ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం?
on Feb 18, 2018
ఆయన సినిమాలు.. సినీ వినీలాకాశంలో వెలుగు రేఖలను విరజిమ్మే స్వాతి కిరణాలు..
ఆయన సినిమాలు... ఏన్నేళ్లయినా వన్నె తరగని స్వచ్ఛమైన స్వాతిముత్యాలు...
ఆయన సినిమాలు... శివచరణ స్వర్ణ కమలాలు...
ఆయన సినిమాలు... శంకరాభరణాలు...
ఆయనే కళాతపస్వి కాశీనాథుని.విశ్వనాథ్. పేరుకు తగ్గట్టు నిజంగా ఆయన కాశీనాథునివాడే. సమస్త కళలూ ఆ విశ్వనాథుని పాదాలనుంచే పుట్టాయంటారు. ఆయన పేరు పెట్టుకొని సార్థకనాముడయ్యాడు కె.విశ్వనాథ్. తన సినిమాల ద్వారా భారతీయ కళలకు పట్టాభిషేకం చేసి ‘కళాతపస్వి’ అనిపించుకున్నాడు.
సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మీయతలు, అనురాగాలు.. ముఖ్యంగా కళలు.. ఇవే కె.విశ్వనాథ్ సినిమాలకు ఆభరణాలు. ఆయన సినిమాల్లో కనిపించేవి అవే.. వినిపించేవి అవే. అమ్మ చేతి గుజ్జనగడంత రుచిగా ఉంటాయ్ ఆయన సినిమాలు. తులసి చెట్టంత పవిత్రంగా ఉంటాయ్ ఆయన కథలు. టీవీల పుణ్యమా అని ఈనాటికీ అవి మనకు ఆనందాన్ని పంచుతూనే ఉన్నాయ్. మరపురాని అనుభూతుల్ని అందిస్తూనే ఉన్నాయ్.
శంకరాభరణం, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వర్ణకమలం, శుభసంకల్పం, శుభోదయం, స్వాతికిరణం.. ఒకటా రెండా? ఎన్ని అద్భుతాలు ఇచ్చాడండీ మనకు! ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం చెప్పండి? తెలుగుతెరపై దశాబ్దాల పాటు కళాత్మక యాగం చేసి.. కళాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు విశ్వనాథ్.
విశ్వనాథ్ ‘శంకరాభరణం’ తీస్తే... తెలుగునేలపై లెక్కలేనన్ని సంగీత పాఠశాలలు వెలిశాయ్. సాగరసంగమం, స్వర్ణకమలం సినిమాల ప్రేరణతో... నాట్యాభ్యాసం చేసినవారైతే కోకొల్లు. భారతీయ కళలలకు అనధికార బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అందులో నో డౌట్.
కె.విశ్వనాథ్ తెలుగు వారి ఆస్తి. మనకు మాత్రమే లభించిన కొన్ని అద్భుతాల్లో కె.విశ్వనాథ్ అనే అద్భుతం ఒకటి. అందులో అతిశయోక్తి లేదు. విశ్వనాథ్ గొప్ప నటుడు. కాబట్టే... ఆయన సినిమాల్లో నటీనటులందరూ అత్యద్భుతంగా నటిస్తారు... అవార్డులు పట్టికెళ్తుంటారు. నటునిగా కూడా తెలుగు తెరపై ఓ స్థాయిలో వెలిగిన మేరు‘నట’ధీరుడు కె.విశ్వనాథ్. నేడు ఆ మహాదర్శకుని పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అందిద్దాం. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో శతాధిక సంవత్సరాలు ఆయన వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం.