'అంధాధున్' తెలుగు రీమేక్ మొదలైంది
on Feb 24, 2020
నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తోన్న సినిమా సోమవారం ప్రారంభమైంది. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'అంధాధున్'కు ఇది రీమేక్. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 6గా ఈ చిత్రాన్ని ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు.
ప్రారంభ వేడుకలో సినిమా యూనిట్‌కు సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సన్నివేశానికి 'సైరా' డైరెక్టర్ సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. జూన్‌లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఈ చిత్రానికి హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మిగతా టెక్నీషియన్స్, యాక్టర్ల ఎంపిక జరుగుతోంది. డైరెక్టర్ గాంధీ మాటలను కూడా రాస్తున్నాడు. నితిన్ ప్రస్తుతం 'భీష్మ' సినిమా సూపర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
ఆయుష్మాన్ ఖురానా అంధుడిగా నటించిన బాలీవుడ్ మూవీ 'అంధాధున్' బ్లాక్‌బస్టర్ హిట్టయింది. శ్రీరం రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించగా, కథకు అత్యంత కీలకమైన ఒక పాత్రను టబు చేశారు. తెలుగు వెర్షన్‌లో ఆమె పాత్రను ఎవరు చేస్తారనేది ఆసక్తికరం.