భీష్మ మూవీ రివ్యూ
on Feb 21, 2020
నటీనటులు: నితిన్, రష్మిక, అనంత్ నాగ్, వెన్నెల కిషోర్, రఘుబాబు, బ్రహ్మాజీ, సంపత్ తదితరులు
ఎడిటింగ్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
సంగీతం: మహతి స్వర సాగర్
సమర్పణ: పీడీవీ ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: వెంకీ కుడుముల
విడుదల తేదీ: 21 ఫిబ్రవరి 2020
నితిన్ హీరోగా నటించిన లాస్ట్ మూడు సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయినా... 'భీష్మ'పై క్రేజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగా సినిమా ఉందా? దర్శకుడిగా తొలి సినిమా 'ఛలో'తో హిట్ కొట్టిన వెంకీ కుడుముల ద్వితీయ విఘ్నం దాటాడా? రెండో సినిమాతో హిట్ అందుకున్నారు? రివ్యూ చదివి తెలుసుకోండి.
కథ:
భీష్మ ఆర్గానిక్ ఎండీ భీష్మ (అనంత్ నాగ్) బ్రహ్మచారి. యాభై ఏళ్ల చరిత్ర, ఎనిమిది వేల కోట్ల ఆస్తి కల తన కంపెనీకి సరైన వారసుణ్ణి, కాబోయే సీఈవోను త్వరలో ప్రకటిస్తానని చెప్తాడు. అదే కంపెనీలో ఏసీపీ దేవా (సంపత్ రాజ్) కుమార్తె చైత్ర (రష్మిక) పని చేస్తుంటుంది. డిగ్రీ ఫెయిల్ అయిన కుర్రాడు భీష్మ (నితిన్)తో ఆమె ప్రేమలో పడుతుంది. డిగ్రీ ఫెయిల్ అయిన కుర్రాడిని మంచి ఉద్యోగంలో అమ్మాయి ఎలా ప్రేమించిందనేది ఒక క్వశ్చన్ అయితే... అతడిని పెద్ద భీష్మ కంపెనీ సీఈవోగా ఎలా ప్రకటించారనేది మరో క్వశ్చన్. కంపెనీ ఆపరేషనల్ సీఈవోగా 30 రోజుల్లో భీష్మ తన ప్రతిభను నిరూపించుకోకపోతే ఉద్యోగం నుండి తీసేస్తామని ఒక షరతు పెడతారు. యంగ్ భీష్మ తన ప్రతిభను ఎలా నిరూపించుకున్నాడు? మధ్యలో భీష్మ ఆర్గానిక్స్ కంపెనీకి, రాఘవన్ (జిష్షు సేన్ గుప్తా)కి చెందిన ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ కంపెనీకి మధ్య గొడవ ఏంటి? అనేది సినిమా.
విశ్లేషణ:
కథగా చెప్పుకోవాలంటే భీష్మలో పెద్ద విషయం లేదు. కానీ, కామెడీ బావుంది. అన్నిటి కంటే ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా సినిమా ఉంది. సినిమా ప్రారంభం చాలా సాదాసీదాగా ఉంది. ఒక ప్రీ వెడ్డింగ్ పార్టీకి వెళ్లిన హీరో, పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఐఏఎస్ అని చెబితే... ఆమె హీరోతో వచ్చేయడం వంటివి నమ్మశక్యంగా అనిపించవు. కానీ, అక్కడ దర్శకుడు రాసిన కొన్ని డైలాగులు నవ్విస్తాయి. తర్వాత ఆ సీన్ బేస్ చేసుకుని రాసిన వెన్నెల కిషోర్ ట్రాక్ బావుంది. నిజం చెప్పాలంటే... కథ కంటే కథలో సన్నివేశాలు బావుంటాయి. సమయం, సందర్భం చిక్కిన ప్రతిసారీ దర్శకుడు నవ్వించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో విజయం సాధించారు