ఎన్టీఆర్ ప్లేస్‌లో బిగ్‌బాస్‌గా నాని..?
on Feb 18, 2018
నేచురల్ స్టార్ నానికి లక్ పీక్ స్టేజ్‌లో ఉన్నట్లుంది. హీర్‌గా వరుస విజయాలతో దూసుకెళుతున్న నానికి నిర్మాతగానూ మంచి విజయం దక్కింది. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన "అ!" విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇలాంటి టైంలో నానికి మరో అవకాశం తలుపు తట్టింది. తెలుగు బుల్లితెరపై సంచలనం రేపిన బిగ్‌బాస్ సీజన్-2కు నాని హోస్ట్‌గా వ్యవహరిస్తారని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది.. అందుకు కారణం లేకపోలేదు.. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన సీజన్-1కు మంచి ఆదరణ లభించింది. దీంతో సీజన్-2కు కూడా జూనియర్‌నే యాంకర్‌గా కొనసాగించి షో స్టార్ట్ చేయాలని స్టార్ యజమాన్యం భావించింది.
అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాతో ఆయన బిజీగా ఉన్నారు. అందుకు తగినట్లుగా రెడీ అవుతున్నారు కూడా.. దీని తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌తో కలిసి మల్టీస్టారర్ చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ సీజన్-2కి డేట్లు సర్దుబాటు చేసే అవకాశం లేకపోవడంతో హోస్ట్‌గా వ్యవహరించలేనని ఎన్టీఆర్ చెప్పేశారట. దీంతో ఎన్టీఆర్ ప్లేస్‌లో మరో స్టార్‌ని రిప్లేస్ చేయాలని నిర్వాహకులు భావించారు. కానీ ఆ స్థాయిలో మెప్పింగలిగింది ఎవరా అని వెతికితే.. వారికి నాని దొరికాడు. సహజ నటనతో ఆడియన్స్‌ను ఫిదా చేసి నేచురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. దీనికి తోడు ఐఫా అవార్డ్స్ ఫంక్షన్‌లో రానాతో కలిసి హోస్ట్‌గా చేసిన అనుభవం ఉండటంతో నానిని కన్ఫర్మ్ చేసుకున్నట్లు టాక్. అయితే దీనిపై అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ రావాల్సింది.