మహేశ్‌ను ఫాలో అవుతున్న నాని
on Feb 3, 2020
అవును. ఒక విషయంలో మహేశ్‌ను నాని ఫాలో అవుతున్నాడు. అది.. రీమేక్స్ విషయంలో. మహేశ్ ఇంతవరకు తన కెరీర్‌లో ఒక్క రీమేక్ కూడా చెయ్యలేదు. తనకు రీమేక్స్‌పై ఆసక్తి ఉండదనీ, అప్పటికే మరొకరు చేసిన సినిమాను చెయ్యడం అంటే ఇష్టం ఉండదనీ మహేశ్ పలుమార్లు చెప్పాడు. అందుకే 26 సినిమాలు చేసినా రీమేక్ జోలికే అతను వెళ్లలేదు.
నాని కూడా ప్రస్తుతం అదే బాటలో నడుస్తున్నాడు. తన కెరీర్లో ఇప్పటిదాకా నాని ఒకే ఒక్క రీమేక్ చేశాడు. అది. 'భీమిలి కబడ్డి జట్టు'. తమిళంలో హిట్టయిన 'వెన్నిల కబడ్డి కుళు'కు అది రీమేక్. దాని తర్వాత అతను మళ్లీ మరో రీమేక్ చెయ్యలేదు. కారణం.. రీమేక్స్ మీద అతనికి ఆసక్తి సన్నగిల్లడం. అయినప్పటికీ ఒక చిన్న ఆశతో '96' రీమేక్ 'జాను'ను నానితో చెయ్యాలని దిల్ రాజు ఆశించాడు. ఒరిజినల్‌ను కూడా చూపించాడు. సినిమా తనకు నచ్చిందని నాని చెప్పాడు. "నానికి '96' బాగా నచ్చింది. కానీ రీమేక్స్ మీద ఆసక్తి లేకపోవడంతో అతను ఆ సినిమా చెయ్యడానికి ముందుకు రాలేదు. శర్వానంద్‌కు చూపిస్తే, తనకూ నచ్చింది. 'నువ్వు ఆ సినిమా చేస్తున్నావు' అని శర్వాకు చెప్పాను. ముందు 'క్లాసిక్‌లాగా ఉంది కదా' అన్నాడు. ఒక రోజు టైం తీసుకొని చేస్తానని చెప్పాడు" అని తెలిపాడు దిల్ రాజు.
టాప్ హీరోల్లో రీమేక్స్ చెయ్యని మరో స్టార్ అల్లు అర్జున్. అతను కూడా ఇప్పటిదాకా 19 సినిమాలు చేస్తే వాటిలో ఒక్క రీమేకూ లేదు.