లైటింగ్స్‌, వివిధ రకాల ముగ్గుల స్టిక్కర్స్, కలర్‌ఫుల్ ఫ్యాన్సీ క్యాండిల్స్‌ల కోసం బోలెడంత ఖర్చు చేస్తుంటారు. కానీ మన ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే ఆ ఐటెమ్స్ తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం.. https://www.youtube.com/watch?v=MPWYVV8NUZk  

మన పండుగలకి వేడుకలు ఎక్కువ . వచ్చే పోయే బందువులే కాదు , ఆట పాటలు , సరదాలు కూడా ఎక్కువే . ఉదాహరణకి ఇప్పుడు ఈ దేవీ నవరాత్రులనే తీసుకోండి . దేశమంతా నృత్యాలతో సాయంత్రాలు రంగులద్దుకుంటుంది. ఒకో ప్రాంతంలో ఒక్కో ఆచారం. కాని అన్ని ప్రాంతాలలో చాలా కామన్‌గా వుండే విషయం మాత్రం నృత్యం . మన తెలంగాణా రాష్ట్రంలో కూడా బతుకమ్మ వేడుకల్లో పాట, నృత్యం ముఖ్య పాత్ర పోషిస్తాయి . రిథమిక్‌‌గా సాగే పాటకి అనుగుణంగా పాదాలు కదుపుతుంటే మనసు ఆనందంతో నిండి పోతుంది . ఇదిగో సరిగ్గా ఇదే విషయాన్ని అధ్యయనం చేసి మరీ చెబుతున్నారు నార్వే పరిశోధకులు.   ఆటలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా వుండే వారు ఎంతో ఆరోగ్యం గా వుంటునట్టు తెలిసిందిట వీరి అధ్యయనంలో . వీరు సంతృప్తితో జీవిస్తునట్టు, ఆనందంగా వుంటునట్టు, అలాగే మంచి సంబంధ భాందవ్యాలు కలిగివుంటునట్టు కూడా తేలిందిట . ఎందుకు అంటే అలాంటి కార్యక్రమాలు మెదడు, మనసు, రోగ నిరోధక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపించటం వల్ల అయ్యుండవచ్చు అని చెబుతున్నారు.   ఒత్తిడి తగ్గి ఆ ప్రభావం ఆరోగ్యం మీద పడుతుందని భావిస్తున్నారు. కాబట్టి వీరు చెప్పేది ఏంటంటే పండగ వస్తే హమ్మయ్య సెలవు దొరికింది అనుకుంటూ ఇంట్లోనే నాలుగు గోడల మధ్య వుండి పోకండి. అలా బయట పడి నలుగురిని కలవండి, ఆడి పాడండి.. ఆరోగ్యంగా వుండండి అంటున్నారు. ఒకప్పుడు మన పెద్దలు చేసింది అదే కదండీ ! ఏ వేడుకని అయినా అందరు కలసి ఆట పాటలతో గడిపేవారు. బహుశా వాళ్ళు అప్పుడు ఆరోగ్యంగా వుండటానికి అది కూడా ఒక కారణం ఏమో ! మరి మీ చుట్టూ పక్కల పండగ హడావుడి ఎలా వుందో చూడండి ఒకసారి. వీలు చేసుకుని మరీ మీరూ అడుగు కలపండి. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి .   -రమా

మహిళా క్రికెట్లో స్టార్... హర్మన్ప్రీత్ కౌర్     క్రికెట్ని కూడా ఒక మతంగా భావించే మన దేశంలో... ఆడవారి క్రికెట్ని పట్టించుకునేవారే కనిపించరు. తమ అభిమాన క్రికెటర్ల రికార్డులన్నీ పొల్లుపోకుండా చెప్పే జనం, మిథాలీ రాజ్ అన్న పేరు తప్ప మరో మహిళా క్రికెటర్ గురించే విని ఉండరు. అలాంటిది దేశం యావత్తూ తలతిప్పి తనవంక చూసేలా చేశారు ‘హర్మన్ప్రీత్ కౌర్’. ప్రపంచ మహిళా క్రికెట్ పోటీలో విజయపు అంచులదాకా తీసుకువెళ్లారు. హర్మన్కౌర్ గురించి మరిన్ని విశేషాలు... 1989లో పంజాబులోని మోగా అనే చిన్న పట్నంలో జన్మించారు హర్మన్. ఆమె తండ్రి బాస్కెట్బాల్లో గొప్ప క్రీడాకారుడు. దాంతో సహజంగానే హర్మన్కు ఆటలంటే ఇష్టం ఏర్పడింది. వీధుల్లో క్రికెట్ ఆడుతూ చెలరేగిపోయేది. అలా ఓసారి కమల్దీష్ సింగ్ అనే కోచ్ కంట్లో పడింది. హర్మన్లోని ప్రతిభను గమనించిని కమల్దీష్, ఆమె క్రికెట్ నేర్చుకునేందుకు కావల్సిన సదుపాయాలన్నీ కల్పించాడు. తనకి దక్కిన అవకాశాన్ని రెండుచేతులా అందిపుచ్చుకున్నారు హర్మన్. అంచెలంచెలుగా ఎదుగుతూ 2009లో జాతీయ జట్టుకి ఎంపికయ్యారు. అక్కడి నుంచి ఇక ఆమె వెనుదిరిగి చూడలేదు. వన్డే అయినా, టెస్ట్ అయినా T20 అయినా బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ తన ప్రతిభ కనబరిచారు. 