పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ పొలిటీషియన్ గా నిలదొక్కుకునేనా?
Publish Date:Aug 5, 2026
Advertisement
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. దేశ రాజకీయాలలో గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ సొంత రాష్ట్రంలో సొంత పార్టీ పెట్టి బొక్కబోర్లా పడ్డారు. జన సురాజ్ పార్టీని స్థాపించి.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెట్టారు. కానీ ఒక్క స్థానంలో కూడా జనసురాజ్ అభ్యర్థి విజయం సాధింలేదు సరికదా, కనీసం డిపాజిట్ కూడా దక్కనంత ఘోరంగా ఆ పార్టీ అభ్యర్థులంతా పరాజయం పాలయ్యారు. దీంతో తొలి అడుగులోనే ప్రశాంత్ కిశోర్ జనసూరజ్ పార్టీకి నూకలు చెల్లిపోయాయన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ప్రశాంత్ కిశోర్ మళ్లీ ఎన్నికల వ్యూహకర్తగా కెరీర్ ను కొనసాగించక తప్పదన్న విశ్లేషణలు జోరందుకున్నాయి. అయితే ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయం నిస్సందేహంగా ప్రత్యేకమైనది ఎందుకంటే.. ప్రశాంత్ కిశోర్ పోటీ చేసి గెలిచిన బంకీపూర్ నియోజకవర్గం బీజేపీకి పెట్టని కోట లాంటిది. అదీకాక.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నితిన్ నబిన్ రాజీనామా చేయడంతో.. ఖాళీ అయిన ఈ స్థానం నుంచి ప్రశాంత్ కిషోర్ విజయాన్ని పరిశీలకులు బీహార్ రాజకీయాల్లో ఒక నూతన శకానికి నాందిగా అభివర్ణిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. ఎందుకంటే.. సాధారణంగా ఉప ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి విజయం నల్లేరు మీద బండి నడక. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంటే.. ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థికి జనం ఓటు వేస్తారు. అయితే బంకీపూర్ ఉప ఎన్నికలో అందుకు భిన్నంగా.. బీజేపీ, ఆర్జేడీలను జనం ఏకకాలంలో తిరస్కరించి.. ప్రశాంత్ కిశోర్ కు జై కొట్టారు. ఈ తీర్పు కేవలం ప్రధాన పార్టీలను తిరస్కరించడంగానే కాకుండా.. తమ సమస్యల కోసం నిలబడతారన్న నమ్మకాన్ని ప్రశాంత్ కిశోర్ పై జనం ఉంచారనడానికి తార్కానంగా చూడాలంటున్నారు పరిశీలకులు. ఈ కారణంగానే బంకీపూర్ లో ప్రశాంత్ కిశోర్ సాధించిన విజయం ప్రత్యేకమైనది. శాసనసభలో తన జన సురాజ్ పార్టీ తరఫున ఏకైక ప్రతినిధిగా అడుగుపెడుతున్న ప్రశాంత్ కిశోర్ సభలో తన గళం ఎలా వినిపిస్తారు? అన్న దానిపైనే రాష్ట్రంలో జనసురాజ్ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. రానున్న నాలుగేళ్లూ.. పీకేకీ, జనసురాజ్ పార్టీకి అత్యంత కీలకమైనవనడంలో సందేహం లేదు. అసెంబ్లీలో ప్రజల గొంతుక వినిపించడమే కాకుండా.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ పైనే ఆయన రాజకీయ భవిష్యత్, జనసురాజ్ భవిష్యత్ ఆధారపడి ఉంది. rashant Kishor victory, Jan Suraaj party Bihar, Bankipur assembly by-election, Prashant Kishor MLA win, Bihar political updates, Prashant Kishor strategy
http://www.teluguone.com/news/content/rashant-kishor-victory-45-228055.html




