Tank Bund Accident: పుట్టినరోజునాడే విషాదం.. లారీ ఢీకొని చిన్నారి సహా ఇద్దరు మృతి.!
Publish Date:Oct 5, 2026
Advertisement
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది. ఎంతో సంతోషంగా, ఆనందంగా జరగాల్సిన ఆరేళ్ల చిన్నారి పుట్టినరోజు వేడుకలు ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాయి. మేడ్చల్ జిల్లాలోని ఓల్డ్ అల్వాల్, జొన్నబండ ప్రాంతానికి చెందిన సాయినాథ్, అశ్విని దంపతుల కుమార్తె సరాక్షి ఆరేళ్ల పుట్టినరోజును జరుపుకోవడానికి ఆ కుటుంబం ప్లాన్ చేసుకుంది. ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చాలని భావించిన కుటుంబ సభ్యులు, ముందుగా కూకట్‌పల్లిలోని పీవీఆర్ సినిమా థియేటర్‌కు వెళ్లి అక్కడ రాత్రి రెండో ఆట సినిమాను ఆస్వాదించారు. సినిమా ముగిసిన తర్వాత అందరూ కలిసి హుస్సేన్‌సాగర్ తీరాన ఉన్న ట్యాంక్‌బండ్‌పై కేక్ కట్ చేసి చిన్నారి జన్మదినాన్ని అంబరాన్ని తాకేలా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా కుటుంబ సభ్యులందరూ కలిసి రాత్రి దాదాపు 2:10 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రముఖ కవి మగ్దూం మొహియుద్దీన్ విగ్రహం సమీపంలో తమ కారును సురక్షితంగా పార్క్ చేశారు. ఆ తర్వాత కేక్ కటింగ్ కోసం హుస్సేన్‌సాగర్ వైపు ఉన్న లేక్ వ్యూ వైపు రోడ్డు దాటేందుకు కుటుంబం మొత్తం నడుచుకుంటూ బయలుదేరింది. అయితే, అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా, నవ్వుతూ సాగిన ఆ ప్రయాణం కొద్ది క్షణాల్లోనే ఒక కోలుకోలేని విషాదంగా మారిపోయింది. సికింద్రాబాద్ వైపు నుంచి అత్యంత వేగంగా, అజాగ్రత్తగా దూసుకొచ్చిన ఒక లారీ రోడ్డు దాటుతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఊహించని ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి సరాక్షి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘోర ప్రమాదంలో చిన్నారితో పాటు ఆమెతో ఉన్న 41 ఏళ్ల బంధువు విశ్వనాథ్ అలియాస్ విశ్వంత్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో పడివున్న విశ్వనాథ్‌ను వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ విశ్వనాథ్ కూడా మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. మృతుడు విశ్వనాథ్‌కు వివాహం జరిగి కేవలం మూడు నెలలు మాత్రమే అయిందని తెలియడంతో స్థానికులు, బంధువులు కంటతడి పెట్టుకున్నారు. కొత్త కాపురంలో అడుగుపెట్టి జీవితాన్ని ఆస్వాదించాల్సిన యువకుడు ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న దోమలగూడ పోలీసులు వెంటనే అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి తండ్రి సాయినాథ్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాధానికి కారణమైన లారీ డ్రైవర్ ఫరూఖ్, హెల్పర్ సైయీద్ ఖాన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వేళల్లో నగరంలో వాహనాల వేగ నియంత్రణ లోపించడం, రోడ్డు దాటే సమయంలో తగినంత భద్రతా ప్రమాణాలు లేకపోవడం ఈ ప్రాణనష్టానికి కారణమయ్యాయి. పుట్టినరోజు కేక్ కట్ చేసి ఆనందంగా గడపాల్సిన చిన్నారి విగతజీవిగా మారడం, నూతన వధువు భర్తను కోల్పోయి రోదిస్తున్న తీరు చూసినవారందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. ఈ ఘటన నగరంలో మరోసారి రోడ్డు భద్రత, డ్రైవింగ్ నిబంధనల మీద తీవ్ర చర్చకు దారితీసింది. [ Tank Bund accident, Hyderabad news, birthday tragedy, road accident death, Sarakshi Viswanath, lorry crash Hyderabad, Crime news, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police, CP Sajjanar, Hyderabad police ]
http://www.teluguone.com/news/content/-tank-bund-accident-24-233419.html