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో ఏకంగా 9 వికెట్లు తీసుకున్నా, 2016లో 31 బంతులలో 46 పరుగులు చేసి ఆస్ట్రేలియా మీద T20 సిరీస్ గెల్చుకున్నా... మన మహిళా క్రికెట్ సాధించిన అనేక విజయాల వెనుక హర్మీన్ అండ ఉంది. అందుకే 2012లో ఆమెను T20 జట్టుకు కేప్టెన్గా నియమించారు. మన దేశం నుంచి విదేశీ క్రికెట్ క్లబ్బుకు ఎంపికైన తొలి వ్యక్తిగా కూడా హర్మన్ రికార్డు సృష్టించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే మొన్నటికి మొన్న జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్స్లో హర్మన్ సాధించిన స్కోర్ ఓ అద్భుతం. ఆ రోజు చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో భారత్ తలపడింది. ఇప్పటికే ఆరుసార్లు ప్రపంచ్కప్ నెగ్గిన ఆస్ట్రేలియాకు భారత్ ఏమాత్రం పోటీ ఇవ్వలేదని అనుకున్నారు. దానికి తోడు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్ 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి జారుకుంది. ఆ సమయంలో వచ్చిన హర్మన్ కౌర్ స్టేడియం నలుమూలలకీ తన బ్యాట్ను ఝుళిపించారు. తన అభిమాన క్రికెట్ వీరేంద్ర సెహ్వాగ్నే మైమరపించేలా, 115 బంతులలో 171 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. మహిళల ప్రపంచ కప్లో భారత్కి ఇదే అత్యుత్తమ స్కోరు. ఆ రోజు మన దేశం గెలిచిందని వేరే చెప్పాలా! ప్రపంచ కప్ ఫైనల్స్లో కూడా హర్మన్ 51 పరుగులతో చెలరేగారు. కానీ దురదృష్టం! కేవలం 9 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవలసి వచ్చింది. ఏది ఏమైనా ఈసారి ప్రపంచకప్లో హర్మన్ ప్రదర్శన పుణ్యమా అని దేశం అంతా మహిళల క్రికెట్కు కూడా ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది. తప్పదు కదా! ఆడవారే కదా అని సమాజం వీలైనంతవరకూ పట్టించుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఏదో ఒక రోజు, తల తిప్పి నోళ్లు వెళ్లబెట్టి పట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. - నిర్జర.    

  ఈ టీవీ సీరియల్ మన దేశాన్నే మార్చేస్తోంది!     ఆడపిల్ల పుట్టబోతోందని తెలిస్తే చంపేయడం, భార్యని గొడ్డుని బాదినట్లు బాదటం, మొహం మీద యాసిడ్ పోయడం... లాంటి వార్తలు మనకి కొత్త కాదు. దేశంలో ఎక్కడ చూసినా ఆడవాళ్లకి ఏదో ఒక సమస్యే! ప్రతి చోటా వివక్షే! కాకపోతే ఒకో చోట ఒకోలా ఉంటుంది. ఆఫీసులో పనిచేసే ఆడవాళ్లకి ఒక బాధ. మారుమూల పల్లెటూరిలో ఉండే ఆడపిల్లది మరో కష్టం. ఒక టీవీ సీరియల్ ఇలాంటి సమస్యలకి పరిష్కారంగా నిలుస్తోందంటే నమ్మగలరా! దూరదర్శన్! ఈ పేరు చెబితేనే ఇప్పటి ప్రేక్షకులు మొహం చిట్లించుకుంటారు. నాలుగు గోడల మధ్య నడిచే నాటకాలు, సంగీత కార్యక్రమాలు, నాణ్యత లేని దృశ్యాలు, ప్లాస్టిక్ పూలు... ఇలాంటివే గుర్తుకువస్తాయి దూరదర్శన్ను తల్చుకుంటే. కానీ ఇప్పటికీ మన దేశంలోని మారుమూల ప్రాంతవాసులకి ఇదే దిక్కు. పైసా ఖర్చు లేని వినోద సాధనం. ముఖ్యంగా బిహార్ వంటి వెనుకబడిన రాష్ట్రాలలో దూరదర్శన్ది కీలకపాత్ర. ఇదే విషయాన్ని సానుకూలంగా మార్చుకోవాలనుకున్నారు ‘ఫిరోజ్ అబ్బాస్ ఖాన్’ అనే బాలీవుడ్ డైరక్టర్. దూరదర్శన్ ద్వారా సామాన్య ప్రజల ఆలోచనావిధానంలో మార్పు తీసుకురావాలని అనుకున్నారు.     