కూడా! మీమ్స్ మీద బేస్ చేసుకుని రాసిన డైలాగులు నవ్వు తెప్పిస్తాయి. అయితే... కథ విషయంలో చిన్న అసంతృప్తి ఉంటుంది. ఇంటర్వెల్ వరకూ కథ పెద్దగా ముందుకు కదలదు. హీరో నితిన్ ఇంట్రడక్షన్, హీరోయిన్ రష్మికకు అతడు లైన్ వేసే సీన్స్, మధ్యలో కొంచెం కంపెనీ గొడవలు టచ్ చేస్తూ సరదా సరదాగా వెళుతుంది. ఇంటర్వెల్ తర్వాత కథలోకి వెళ్లడంతో కొంచెం వినోదం తగ్గుతుంది. అక్కడక్కడా బోరింగ్ మూమెంట్స్ తగ్గుతాయి. కానీ, పాటలు స్టయిలిష్ ఫైటులతో మేనేజ్ చేశారు. అయితే... రైతుల భావోద్వేగాలు, రసాయనాలతో పంటలు పండించడం వల్ల వచ్చే అనర్థాలను కొంచెం లోతుగా చూపిస్తే బావుండేది. క్లైమాక్స్ తేల్చేసినట్టు ఉంటుంది. ఒక్క డైలాగ్ కి అమ్మాయి ప్రేమలో పడిపోవడం మరీ సినిమాటిక్ గా ఉంది. విలనిజం కూడా సరిగా పండలేదు. సినిమాలో అడుగడుగునా దర్శకుడి టేకింగ్, కామెడీ రైటింగ్ కనిపిస్తాయి. అతడికి సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ చక్కటి సహాయ సహకారాలు అందించారు. సెకండాఫ్ లో వెంకట్ మాస్టర్ డిజైన్ చేసిన ఫైట్ బావుంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
వినోదం, దర్శకత్వం
ముఖ్యంగా సంభాషణలు
నితిన్-రష్మిక కెమిస్ట్రీ
'వెన్నెల' కిషోర్ ట్రాక్
నటీనటులంతా బాగా చేశారు
పాటలు, ఫైట్లు
మైనస్ పాయింట్స్:
కథ, స్క్రీన్ ప్లే
కథలో కాంఫ్లిక్ట్స్
విలనిజం
రైతుల ఎమోషన్స్ ఇంకా చూపించాల్సింది.
నటీనటుల పనితీరు:
నటుడిగా నితిన్ కి సవాల్ విసిరే పాత్ర కాదు. కానీ, నటుడిగా అతడిని చక్కగా చూపించిన పాత్ర భీష్మ. సినిమాలో నితిన్ చాలా స్టయిలిష్ గా ఉన్నారు. డాన్సులు బాగా చేశారు. కామెడీ టైమింగ్ బావుంది. నితిన్-రష్మిక మధ్య కెమిస్ట్రీ కుదిరింది. 'వాటే వాటే బ్యూటీ'లో నితిన్ కంటే ఆమె డాన్సు బాగా చేసింది. వీళ్లిద్దరి తర్వాత అంతగా ఆకట్టుకున్న నటుడు 'వెన్నెల' కిషోర్. తనదైన శైలిలో నవ్వించాడు. మిగతా నటీనటులందరూ బాగా చేశారు. హెబ్బా పటేల్ రెండు సన్నివేశాల్లో కనిపించింది.
తెలుగుఒన్ పర్ స్పెక్టివ్:
ఒక సింపుల్ అండ్ స్టయిలిష్ సినిమా 'భీష్మ'. గొప్ప కథ, కథనాలు లేవు. కానీ, కామెడీ విషయంలో ఏ లోటు చేయకుండా నవ్విస్తుంది. నితిన్-సంపత్ మధ్య వాట్సాప్ చాట్ సీన్ కావొచ్చు, కారులో రష్మికకు ముద్దులు పెడుతున్నట్టు నితిన్ కలరింగ్ ఇచ్చే సీన్ కావొచ్చు. 'వెన్నెల' కిషోర్ ట్రాక్ కావొచ్చు... సినిమాలో నవ్వులకు లోటు ఉండదు. సరదాగా ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు వెళ్లి కాసేపు కాలక్షేపం చేయవచ్చు. ప్రతి సన్నివేశంలో కన్వీనియంట్ గా కామెడీ చేశారు దర్శకుడు.
రేటింగ్: 3/5