చిరంజీవి, విజయశాంతిల రసవత్తర రి-యూనియన్ స్టోరీ...
on Jan 6, 2020
ఆయన మెగాస్టార్.. ఆమె లేడీ సూపర్ స్టార్ లేదంటే లేడీ అమితాబ్.. ఇరవై ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుసుకున్నారు. అలనాటి సంగతులు జ్ఞాపకం చేసుకున్నారు. చిన్న చిన్నగా మందలించుకున్నారు. ఒకరినొకరు కావలించుకున్నారు. ఆయన చేతులు చాపాడు.. ఆమె ఆయన దగ్గరకు వచ్చి గుండెపై తలవాల్చింది. ఆయన ఆమెను పొదివి పట్టుకొని కావలించుకున్నాడు.. ఈ అరుదైన, అపురూప ఘట్టం నిజంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నిజంగా ఇరవై ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. దీనికి వేదికగా నిల్చింది హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సూపర్ స్టార్ మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' ప్రి రిలీజ్ ఈవెంట్. ఈ ఈవెంట్‌కు చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఆ సినిమాలో ప్రొఫెసర్ భారతి అనే కీలక పాత్ర చేసిన విజయశాంతి ఒక నటిగా ఈవెంట్‌కు వచ్చారు. ఒక వైపు మెగాస్టార్‌ను, మరోవైపు సూపర్‌స్టార్‌ను పట్టుకొని, తను మధ్యలో నిల్చొని ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చారు విజయశాంతి.
అయితే అక్కడున్నవాళ్లు ఏమాత్రం ఊహించని ఘట్టం మాత్రం ఈవెంట్ చివరలో మెగాస్టార్ ప్రసంగం సందర్భంగా చోటుచేసుకుంది. వేదికపై చిరంజీవి, విజయశాంతి మధ్య జరిగిన రి-యూనియన్ ఎంత రసవత్తరంగా, కన్నుల పండుగగా జరిగిందో.. ఉన్నదున్నట్లు కథ తరహాలో చెప్పుకుందామా..
"ఇవాళ సండే. 'సండే అనకురా మండే అనకురా.. ఎన్నడు నీదాన్నరా' అని మాట ఇచ్చి, నా మనిషిగా, నా సినిమాల్లో హీరోయిన్‌గా నన్ను వదిలేసి, పదిహేను సంవత్సరాలు దూరంగా వెళ్లిపోయి, మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కనిపించింది విజయశాంతి.. నా హీరోయిన్" అని చిరంజీవి ఎమోషనల్ అవుతుంటే, చిరునవ్వులు చిందిస్తూ మహేశ్ పక్కన నిల్చొని ఉన్న విజయశాంతి, ముదుకు వచ్చి, చిరంజీవి నడుముపై చేయివేసి నిల్చుంది. దాంతో ఆమె భుజం పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు చిరంజీవి. ఇద్దరూ ఒకరి తలకు ఇంకొకరి తల ఆనించారు.
"విజయశాంతితోటి నాకు చాలా ఎమోషన్. ఎంత కుటుంబ సభ్యుల్లా ఉండేవాళ్లమంటే, హీరో హీరోయిన్లుగా కాదు.. టి. నగర్‌లో మా ఇంటి ఎదురుగానే ఉండేది. ఫ్యామిలీ పరంగా కలిసేవాళ్లం. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, నా ఇంటికి తను, తన ఇంటికి నేను వెళ్లేవాళ్లం. ఇద్దరం కలిసి దాదాపు పందొమ్మిది ఇరవై సినిమాలు చేశాం. ఎంత చక్కగా, ఎంత హుషారుగా, ఎంత కలిసిమెలిసి చేసేవాళ్లమో, ఎంత ఫ్రెండ్లీగా చేసేవాళ్లమో.." అంటూ ఆమె వైపు తిరిగి.. "అయితే విజయశాంతి నీ మీద చిన్న కోపం ఉంది" అన్నాడు గొంతు తగ్గించి. అతని చేతిలోని మైకును తనవైపుకు వంచి "ఎందుకు?" అనడిగింది విజయశాంతి.
"నాకంటే ముందు నువ్వు పాలిటిక్స్‌కు వెళ్లావు కదా?" అని చిరంజీవి అంటే, "అవును.. ఇరవై రెండేళ్లవుతోంది" అని జవాబిచ్చింది విజయశాంతి.