Population Foundation of India అనే సంస్థతో కలిసి ఫిరోజ్ ‘నేను ఏదైనా సాధించగలను’ (మై కుచ్ భీ కర్ సక్తీ హూ - MKBKSH) అనే ఒక సీరియల్ తీయాలని అనుకున్నారు. మన దేశంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల మీద అవగాహన కల్పించడం, వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వడం... ఈ సీరియల్ వెనుక ఉన్న లక్ష్యం. ఇందుకోసం ఈ సీరియల్ బృందం ఏడాది పాటు దేశమంతా తిరిగారు. ఆడవాళ్ల ఇబ్బందులన్నింటినీ గ్రహించే ప్రయత్నం చేశారు. వాటికి పరిష్కారం చూపేలా కథని రూపొందించుకున్నారు. 2014లో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇందులో కథానాయిక పాత్ర పేరు - డా॥ స్నేహా మాధుర్. సాటి ఆడవాళ్ల కోసం స్నేహా తన కెరీర్ను వదులకుని పల్లెబాట పడుతుంది. ఆ ప్రయాణంలో డా॥ స్నేహాతో కలిసి ప్రేక్షకులని నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఏదో సాదాసీదాగా సాగిపోతుందనుకున్న సీరియల్కి ఆరంభంలోనే అద్భుతమైన ప్రతిస్పందన కనిపించింది. ఇతర దేశాల ప్రేక్షకులు కూడా దీన్ని చూడసాగారు. ఆఖరికి దీన్ని రేడియోలలో కూడా ప్రసారం చేయడం మొదలుపెట్టారు.     ఈ సీరియల్ మొదలై ఏడాది గడిచేసరికి ఎక్కడలేని ప్రచారం వచ్చింది. బాలీవుడ్ తారలు, సమాజసేవకులు.... ఈ సీరియల్ అద్భుతమనీ, దీన్ని చూసి తీరాల్సిందే అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రోత్సాహంతో నిర్మాతలు రెండో ఏడు కూడా సీరియల్ను కొనసాగించారు. మొదటి ఏడాది శిశుహత్యలు, బాల్యవివాహాలు, గృహ హింస లాంటి ప్రధాన సమస్యల గురించే ప్రస్తావించారు. కానీ ప్రేక్షకుల ఆదరణతో మరికాస్త దూకుడు పెంచి సెక్స్ ఎడ్యుకేషన్కి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఒక ఏడాదిపాటు ఈ సీరియల్ ప్రసారం అయిన తర్వాత దీని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నారు నిర్మాతలు. అందుకోసం మూడువేలకు పైగా గ్రామాలలో ఒక సర్వేని నిర్వహించారు. ఈ సీరియల్తో గ్రామీణ భారతంలో ఎంతో మార్పు వచ్చినట్లు తేలింది. ఆడపిల్లల చదువు, బాల్య వివాహాలు, వెంట వెంటనే పిల్లల్ని కనడం... లాంటి అనేక విషయాల మీద 70 శాతానికి పైగా ప్రజలలో అవగాహన ఏర్పడింది. అంతేకాదు! భార్యని తన్నడం భర్త హక్కు, ఆడది మగవాడితో సమానం కాదు లాంటి అపోహలు నుంచి ఆడవాళ్లు బయటపడ్డారు.     ఒక్కమాటలో చెప్పాలంటే భారతదేశ టీవీ చరిత్రలో ఇంత ప్రభావవంతమైన సీరియల్ ఇప్పటివరకు రాలేదని అంటున్నారు. అంతేకాదు! ఇప్పటివరకూ ఈ కార్యక్రమాన్ని 40 కోట్ల మంది చూశారట. ప్రేక్షకుల సంఖ్యాపరంగా చూసినా ఇది ఒక రికార్డే. ఇన్నాళ్లు మన టీవీలు, సినిమాలు ఆడవాళ్లని ‘పడిపోయే’ వస్తువులుగానూ, పనికిమాలిన కుట్రలు చేసే పాత్రలుగానే చూపించాయి. దీనికి భిన్నంగా వారి బాగోగుల గురించి ఆలోచించి, పరిష్కారం చూపే కార్యక్రమం రావడం మంచిదే కదా! - నిర్జర.

