'భీష్మ' బాక్సాఫీస్: నితిన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్!
on Feb 22, 2020
హ్యాట్రిక్ ఫ్లాపులతో కెరీర్‌లో క్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్న నితిన్.. ఎట్టకేలకు రిలీఫ్ ఫీలయ్యాడు. అతని లేటెస్ట్ ఫిల్మ్ 'భీష్మ' ట్రేడ్ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తూ తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.3 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి, అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అంతే కాదు, సంక్రాతి సినిమాలు 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' తర్వాత మంచి ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా కూడా నిలిచింది 'భీష్మ'. తొలి సినిమా 'ఛలో' తోటే ఫిల్మ్ ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల, ఇప్పుడు ద్వితీయ విఘ్నాన్ని అధిగమించి, వరుసగా రెండో హిట్ సాధించాడు. ఆదయంతం ప్రేక్షకుల ముఖాలపై నవ్వులు పూయిస్తూ, వాళ్లను ఆహ్లాదర్పరుస్తున్న ఈ మూవీలో నితిన్ జోడీగా తొలిసారి రష్మికా మందన్న నటించింది.
విడుదలకు ముందే పాజిటివ్ బజ్ సాధించిన 'భీష్మ' మూవీ నైజాంలో తొలిరోజు 2.2 కోట్ల రూపాయల షేర్ సాధించగా, ఆంధ్ర, రాయలసీమ ఏరియాలు కలిపి 4.1 కోట్ల రూపాయలు రాబట్టడం విశేషం. సీడెడ్‌లో 80 లక్షల రూపాయలు రాగా, 3.3 కోట్ల రూపాయలు ఆంధ్రా రీజియన్ నుంచి వచ్చాయి. అంటే నైజాంను మించి ఆంధ్రా ప్రేక్షకులే 'భీష్మ'ను తొలిరోజు ఎక్కువగా ఆదరించారని అర్థమవుతోంది. ఈ స్థాయిలో వసూళ్లు రావడంతో నితిన్, అతని ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. నితిన్‌పై నమ్మకాన్ని ఉంచి ఈ సినిమా నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సంబరాల్లో మునిగి తేలుతున్నాడు.
నిజానికి కథగా చెప్పుకోవాలంటే 'భీష్మ'లో పెద్ద విషయం లేదు. కానీ ప్రేక్షకులకు మంచి కాలక్షేపం అందించింది. అన్నిటి కంటే ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఆరోగ్యకరమైన హాస్యం ఉండటం సినిమాకు పెద్ద ప్లస్సయింది. ఒక ప్రీ వెడ్డింగ్ పార్టీకి వెళ్లిన నితిన్, అక్కడ పెళ్లికూతురితో తాను ఐఏఎస్ అని చెబితే, ఆమె అతనితో వచ్చేయడం మామూలుగా అయితే లాజికల్ కాదు. కానీ, అక్కడి డైలాగ్స్ బాగా నవ్వించి, ప్రేక్షకులు లాజిక్‌ను మర్చిపోయేలా చేశాయి. అదే సీన్‌ను ఆధారం చేసుకొని వెన్నెల కిషోర్‌పై తీసిన కామెడీ ట్రాక్ మరింతగా నవ్వించింది.
మీమ్స్ మీద బేస్ చేసుకుని రాసిన డైలాగులు ఆహ్లాదాన్ని పంచాయి. హీరో నితిన్ ఇంట్రడక్షన్, హీరోయిన్ రష్మికకు అతడు లైన్ వేసే సీన్స్, మధ్యలో కొంచెం కంపెనీ గొడవలు టచ్ చేస్తూ సినిమా ఫస్టాఫ్ అంతా సరదాగా నడిచింది. ఇంటర్వెల్ తర్వాత కామెడీ సీన్స్ తగ్గినప్పటికీ, పాటలు, స్టయిలిష్ ఫైట్లతో మేనేజ్ చేశారు. సినిమాలో అడుగడుగునా డైరెక్టర్ టేకింగ్, కామెడీ రైటింగ్ కనిపిస్తాయి. సెకండాఫ్‌లో వెంకట్ మాస్టర్ డిజైన్ చేసిన ఫైట్ బావుందని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇచ్చిన కితాబులో నిజం ఉంది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాని ఆకర్షణీయంగా తయారుచేశాయని చెప్పాలి. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీకి, మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ తోడై అనేక సన్నివేశాలు, ఫైట్లు ప్రేక్షకుల హృదయాల్ని రంజింపజేశాయి. పాటల మ్యూజిక్ ఇప్పుడున్న దానికంటే ఇంకా బాగుంటే, సినిమా హిట్ రేంజ్ ఇంకా పెద్దదిగా ఉండేదనేది విశ్లేషకుల అభిప్రాయం.
ఇప్పటివరకూ త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అ ఆ' మూవీ నితిన్ కెరీర్ బెస్ట్ మూవీ. ఏపీ, తెలంగాణలో ఆ సినిమా ఓవరాల్‌గా 31.7 కోట్ల రూపాయల షేర్ సాధించింది. వరల్డ్‌వైడ్‌గా చూసుకుంటే, 47 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఆ సినిమా ఏపీ, తెలంగాణలో ఫస్ట్ డే కలెక్ట్ చేసిన 5.55 కోట్ల రూపాయల షేర్‌ను 'భీష్మ' మూవీ దాటేసింది. సందర్భవశాత్తూ 'అ ఆ' మూవీకి త్రివిక్రమ్ దగ్గర వెంకీ కుడుముల అసిస్టెంట్‌గా పనిచేశాడు. అంటే నితిన్‌కు తన గురువు ఇచ్చిన ఓపెనింగ్స్ కంటే వెంకీ ఎక్కువ ఓపెనింగ్స్ ఇచ్చాడన్న మాట. మరి ఓవరాల్ కలెక్షన్స్ విషయంలోనూ అతను గురువును దాటుతాడో, లేదో చూడాలి.
టేకింగ్ పరంగా వెంకీ తన గురువును అనుసరించాడనేది స్పష్టం. త్రివిక్రమ్ సినిమాల్లో హెవీ సీన్స్ ఉండవు. హీరోలోని నటుడ్ని బాగా ఎలివేట్ చేసే ఎమోషనల్ సీన్స్ ఉండవు. లైటర్ వీన్‌లో, సన్నివేశాలు సరదా సరదాగా సాగుతూ, ఆహ్లాదాన్ని పంచుతాయి. వెంకీ కుడుముల సైతం అదే ఫార్మట్‌ను అనుసరించి 'భీష్మ'ను రూపొందించాడు. అంటే, 'భీష్మ' అనేది నటుడిగా నితిన్‌కి సవాల్ విసిరే పాత్ర కాదు. కానీ, ఆ పాత్రలో నితిన్ చక్కగా ఒదిగిపోయాడు. చాలా స్టయిలిష్‌గా దాన్ని చేశాడు. చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ ఆకలి తీరేలే డాన్సులు బాగా చేశాడు. అతడి కామెడీ టైమింగ్ బావుంది. నితిన్-రష్మిక మధ్య కెమిస్ట్రీ అలరించింది. 'వాటే వాటే బ్యూటీ'లో నితిన్ కంటే ఆమె డాన్సు బాగా చేసింది. వీళ్లిద్దరి తర్వాత అంతగా ఆకట్టుకున్న నటుడు వెన్నెల కిషోర్. తనదైన శైలిలో నవ్వించాడు. అందుకే 'భీష్మ' ఆకట్టుకుంటున్నాడు, అలరిస్తున్నాడు.