"కాదు.. నాకంటే ఐదేళ్ల ముందెళ్లావునుకుంటా" అని కాస్త సంశయంగా అడిగాడు చిరంజీవి. ఆయన కళ్లలోకి చూస్తూ, తల ఆడిస్తూ, "లేదు.. ఇరవైరెండేళ్లవుతోంది" అని కా న్ఫిడెంట్‌గా చెప్పింది విజయశాంతి. వెనుకనుంచి ఇదంతా చూస్తూ మహేశ్, రష్మిక నవ్వులు చిందిస్తున్నారు.
జనం వైపు తిరిగి "సారీ.. మేం కొంచెం రహస్యంగా మాట్లాడుకుంటున్నాం.." అంటూ తనూ నవ్వాడు చిరంజీవి.
"సరే.. ఏమైనా కానీ నా కంటే ముందే వెళ్లావు కదా.. నన్ను మాటలనాలని ఎలా మనసొచ్చింది చెప్పు" అని కాస్త దీనంగా అడిగాడు చిరంజీవి. వెంటనే నోటిపై చెయ్యోసుకొని, జనం వైపు తిరిగి నవ్వింది విజయశాంతి. ఆ మాటలంటూ చిరంజీవి వెనక్కి తిరిగాడు. ఆయన చేతిలోని మైకు తీసుకోబోతుంటే, మైకు ఆమెకు అందకుండా చేయి అవతలికి చాపాడు. "మైకు" అని ఆమె ఇంకో మైకు కోసం అడుగుతుంటే, అప్పుడు తన చేతిలోని మైకును ఆమెకు అందించాడు చిరంజీవి.
ఒక చేత్తో మైకు, ఇంకో చేత్తో చిరంజీవి చేతిని పట్టుకొని, "పంచ్ డైలాగ్ వేశాడీయన.." అని, చిరంజీవి వైపు తిరిగి, ఆయన చేతిని పట్టుకొన్న తన చేతిని పైకెత్తి, "చెయ్యి చూశావా.. ఎంత రఫ్ఫుగా ఉందో.. రఫ్ఫాడించేస్తాను జాగర్త" అంది నవ్వుతూనే. ఆమె నుంచి మైకు తీసుకోవాలని ఆయన ట్రై చెయ్యబోతుంటే, ఇవ్వకుండా అలాగే మైకును పట్టుకుంది విజయశాంతి. ఈలోగా ఒకరు ఇంకో మైకును చిరంజీవి చేతికి అందించారు.
"రాజకీయం వేరు.. సినిమా వేరు.." అంటూ ఆయనను దగ్గరకు లాక్కుని, "అయినా మనమిద్దరం మిత్రులం. మా హీరో మీరు. మీ హీరోయిన్ నేను. ఇద్దరం కలిసి ఇరవై సినిమాలు చేశాం. ఎక్కువ సినిమాలు మీతో చేశాను.." అని విజయశాంతి చెప్తుంటే, "దట్స్ ట్రూ" అన్నాడు చిరంజీవి.
"కదా.. అది కాదనలేరు కదా.. ఆ విషయంలో డౌట్ లేదు కదా" అని ఆమె అడుగుతుంటే, ఆయన "అస్సలు లేదు. అందులో డౌట్ లేదు" అని ఇంకా చెప్పబోతుంటే, "మళ్లీ యాక్ట్ చేద్దామా?" అని ఆమె అడిగింది. "ఛీ.. ఛీ.. ఛీ.. వై నాట్.." అంటూ ఆమెను పట్టుకొని, "ఎన్ని సాంగ్స్. అవన్నీ గుర్తుకుతెచ్చుకుంటే.. ఎంత ఇదిగా ఉంటుందంటే.. అంతా ఇంతా కాదు. 'ఇందువదన కుందరదన మందగమన మధురవచన'.. వ్వావ్.." అని చిరంజీవి అలనాటి తమ పాటల్ని గుర్తుకు తెచ్చుకుంటుంటే.. "ఫ్ల్యాష్‌బ్యాక్‌కు వెళ్లిపోతున్నాం మేమిద్దరం.. అంటే ఆయన్ని చూసి నేను ఇరవై ఏళ్లయిపోయింది కదా" అని ఆమె అడుగుతుంటే.. దానికి జవాబివ్వకుండా చిరంజీవి "వానా వానా వెల్లువాయే" అంటూ 'గ్యాంగ్ లీడర్' సాంగ్‌ను గుర్తు తెచ్చుకుని.. "ఎన్ని సాంగ్స్.. అవన్నీ గుర్తుకొస్తుంటాయ్" అన్నాడు. "మరి అన్ని హిట్ సినిమాలు చేశాం. మీరెలా నన్ను మర్చిపోతారు?" అనడిగింది విజయశాంతి.