  ఆమె ముందు ఎవరెస్టయినా తలవంచాల్సిందే!     మే 21 మన వార్తాపత్రికలు ఎప్పటిలాగే మసాలా కబుర్లతో నిండిపోయాయి. ఛానళ్లు రకరకాల చర్చలతో హోరెత్తిపోయాయి. అదే సమయంలో-  ఒక మనిషి హిమాలయాల మీద మువ్వన్నెల జెండాను ఎగరవేయాలనీ, అక్కడకు చేరి బుద్ధుని స్మరించాలనీ కోరుకుంటోంది. ఇప్పటిదాకా ఎంతోమంది ఆ పని చేసి ఉంటారు. కానీ ఆమె ప్రయాణం మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే! ‘అన్షు జంపసేన’ అరుణాచల్ ప్రదేశ్కు చెందిన మహిళ. ఆమె భర్త ‘సెరింగ్ వాంగే’ ఓ పర్వతారోహకుడు. Arunachal Mountaineering & Adventure Sports Association అనే విభాగంలో పనిచేస్తున్నాడు. స్వతహాగా పర్వతాల మధ్య పెరిగిన అన్షుకి కూడా భర్త అడుగుజాడలలో పర్వతారోహణ చేయాలన్న ఆసక్తి మొదలైంది. దాంతో భర్త పనిచేసే సంస్థలోనే చేరి పర్వతారోహణలతో కఠోర శిక్షణని పొందింది. ఓ రెండేళ్లపాటు అందులో మెలకువలన్నీ ఒడిసిపట్టిన తర్వాత, ఎవరెస్టు శిఖరాన్నయినా అధిరోహించేందుకు సిద్ధపడ్డారు అన్షు.     2011లో మొదటిసారి ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నారు అన్షు. కానీ ఆ శిఖరం మహిమ ఏమిటో కానీ, ఒక్కసారి అక్కడకు చేరుకున్నాక మళ్లీ అక్కడకు వెళ్లాలనిపిస్తుందని అంటారు అన్షు. ఆ ప్రపంచపు ఎత్తుకి చేరుకున్న తర్వాత భగవంతుని స్వయంగా చూసిన అనుభూతి కలుగుతుందని అంటారు. అందుకనే మొదటిసారి ఎవరెస్టుని చేరుకున్న పదిరోజులలోనే మళ్లీ అక్కడకు వెళ్లారు. అలా పదిరోజుల వ్యవధిలో ఎవరెస్టుని రెండుసార్లు అధిరోహించిన మహిళగా చరిత్ర సృష్టించారు. 2013లో అన్షు మరోసారి ఎవరెస్టుని అధిరోహించారు. ప్చ్! అయినా తనివి తీరలేదు. ఎవరెస్టు పట్ల ఉన్న అనుబంధం ఆమెని నిలవనీయలేదు. అందుకోసం 2017 మేలో ఎవరెస్టుని, రెండుసార్లు వెంటవెంటనే ఎక్కాలని అనుకున్నారు. ఇదేమంత తేలిక కాదని ఆమెకు తెలుసు. ఎవరెస్టు బేస్ క్యాంప్ దగ్గర నుంచి శిఖరాన్ని చేరుకోవడం సాహసంతో కూడుకున్న పని. ప్రాణాలకు సైతం గ్యారెంటీ ఉండని సాహసం. శిఖరాన్ని చేరుకునేందుకు నెలరోజులకు పైనే పట్టవచ్చు. పైగా అన్షుకి ఇప్పుడు 38 ఏళ్ల వయసు, ఇద్దరు పిల్లల తల్లి. కానీ ఇవేవీ ఆమెకు ప్రతిబంధకంగా కనిపించలేదు. ఎవరెస్టు మీద జెండా రెపరెపలాడటం కోసం, అక్కడ తనకి లభించే అలౌకికమైన ఆనందం కోసం శిఖరాన్ని చేరుకునేందుకు బయల్దేరింది.     మే 16 నుంచి మే 21 లోపల అన్షు రెండుసార్లు ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కారు. అలా ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు ఎవరెస్టు ఎక్కిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. సామాన్యంగా ఒక్కసారి ఎవరెస్టు ఎక్కేసరికే ఒళ్లు హూనమైపోతుంది. మరో నెలరోజులకి కానీ శరీరంలో మన స్వాధీనంలోకి రాదు. అలాంటిది వెంటనే రెండోసారి ఎక్కడా ఆగకుండా శిఖరాన్ని చేరుకోవడం అంటే అద్భుతమే! ఒకవైపు మనసు అలిసిపోయి ఉంటుంది, శరీరంలోని నరనరమూ నొప్పి పెడుతూ ఉంటుంది. కానీ ‘లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపనే ఉంటే ఎలాంటి బాధనైనా అధిగమించవచ్చు,’ అని చెబుతారు అన్షు! ఆ తపనతో అన్షు ఎవరెస్టే చేరుకోగా లేనిది.... మనం చిన్నపాటి సమస్యలని అధిరోహించలేమా!!! - నిర్జర.  

