వడ్డించేదెవరు....! అయితే... ఓ.కె.!
Publish Date:Aug 25, 2012
Advertisement
వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో చివరకూర్చున్న భోజనాలు అందుతాయన్నది ఓ సామెత. ఈ సామెత ఎవరు, ఎప్పుడు, ఎక్కడ పుట్టించారో తెలియదు కానీ, ఈ సామెత మాత్రం నేటి అధికారుల బదిలీల విషయంలో నిజమేననిపిస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా... లేదా మంత్రులు మారినప్పుడల్లా.. ఐఎఎస్., ఐ.పి.ఎస్.. తదితర శాఖలలోని వుండే అధికారులను బదిలీలు చేయడం ఆనవాయితీగా మారింది. తమకు నచ్చిన వారిని తమకు ఇష్టమైన స్థానంలో బదిలీచేయించుకుని.. తద్వారా ఏమైనా ప్రజాసేవ చేయిస్తున్నారా! లేక వారి సహాయంతో తాము ప్రజాసేవ చేస్తున్నారా...అంటే అబ్బే... అదేంకాదు.. ఐదేళ్ళపాటు పదవిలో ఉండే (ఇప్పుడయితే వారంరోజులు కావచ్చు, నెలకావచ్చు, సంవత్సరం కావచ్చు) నేతలు తమ పనులు చక్కపెట్టుకోవడానికి తమకిష్టమైన, అనుకూలమైన, తమవారిని ప్రమోషన్లతో బదిలీలు చేయడం పరిపాటైపోయింది. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ)లో పనిచేసిన అనుభవం కలిగిన పరీడాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిదేళ్ళలో పదిసార్లు బదిలీ చేసింది. ఇలా ఎంతోమంది ఐఎఎస్‌లు బదిలీలయ్యారు. ఎప్పటికప్పుడు సాధారణ పరిపాలన ప్రక్రియలో భాగంగానే బదిలీ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినా.. రాజకీయ ఒత్తిళ్లే ప్రధాన భూమిక అన్నది బహిరంగ రహస్యమే! కొన్నిసార్లు నేతలు తమకిష్టంలేని వారిని బదిలీలతో కక్షతీర్చుకుంటుంటే.. ఇంకొందరు అధికారులు తమ కిష్టమైన చోటుకు రాజకీయ ప్రోద్బలంతో బదిలీలను చేయించుకుంటున్నారు. బదిలీలకు కాని, ప్రమోషన్లకు కాని సీనియారిటీ, నిజాయితీలతో పనిలేదని, తమకిష్టమైతే తామున్నన్నాళ్లు తమ వారికీ ఎక్కడికైనా బదిలీ చేయించుకోవచ్చన్నది నేటి రాజకీయసూత్రంగా మారిందంటే అతిశయోక్తికాదు. అధికారుల బదిలీల వ్యవహారంలో ఓ ఖచ్చితమైన నిర్దేశక సూత్రాలను అమలు చేస్తే కొంతలోకొంత పరిపాలన సవ్యంగా సాగుతుందని ప్రజలకు ఓ నమ్మకం వస్తుంది.
http://www.teluguone.com/news/content/transfers-of-ias-and-ips-officers-24-16842.html