ఆమె వైపు తిరిగి, "నిన్ను చూస్తుంటే నాకొకటి అనిపిస్తుంటుంది శాంతీ" అన్నాడు చిరంజీవి. "ఏమని?" అని అడిగిందామె. జనం వైపు తిరిగి, "రాజకీయాల్లోకి వెళ్లిపోయాను. గ్లామర్ పోయింది.. వర్ఛస్సు తగ్గింది.. పొగరు అన్నీ తగ్గినాయ్.. వగరు తగ్గింది, విగరు తగ్గింది.. అనుకుంటున్నారా? పదిహేనేళ్ల తర్వాత వచ్చినా, 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో అదే గ్లామరు, అదే పొగరు, అదే విగరు, అదే అందం, అదే సొగసు.." అని వేలు ఆడిస్తూ చిరంజీవి చెప్తుంటే, ఆమె నోటిపై చేయివేసుకొని ముసిముసినవ్వులు నవ్వింది.
"ఇంతకంటే ఏమిటి విజయశాంతీ.. యస్.. యు ఆర్ ఇన్‌టాక్ట్.. చెక్కు చెదరలేదు. చూస్తుంటే.." అని ఆగి, చేయిని తన గుండె పెట్టుకొని, "ఇక్కడ ఉండాల్సిన గుండె ఠపక్కమని కొంచెం జారుతోంది" అని చేతిని పొట్టమీదికి జార్చాడు చిరంజీవి. "ఆ.." అని ఒక సరసమైన శబ్దం చేశాడు. విజయశాంతి తల ఆడిస్తూ నవ్వుతూ ఉండిపోయింది.
"మళ్లీ వచ్చావు.. చాలా సంతోషం.." అని జనంవైపుకు తిరిగాడు చిరంజీవి. "ఇ క్కడ ఒక విషయం చెప్తున్నానండీ.. రాజకీయాలు శత్రువుల్ని పెంచుతాయి. మా సినీ పరిశ్రమ స్నేహితుల్ని పెంచుతుంది" అని విజయశాంతిని మళ్లీ దగ్గరకు తీసుకున్నాడు.
"నాకు విజయశాంతి మీద ప్రేమ, సెంటిమెంటు.. కొన్ని పరిస్థితుల్లో తను నా మీద కామెంట్ చేసినా, నాకు తిరిగి అనబుద్ధి కాలేదు" అని, ఆమెను వదిలి, ఆమె వంక చూస్తూ, "ఒక్క మాట నిన్ను అన్నానా శాంతీ.. చెప్పు" అనడిగాడు చిరంజీవి. ఆమె నవ్వుతూ అటువైపు తిరిగితే, "ఎక్కడైనా అన్నానా?" అని రెట్టిస్తూ.. "నాకు మనసు రాదు.. అందుకే అనలేకపోయాను. మా విజయశాంతి" అన్నాడు చిరంజీవి.
అప్పుడు విజయశాంతి ఆయన చేయిని పట్టుకొని, "వెనకాల అంటే.. వెనకాల అనలేదు కదా" అంది ఆయన ముఖంలోకి సూటిగా చూస్తూ.. ఆయన "స్వేర్.. స్వేర్" అన్నాడు. ఆమె "ఓకే" అంది. "వెనకాలా.. ముందే అననివాడ్ని వెనకాల అంటానా?" అన్నాడాయన నవ్వుతూ.