  పెప్పర్‌ స్ప్రే కథ వింటారా!     నిర్భయ హత్యకేసు గురించి కొత్తగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం లేదు. రాజధాని నడిబొడ్డున సాగిన ఆ దౌర్జన్యకాండ దేశాన్ని తలదించుకునేలా చేసింది. నేరం జరిగిన తర్వాత న్యాయం చేసేందుకు ఎన్ని చట్టాలు ఉంటే మాత్రం ఏం ప్రయోజం? ముందు ఆ నేరాన్ని అడ్డుకునేలా చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రచారం మొదలైంది. అందులో భాగంగా పెప్పర్‌ స్ప్రే గురించి తరచూ వినపడుతోంది.   ఇంతకీ ఈ పెప్పర్‌ స్ప్రే కథ ఏంటి? ఇదీ చరిత్ర! శత్రువుని కాసేపు షాక్‌కు గురి చేయడానికి కారాన్ని వాడే అలవాటు, వేల సంవత్సరాల నుంచే ఉంది. కానీ అది పెప్పర్‌ స్ప్రే రూపంలోకి వచ్చి నలభై ఏళ్లు కూడా కావడం లేదు. అప్పట్లో క్రూరజంతులు ఏవన్నా వెంటపడుతుంటే వాటి నుంచి తప్పించుకోవడానికి దీన్ని వాడేవారు. కానీ జంతువులకంటే మదమెక్కిన మనుషుల నుంచి తప్పించుకోవడం మరింత ప్రమాదకరం అని తేలడంతో... దాన్ని సాటి మనుషుల నుంచి ఆత్మరక్షణ కోసం కూడా ఉపయోగించసాగారు. ఇదీ ఫలితం! నిజానికి పెప్పర్‌ స్ప్రే అంటే కారం కలిపిన నీరు కాదు. కానీ మిర్చికి ఇది దగ్గరి చుట్టమే! Capsicumగా పిల్చుకునే మిర్చిజాతి మొక్కల నుంచి తీసే Capsaicin అనే రసాయనంతో ఈ స్ప్రేను తయారుచేస్తారు. ఇది మొహం మీద పడిన వెంటనే... దాడి చేస్తున్నవారు అసంకల్పితంగా కళ్లు మూసుకోక తప్పదు. వాళ్లు కళ్లు నులుముకునేకొద్దీ ఇది మరింతగా శరీరంలోకి చొచ్చుకుపోతుంది. ఊపిరి పీల్చుకునేకొద్దీ మరింతగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దాంతో మనిషి ముందుకి వంగిపోయి తీవ్రంగా దగ్గడం మొదలుపెడతాడు. దాదాపు పావుగంట పాటు అసలు మాట్లాడటం కూడా సాధ్యం కాదు. పెప్పర్‌ స్ప్రేకి వాపు కలిగించే గుణం (inflammation) ఉంటుంది. కాబట్టి కనురెప్పలు వాచిపోయి తాత్కాలికంగా దృష్టి కనిపించదు. ఊపిరితిత్తులు వాచిపోయి ఊపిరి కూడా కష్టమైపోతుంది. ప్రాణాంతకం కాదు! పెప్పర్‌ స్ప్రే చల్లాక అవతలి మనిషి కాస్త కోలుకోవడానికి ఓ గంట పడుతుంది. ఈలోగా అవతలి మనిషి నుంచి తప్పించుకుని పారిపోవడానికో అతన్ని అదుపులో తీసుకోవడానికో కావల్సినంత సమయం చిక్కుతుంది. గంటలు గడిచేకొద్దీ అతను నిదానంగా సాధారణ స్థితికి వచ్చేస్తాడు. అయితే ఆస్తమా, గుండెజబ్బులు వంటి సమస్యలలో మాత్రం ఇది ప్రాణాంతకంగా మారవచ్చు. మరీ కళ్ల మీదే పెట్టి స్ప్రే చేయడం వల్ల కంటిచూపు దెబ్బతినవచ్చు. జాగ్రత్తలు: పెప్పర్‌ స్ప్రే నీటిలో కరగదు. కాబట్టి అది ఒంటి మీద పడ్డాక నీటితో కడుక్కొని ప్రయోజనమే లేదు. బేబీ షాంపూతో కడుక్కోవడం వల్లే కాస్త ఉపశమనం లభిస్తుందట. కళ్లని మాటిమాటికీ ఆర్పే ప్రయత్నం చేయడం వల్ల, కంట్ల పడ్డ స్ప్రే కూడా నీరులా కారిపోయే అవకాశం ఉంది. నిదానంగా, గాఢంగా ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేయడం వల్ల ఊపిరితిత్తులూ కోలుకుంటాయి. రక్షణ కోసం దాచుకున్న పెప్పర్‌ స్ప్రే పొరపాటున మన కంట్లోనే పడే ప్రమాదం ఉంది కాబట్టి, కంపెనీలు చాలా