'భీష్మ' ఈవెంట్‌లో 'సరిలేరు నీకెవ్వరు' సందడి!
on Mar 1, 2020
అవును. 'భీష్మ' థాంక్స్ మీట్‌లో 'సరిలేరు నీకెవ్వరు' సందడి బాగా కనిపించింది. ఈ రెండు సినిమాల్లోనూ రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. వైజాగ్‌లో శనివారం రాత్రి జరిగిన 'భీష్మ' థాంక్స్ మీట్‌కు రష్మిక హాజరయ్యింది. ఆమెపై హీరో నితిన్, చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న వరుణ్ తేజ్ ప్రశంసల వర్షం కురిపించారు.
నితిన్ తన ప్రసంగంలో "రష్మిక గారు చాలా చాలా బాగా చేశారు. మా ఫస్ట్ కాంబినేషన్ మంచి హిట్టయింది. మా ఇద్దరి కాంబినేషన్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నాడు. అంతటితో ఆగకుండా "ఈ సినిమాలో ఆమె డాన్సులు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్" అంటూ ఆ డైలాగ్‌ను 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో రష్మిక ఎలాగైతే భుజాలు పైకెత్తి చెప్తుందో, అదే తరహాలో చెప్పాడు. అంతేనా! స్టేజి మీదే ఉన్న రష్మిక వైపు తిరిగి, "ఏవండీ మీకు అర్థమవుతుందా!" అని అదే సినిమాలో రష్మిక మేనరిజంను అనుకరించాడు. దాంతో ప్రేక్షకులు ఈలలతో సందడి చేశారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ "రష్మిక గ్రేట్ ట్రాక్ లో ఉంది. ఈ సంవత్సరం 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ'.. ఇదివరకు 'గీత గోవిందం', 'ఛలో' సినిమాలు చేసింది. తను మంచి టాలెంట్ ఉన్న నటి. తనతో చేస్తే సినిమా హిట్టవుతుందని అంటారు. బహుశా త్వరలోనే ఆమెతో కలిసి చెయ్యాలని ఆశిస్తున్నా" అని తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు. సందర్భవశాత్తూ శనివారం (ఫిబ్రవరి 29) 'సరిలేరు నీకెవ్వరు' మూవీ థియేటర్లలో 50 రోజులు పూర్తిచేసుకోవడం గమనార్హం. అదే రోజు రష్మికకు 'భీష్మ' వేదికపై మంచి ట్రీట్ లభించినట్లయింది.