ఇంగ్లండ్‌ ప్రధాని థెరెసా- ఎందుకంత ప్రత్యేకం!

 

ఐరోపా సమాఖ్య నుంచి ఇంగ్లండ్‌ తప్పుకోనుందని తెలియగానే ప్రపంచం విస్తుబోయింది. మిగతా దేశాలను కాదని తమ కాళ్ల మీదే తాము నిలబడాలనుకున్న ఇంగ్లండ్‌వాసుల నిర్ణయాన్ని వెక్కిరించింది. కానీ ఇంగ్లండు దేశ ప్రజలు మాత్రం, ఇది తమ సత్తాను చాటుకునే సందర్భంగా భావిస్తున్నారు. ఓ కొత్త ప్రధాని వారి ఆశలకు అండగా నిలుస్తున్నారు. ఆమే థెరెసా మే! సంక్షోభ సమయంలో ఎవరో ఒకరిని ప్రధానిగా ఎన్నుకోవాలి కాబట్టి థెరెసాను నిలబెట్టారనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఆమె జీవితాన్ని తరచి చూసిని వారెవరికైనా ఆమె ఆషామాషీ మనిషి కాదని ఇట్టే అర్థమైపోతుంది.

పనిమనుషుల కుటుంబం!

థెరెసా చాలా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఆమె అమ్మమ్మ, నానమ్మ ఇద్దరూ కూడా ఇళ్లలో పనివారుగా జీవనాన్ని సాగించేవారట. థెరెసా తండ్రి చర్చిలో చిరుద్యోగిగా పనిచస్తూ అంచెలంచెలుగా ఓ ఉన్నతాధికారిగా మారాడు. కుటుంబ పరిస్థితులు ఎలా సాగుతున్నా, థెరెసా మాత్రం చదువులో ఒకో అడుగే వేసుకుంటూ పోయారు. 1977 నాటికి ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పట్టాను చేజిక్కించుకున్నారు.

తల్లిదండ్రులు దూరం

చదువు పూర్తయిన వెంటనే థెరెసా బ్యాంకింగ్ రంగంలో స్థిరపడ్డారు. జీవితం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందనుకునే సమయంలో మరో విషాదం ఆమెను వెన్నంటింది. 1981లో థెరెసా తండ్రి ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించారు. ఇది జరిగిన మరి కొద్ది రోజులకే ఆమె తల్లి నాడీసంబంధ వ్యాధితో (multiple sclerosis) కన్నుమూసింది. ఆ సమయంలో తీవ్రమైన డిప్రెషన్‌లోకి చేరుకున్న థెరెసాకు ఆమె భర్త ఫిలిప్‌ అండగా నిలిచాడు.

 

సంతానం లేదు!

థెరెసా ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో ఆమెకు ఫిలిప్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయానికి కారణం పాకిస్తాన్‌ నేత బెనజీర్‌ భుట్టోయే అంటారు. క్రమేపీ ఈ పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ, వివాహానికి (1980) దారితీసింది. థెరెసాకంటే ఫిలిప్ రెండేళ్లు చిన్నవాడు. ఆ దూరం వారిద్దరినీ బాధించలేదు కానీ... వారిద్దరికీ మధ్య సంతానం కలిగే అవకాశం లేదని తేలడమే ఆ దంపతులను బాధించేది. ‘ఇతరుల కుటుంబాలను చూసినప్పుడు, మా దగ్గర లేనిదేదో వారికి దక్కిందని అర్థమవుతూ ఉంటుంది’ అంటూ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు థెరెసా. కానీ ఆ దుఃఖాన్ని తన మనసులోనే దాచుకుని జీవితంలో సాగిపోయారు.

టైప్‌ I డయాబెటిస్

గత నాలుగు సంవత్సరాలుగా టైప్‌ I డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. డయాబెటిక్‌ రోగులలో ఈ తరహా వ్యాధి కేవలం 5-10 శాతం మందిలో మాత్రమే కనిపిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు నిరంతరం తమ శరీరంలోని చక్కెర నిల్వలను పరీక్షించుకోవలసి ఉంటుంది. పైగా వారి శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి తగినంతగా జరగదు కనుక, జీవితాంతమూ ఇంజక్షన్ల ద్వారా ఇన్సులిన్‌ను తీసుకోవలని ఉంటుంది. ఇదెంతటి బాధాకరమైన పరిస్థితో అర్థం చేసుకోవచ్చు.

అయితేనేం!

సాధారణ కుటుంబ నేపథ్యం, యుక్తవయసులో తల్లదండ్రులు దూరం, సంతానం లేదు, నయం కాని చక్కెర వ్యాధి, తనకంటే చిన్నవాడైన భర్త... చాలామంది ‘కష్టం’ అనుకునే విషయాలనే ఇవన్నీ! కానీ మొదటి నుంచీ రాజకీయాలలో చురుగ్గా ఉన్న థెరెసాను ఈ ఇబ్బందులేవీ అడ్డుకోలేదు. ఆమె సంకల్పాన్ని ఇవి ఏరకంగానూ నీరుగార్చలేదు. అసలు ఇవి కష్టాలే కాదన్నట్లుగా ఆమె ముందుకు సాగిపోయారు.

సుదీర్ఘ కాలం కన్జర్వేటివ్‌ పార్టీతో అనుబంధం ఉన్న థెరెసాను, 2010లో బ్రిటన్‌ హోం శాఖ కార్యదర్శిగా నియమించారు. ఆ సమయంలో థెరెసా చూపించిన తెగువ అసాధారణం. ఉగ్రవాదం, గృహహింస, మత్తుపదార్థాలు... ఇలా ఒకటేమిటి! థెరెసా అన్ని సమస్యలనూ ఒక దారికి తెచ్చారు. మన దేశంలో కొందరు, ప్రమాదకారిగా అనుమానిస్తున్న జకీర్‌ నాయక్‌ను తమ దేశంలోకి అడుగు పెట్టనీయకుండా 2010లోనే నిషేధాన్ని విధించారు. అందుకే మాజీ ఇంగ్లండ్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌కు ఏమాత్రం తీసిపోని ఉక్కుమహిళగా ప్రపంచం థెరెసాను కీర్తిస్తోంది. ఇక కష్టాలు ఆమెను చూసి తలవంచక ఏం చేస్తాయి!

- నిర్జర.