జాగ్రత్తగా దాన్ని రూపొందిస్తాయి. కీచెయిన్‌ లాగితేనో, మూత పూర్తిగా తిప్పితేనో అందులో స్ప్రే బయటకి వచ్చేలా చర్యలు తీసుకుంటాయి. మన దగ్గర చట్టబద్ధమే! ఇదీ పెప్పర్‌ స్ప్రే కథ. చాలా దేశాలలో కేవలం పోలీసులు మాత్రమే ఈ పెప్పర్‌ స్ప్రేని ఉపయోగించే అవకాశం ఉంది. అదృష్టవశాత్తూ మన దేశంలో దీన్ని ఎవరైనా ఆత్మరక్షణ కోసం వాడవచ్చు. పిచ్చిపట్టిన జంతువులు దగ్గర్నుంచీ, జంతుస్వభావం ఉన్న మనుషుల వరకూ ఎవరి నుంచైనా రక్షణ పొందేందుకు దీన్ని ఉపయోగించవచ్చు. వీటి ఖరీదు కూడా ఏమంత ఎక్కువ కాదు. పైగా ఆన్‌లైన్ ద్వారా చాలా తేలికగా దొరుకుతాయి కూడా! పెప్పర్‌ స్ప్రే ఒక ఆయుధం లాంటిది. కాబట్టి అత్యవసరమైన సందర్భాలలో మాత్రమే దీన్ని ప్రయోగించాలన్న విచక్షణ చాలా అవసరం. ఎలా ఉంటుందో చూద్దామని మన మీదే ప్రయోగించుకోవడమో, పిల్లలకు దగ్గరగా ఉంచడమో, క్షణికోద్రేకానికే దాన్ని ప్రయోగించడమో చేస్తే మాత్రం చిక్కులు తప్పవు. - నిర్జర  

    ఉద్యోగంలో ఫిట్... తల్లిగా సూపర్ హిట్       కాలం మారింది. కాలంతో పాటుగా ఆడవారి ప్రయాణమూ మారింది. ప్రతి రంగంలోనూ మగవారికి తీసిపోకుండా దూసుకుపోతున్నారు. కానీ ఆ హడావుడిలో తల్లిగా తమ బాధ్యతని ఏమాత్రం విస్మరించడంలేదు. అందుకు సాక్ష్యంగా బ్యాంకింగ్, క్రీడలు, సమాజసేవ, రక్షణ రంగం.... ఇలా నాలుగు రంగాల్లో అద్భుతాలు సృష్టించిన  మాతృమూర్తులు వీరు. చందాకొచ్చర్:   23 ఏళ్ల వయసులోనే ICICI బ్యాంక్ ఉద్యోగినిగా అడుగుపెట్టారు చందాకొచ్చర్. ఉద్యోగంలో అంచెలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు అదే బ్యాంక్కు CEOగా మారారు. కానీ తల్లిగా తన పిల్లలకి ఏలోటూ రానీయలేదు. అందుకనే ‘నువ్వు ఉద్యోగంలో అన్ని బరువుబాధ్యతలని మోస్తున్నావనీ కానీ, ఎంతో ఒత్తిడిని భరిస్తున్నావని కానీ మాకు తెలియనీయలేదు. ఇంట్లో నువ్వు ఒక అమ్మలా మాత్రమే మెలిగేదానివి,’ అంటుంది ఆమె కూతురు ఆరతి. చందాకొచ్చర్ మాత్రం ఇందులో అద్భుతమేమీ లేదంటారు. జీవితంలోని ఆటుపోట్లని తట్టుకొంటూనే కుటుంబానికి ప్రేమని పంచే స్థైర్యం తన తల్లి నుంచే వచ్చిందంటారు. కాదనగలమా! మేరీ కాం: ఆడవాళ్లు బాక్సింగ్లోకి అడుగుపెట్టడమే అసాధ్యం. ఒక వేళ అడుగుపెట్టినా పెళ్లయిన తర్వాత బరిలోంచి తప్పుకోవాల్సిందే అని ఓ అభిప్రాయం. ఆ మాటలని కొట్టిపారేస్తారు మేరీ కాం. దీనికి ఆమె విజయాలే ఉదాహరణ. మణిపూర్లోని ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన మేరీ కాం, అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయస్థాయికి చేరుకున్నారు. ఒక పక్క కెరీర్ను కొనసాగిస్తూనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టాక మళ్లీ బరిలోకి దిగి ఒలింపిక్స్లో పతకాన్ని కూడా గెలుచుకున్నారు. అర్థం చేసుకునే కుటుంబం తోడుంటే ఆకాశమే హద్దుగా సాగిపోవచ్చునంటారు మేరీ కాం. కాదనగలమా! కిరణ్ బేడి:   కిరణ్ బేడి గురించి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరమే లేదు! ఒక తరం మహిళలు ఆమెను ఆరాధిస్తూ, అనుసరిస్తూ పెరిగారు. ఢిల్లీ ట్రాఫిక్ని అదుపుచేయడం దగ్గర్నుంచీ, తీహార్ జైల్లో మార్పులు తేవడం వరకూ కిరణ్ సాధించిన విజయాల జాబితా చాలా పెద్దదే! క్రీడాకారిణిగా, పోలీస్ ఉన్నతాధికారిగా, రాజకీయవేత్తగా, సమాజసేవికగా, పుదుచ్చేరి గవర్నరుగా ఆమె చాలా పాత్రలే పోషించారు. కానీ తల్లిగా తన బాధ్యతను విస్మరించలేదు. బాధ్యత అంటే 24 గంటలూ ఇంట్లో ఉండటం కాకపోవచ్చు! కిరణ్ తన ఒక్కగానొక్క కూతురు సైనాకి జీవితం అంటే ఏంటో నేర్పారు. అందుకే సైనా ఇప్పుడు నలుగురూ మెచ్చుకునే సమాజసేవికలా మారింది. ‘ఈ దేశంలో అవినీతి లేకుండా చేయడమే నా లక్ష్యం. నా మనవరాలికి ఇంతకంటే గొప్ప బహుమానం ఏమివ్వగలను’ అని సైనాతో అంటారట కిరణ్. కాదనగలమా! టెస్సీ థామస్:     ఏదో మాటవరసకి ఆడవారు ఆకాశంలో సగం అంటూ ఉంటారు. కానీ ఆ మాటని నిజం చేసేవరకూ నిద్రపోలేదు కొందరు. అందుకు రుజువు కావాలంటే ‘క్షిపణ మహిళ’ టెస్సీ థామస్ను తల్చుకుంటే సరి. అబ్దుల్ కలామ్ సహాయకురాలిగా అడుగుపెట్టిన టెస్సీ ఆయన ఆశయాన్ని కొనసాగించే వారసురాలిగా నిలిచారు. శత్రు దేశాలను వణికించేలా, అగ్ని క్షిపణి ప్రాజెక్టుని ముందుకి నడిపించారు. టెస్సీ భర్త నౌకాదళంలో పనిచేయడంతో, ఆయన ఎప్పుడూ ఇంటికి దూరంగా ఉండేవారు. దాంతో ఉద్యోగాన్ని, పిల్లవాడినీ చూసుకోవాల్సిన బాధ్యత టెస్సీ మీదే ఉండేది. కానీ ‘అటు ఉద్యోగం పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తిగా, ఇటు బాధ్యతాయుతమైన తల్లిగా... శాస్త్రవేత్తలుగా మారాలనుకునే మహిళలందరికీ ఆదర్శంగా నిలిచారు టెస్సీ’ అంటోంది భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘం. కాదనగలమా! - నిర్జర.  

అడవిలో అమ్మ.. ఎంబీబీఎస్ చదవని డాక్టర్... లక్ష్మి కుట్టి!     గొప్ప విజయాలు సాధించడానికి పెద్ద కుటుంబంలో పుట్టనక్కర్లేదు. గొప్ప బ్యాగ్రౌండ్ లో పెరగనక్కర్లేదు. గొప్ప గొప్ప చదువులు చదవనరక్కర్లేదు. ఆలోచన గొప్పగా ఉంటే చాలు. సంకల్పం గట్టిదైతే చాలు. లక్ష్మికుట్టిని చూస్తే ఎవరైనా ఈ విషయమే చెప్తారు. ఎందుకంటే ఆమె పెద్దగా చదువుకోలేదు. చెప్పుకోదగ్గ బ్యాగ్రౌండ్ లేదు. కానీ ఈరోజు ఆమె గురించి చెప్పుకోడానికి మాత్రం చాలా ఉంది.          తిరువనంతపురం జిల్లాలోని కల్లార్ అడవుల్లోని ఒక గిరిజన గ్రామంలో... ఓ చిన్న గుడిసెలో నివసిస్తుంది డెబ్భై అయిదేళ్ల లక్ష్మి కుట్టి. మామూలుగా చూస్తే ఆమె కూడా అందరిలాంటిదే కదా అనిపిస్తుంది. కానీ ఆమె గురించి తెలుసుకుంటే మాత్రం అందరిలో ఒకరు కాదు, అందనంత ఎత్తులో ఉన్నది అనిపిస్తుంది. లక్ష్మి... ఎంబీబీఎస్ చదవని డాక్టర్. పట్టాలు పొందని మేధావి. ఎటువంటి వ్యాధి అయినా, ఎలాంటి నలతనైనా క్షణాల్లో మాయం చేసేయగలదామె.      లక్ష్మి కుట్టి ఇంటి చుట్టూ రకరకాల మొక్కలుంటాయి. వాటి ఆకులు, వేర్లతో దాదాపు ఐదు వందల రకాల వ్యాధులకి వైద్యం చేస్తుంది. ఇంతవరకూ ఆమె ట్రీట్మెంట్ ఫెయిలయ్యింది లేదు. ఉండేది అడవిలో కావడంతో పాము కాటేసినా, విష పురుగు కరిచినా ఆమె దగ్గరకే పరిగెత్తుకు వస్తారు. క్షణాల్లో ఆ విషాన్ని తీసి పారేస్తుంది లక్ష్మి. ఆమె వైద్యం చూస్తే పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఆశ్చర్యపోవడం ఖాయం.        