నితిన్ నంబర్ వన్ పవన్ కల్యాణ్ ఫ్యాన్: వరుణ్ తేజ్ రేటింగ్!
on Mar 1, 2020
"నేను చిన్నప్పట్నుంచీ కల్యాణ్ బాబాయ్ ఇంట్లో పెరిగాను. రక్త సంబంధం కాబట్టి నేను ఆయనకు అభిమానినవడం పెద్ద విషయం కాదు. కానీ నేను రేటింగ్ ఇస్త్తున్నా.. నితిన్ నంబర్ వన్ పవన్ కల్యాణ్ గారి ఫ్యాన్. కచ్చితంగా నితిన్ కు కల్యాణ్ బాబాయ్ అభిమానుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది" అని చెప్పాడు ఫ్యాన్స్ ప్రేమగా మెగా ప్రిన్స్ అని పిలుచుకొనే వరుణ్ తేజ్. నితిన్ టైటిల్ రోల్ పోషించిన 'భీష్మ' మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి వైజాగ్‌లో థాంక్ యు మీట్ నిర్వహించారు. ఈ విజయోత్సవంలో 'భీష్మ' డిస్ట్రిబ్యూటర్లకు, యూనిట్ మెంబర్లకు వరుణ్ తేజ్, నితిన్, రష్మిక, వెంకీ జ్ఞాపికలను అందజేశారు. వరుణ్ తేజ్ నుంచి నిర్మాత నాగవంశీ, డైరెక్టర్ వెంకీ, హీరోయిన్ రష్మిక, హీరో నితిన్ జ్ఞాపికలను అందుకున్నారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ, "నేనిక్కడకు ఒక చీఫ్ గెస్టులా కాకుండా నా ఫ్రెండ్ నితిన్ సక్సెస్‌ను ఎంజాయ్ చెయ్యడానికి వచ్చాను. ఈ సినిమా స్టార్ట్ చెయ్యక ముందు నుంచీ, ఒకటిన్నర సంవత్సరంగా నితిన్, నేను కలిసి ట్రావెల్ చేశాం. ఈ సినిమా స్టోరీ నాకు ముందే చెప్పాడు. సాంగ్స్ ముందే చూపించాడు. సినిమా మంచి హిట్టవ్వాలని కోరుకున్నా. నిజంగా నా సినిమా హిట్టయితే ఎంత హ్యాపీగా ఫీలవుతానో, దానికంటే ఎక్కువగా నితిన్ సినిమా సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీలయ్యాను. వెంకీ కుడుముల ఇదివరకు తీసిన 'ఛలో' సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. సాధారణంగా ఇండస్ట్రీలో సెకండ్ సినిమా హిట్ కొట్టడం కొంచెం కష్టమంటారు. వెంకీ ఆ పరీక్ష పాసయ్యాడు. అతను ఇంకా ఎన్నో ఎన్నో సక్సెస్‌లు కొట్టాలని కోరుకుంటున్నా. రష్మిక గ్రేట్ ట్రాక్‌లో ఉంది. ఈ సంవత్సరం 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ'.. ఇదివరకు 'గీత గోవిందం', 'ఛలో' సినిమాలు చేసింది. తను మంచి టాలెంట్ ఉన్న నటి. తనతో చేస్తే సినిమా హిట్టవుతుందని అంటారు. బహుశా త్వరలోనే ఆమెతో కలిసి చెయ్యాలని ఆశిస్తున్నా. నిర్మాత నాగవంశీ ఈ ఏడాది మొదట్లో 'అల.. వైకుంఠపురములో'తో పెద్ద సక్సెస్ కొట్టి, ఇప్పుడు 'భీష్మ'తో కంటిన్యూ చెయ్యడం మామూలు విషయం కాదు. నేను చిన్నప్పట్నుంచీ మణిశర్మ గారికి పెద్ద అభిమానిని. చిరంజీవి గారు, మణిశర్మ గార్ల కాంబినేషన్ అంటే చొక్కాలు చించేసుకొనేవాళ్లం. వాళ్లబ్బాయి సాగర్ వచ్చి ఇంత మంచి ఆడియో ఇవ్వడం హ్యాపీ. ఇటీవల మణిశర్మ గారిని కలిస్తే, ఆయన కళ్లల్లో కొడుకు సక్సెస్ సాధించాడనే గర్వం కనిపించింది. నితిన్‌ను చూసి చాలా హ్యాపీ ఫీలవుతున్నా. ఈ మధ్యనే మేం బాగా సన్నిహితులమయ్యాం. అతనితో ఈ స్నేహం కొనసాగాలని కోరుకుంటున్నా. 'భీష్మ'ను మళ్లీ మళ్లీ చూసి ఇంకా పెద్ద సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నా" అని చెప్పాడు.