"ఎప్పుడూ మీమీద నాకు గౌరవం ఉంది. ఆ గౌరవం, అభిమానం ఉండబట్టి ఇరవై సినిమాలు కలిసి చేశాం. హయ్యెస్ట్ సినిమాలు మీతోనే చేశాను నేను.. యెస్ ఆర్ నో" అని విజయశాంతి అడిగితే, "ఒప్పుకుంటాను.. కానీ" అని చిరంజీవి అంటుంటే, విజయశాంతి జనాన్ని ఉద్దేశించి "తిప్పి తిప్పి ఆయన అక్కడికే వెళ్తున్నాడు.. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. జీవితంలో పోరాడాలి. ఏదేమైనా నేను చేసేది ప్రజల కోసం. వాళ్లు బాగుండాలనే నేను చేస్తున్నాను. కానీ కొన్ని సందర్భాల్లో మాకు తప్పదు. దానికి నేను న్యాయం చేశాను. ఏదేమైనా మా హీరో చిరంజీవి గారు చిరంజీవి గారే.. ఐ స్టిల్ రిమెంబర్ యు.." అని చెప్తుంటే, చిరంజీవి మధ్యలో అందుకుని, "థాంక్యూ.. బట్.. సినిమా ప్రభావం అదండీ.. సినిమా అనేది మనుషుల్ని దగ్గర చేస్తుంది" అని మహేశ్ వైపు తిరిగి, "మహేశ్‌బాబు పుణ్యమా” అంటూ "రండి మహేశ్.." అనగానే, మహేశ్ నవ్వుతూ వాళ్ల దగ్గరకు వచ్చాడు.
“ఇన్ని సంవత్సరాల తర్వాత.. మా ఇద్దరి మధ్య ఒక రకమైన గ్యాప్ ఏర్పడిన మాట వాస్తవం. అది కూడా నేను తెచ్చిపెట్టుకున్నది కాదు. రాజకీయాల్లోకి వెళ్లి తను తెచ్చిపెట్టుకున్నది.. రాజకీయాల్లో ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అన్నట్లు మాట్లాడతారు" అని ఒక్క క్షణం ఆగి, “ఇన్ని సంవత్సరాల సెంటిమెంట్ ఊరికినే పోదు. అందుకే ఇవాళ చెమర్చిన కళ్లతో ఆప్యాయంగా అలాగే చూస్తానే ఉందంటే, ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది! గుండెను టచ్ చేసింది. ఈ అవకాశం ఇచ్చింది మీరు మహేశ్. థాంక్యూ వెరీ మచ్" అంటుంటే, మహేశ్ రెండు చేతుల్నీ ఛాతీ మీద పెట్టుకొని, "నేనేం చేశాను" అంటూ నవ్వేశాడు. "ఇది కావాలని జరిగిందా, కాకతాళీయంగా జరిగిందా.. నాకు తెలియదు కానీ, థాంక్యూ సో మచ్.. నా ఫ్రెండ్‌ని నాతో కలిపేట్లు చేశారు" అంటూ మహేశ్‌తో చిరంజీవి కరచాలనం చేశాడు. ఆ తర్వాత రెండు చేతులూ చాపి ఆయన నిల్చుంటే, విజయశాంతి ఆయన దగ్గరకు వెళ్లి, ఆయన చాతీపై తలవాల్చింది. చిరంజీవి ఆప్యాయంగా ఆమెను కావలించుకున్నాడు. అందరూ కేరింతలు కొడుతూ, చప్పట్లు చరుస్తూ ఆనందాతిరేకాలు వ్యక్తం చేశారు.
తర్వాత దూరం జరిగి, "థాంక్యూ సో మచ్. బాగుంది. ఇట్స్ నైస్. చాలా హృద్యంగా జరుగుతోంది. 'సరిలేరు నీకెవ్వరు' ప్రి రిలీజ్ ఈవెంట్ అనేది ఒక మెమరబుల్ ఈవెంట్" అని చెప్పారు చిరంజీవి.
అలా ఇద్దరు పాత మిత్రుల, అనేక సినిమాల్లో హీరో హీరోయిన్లుగా కలిసి నటించి, అనేక మరపురాని పాటల్లో ఆడిపాడి ప్రేక్షకుల్ని రంజింపజేసిన హిట్ పెయిర్ ఇరవై ఏళ్ల తర్వాత కలిశారు. ఈ రి-యూనియన్ ఘట్టం టాలీవుడ్‌లోని అపురూప ఘట్టాల్లో ఒకటిగా నిలిచిపోతుందనేది నిజం.