లక్ష్మికి ఈ మెళకువలన్నీ ఆమె తల్లి ద్వారా తెలిశాయి. వాటిని మరింత మెరుగు చేసి వీలైనంత మందికి సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది లక్ష్మి. మొదట లక్ష్మి వైద్యం అడవికే పరిమితమైపోయింది. కానీ కాలం గడిచేకొద్దీ విషయం మెల్లమెల్లగా అడవి చుట్టూ ఉన్న గ్రామాలకు పాకింది. దాంతో అక్కడి నుంచి కూడా వైద్యం కోసం లక్ష్మి దగ్గరకు వచ్చేవారు. వారి ద్వారా లక్ష్మి పేరు అందరికీ తెలిసిపోయింది. కేరళ మొత్తం లక్ష్మి పేరు జపించసాగింది.   ఆమె గొప్పదనం తెలిసి కేరళ ప్రభుత్వం 'నాటు వైద్య రత్న' అవార్డునిచ్చి సత్కరించింది. ఆమె కానీ, ఆమె తల్లి కానీ వాళ్లు చేసే వైద్య ప్రక్రియ గురించి పుస్తకం రాస్తే ప్రచురించడానికి కేరళ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సిద్ధంగా ఉంది. కేరళ ఫోక్ లోర్ అకాడెమీ లక్ష్మిని గౌరవ అధ్యాపకురాలిగా నియమించుకుంది. ఆమె విజ్ఞనాన్ని మరికొందరికి అందించే ప్రయత్నం చేస్తోంది. ఇవి కాక ఆమెకు లభించిన ప్రశంసలు, ప్రశంసాపత్రాలు, అవార్డులు, రివార్డులు ఎన్నెన్నో.         ఇంత సాధించినా దాని గురించి ఏమీ మాట్లాడదు లక్ష్మి. ఎవరైనా పొగిడినా... "నేను సాధించింది ఏమీ లేదు, మా అమ్మ నాకు నేర్పింది, నేను నేర్చుకున్నదానితో పదిమందికి సేవ చేస్తున్నాను అంతే" అంటుంది సింపుల్ గా. తరచూ ఏదో ఒక ప్రదేశానికి వెళ్లి వైద్య సేవలు అందించడమో, ప్రకృతి గురించి ప్రచారం చేయడమో చేస్తూ ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంది లక్ష్మి. వైద్యం చేయడంతో పాటు ఆప్యాయత నిండిన మాటలతో ఆమె ఓదార్చే తీరు చూసి అందరూ ఆమెను ప్రేమగా అమ్మా అని పిలుస్తుంటారు. 'అడవికి అమ్మమ్మ' (గ్రాండ్ మదర్ ఆఫ్ ఫారెస్ట్) అంటూ బిరుదు కూడా ఇచ్చారు.       అందరికీ ఇంత ప్రేమను, సంతోషాన్ని పంచే లక్ష్మి జీవితంలో మాత్రం చాలా విషాదం ఉంది. ఆమె పెద్ద కుమారుడు ఓ మదపుటేనుగు బారిన పడి మరణించాడు. చిన్న కుమారుడు కూడా ఓ ప్రమాదంలో కన్ను మూశాడు. కొన్నాళ్ల క్రితమే భర్త కూడా ఆమెను విచిడిపెట్టి వెళ్లిపోయాడు. వాళ్లందరి జ్ఞాపకాలూ మనసును గుచ్చుతున్నా తన కర్తవ్యాన్ని మాత్రం క్షణం మర్చిపోదు లక్ష్మి. ఒంటరిగా ఈ అడవిలో ఎందుకు, సిటీకి వచ్చి మీ సేవలు అందించండి అన్నా కూడా ఆమె వినదు. "ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. కన్నుమూసే వరకూ ఇక్కడే ఉంటాను.   అడవిని దాటొచ్చి సేవ చేస్తాను కానీ ఈ అడవిని మాత్రం ఎప్పటికీ వదలను" అని తేల్చి చెప్పేస్తుంది లక్ష్మి. కాస్తం గుర్తింపు రాగానే మూలాలు మర్చిపోయే మనుషులున్న ఈ రోజుల్లో... అడవి తల్లికే తన జీవితం అంట్లోన్న లక్ష్మికుట్టిని అభినందించి తీరాలి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కాస్ట్ లీ ఎక్విప్ మెంట్ తో లభించే వైద్యాన్ని కేవలం ఆకులు, వేర్లతో అందిస్తోన్న ఆమె ప్రతిభకి హ్యాట్సాఫ్ చెప్పి తీరాలి! - Sameera