‘స్థానిక ఎన్నికలు..వైసీపీ ద్వంద్వ వైఖరి.!
Publish Date:Aug 29, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైపీపీ ద్వంద్వ వైఖరీ, డోలాయమానం, అదే సమయంలో ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఓ వైపు స్థానిక పోరులో గట్టి పోటీ ఇవ్వాలని పార్టీ శ్రేణులు, నేతలకు దిశా నిర్దేశం చేశారు. పనిలో పనిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ల ఆశావహులకు హెచ్చరిక కూడా జారీ చేశారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే.. సదరు నేతలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వనని హెచ్చరించాడు. అదే సమయంలో ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకపక్క గెలుపే లక్ష్యంగా నిలవాలంటూ అధినేత పార్టీ శ్రేణులలో జోష్ నింపడానికి ప్రయత్నిస్తుంటే.. మరోపక్క పార్టీ ఎన్నికలు నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరినీ, ఎన్నికల విషయంలో ద్వేదీ భావాన్నీ, అదే సమయంలో ఓటమి భయాన్నీ సూచిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద స్థానిక ఎన్నికలను వీలైనంత వరకు వాయిదా వేయించేందుకే సాంకేతిక అంశాలను తెరపైకి తెస్తూ కోర్టును ఆశ్రయించడం ఆ పార్టీలో స్థానిక పోరు విషయంలో ఎంత గందరగోళం నెలకొని ఉందో అర్ధమౌతున్నదంటున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సర్ కొనసాగుతోందని, ఇది పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని ఆ పిటిషన్‌లో కోరారు. పాత ఓటర్ల జాబితా ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించడం సరికాదని, కొత్త ఓటర్లను చేర్చే ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ వాదనపై న్యాయ, ఎన్నికల విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరుగుతున్నంత మాత్రాన ఎన్నికలను నిలిపివేయాలనే నిబంధన ఎక్కడా లేదని, గతంలో నిర్ణయించిన అర్హత తేదీల ప్రకారం అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా పార్టీ నాయకులతో జరిపిన సమీక్ష సమావేశాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులకు ఏకగ్రీవాలు చేసుకునే అవకాశం ఇస్తే సహించేది లేదని, ప్రతి స్థానంలోనూ గట్టి పోటీ ఇవ్వాల్సిందేనని హెచ్చరించారు. అంతేకాకుండా, స్థానిక పోరులో నిర్లక్ష్యం వహిస్తే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇచ్చే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. నాయకుల్లో ఉత్సాహం నింపేందుకు జగన్ ఇలాంటి కఠిన నిర్ణయాలు ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా లేదనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. నాయకులు ఓటమి భయంతోనే న్యాయపోరాటాల పేరుతో కాలయాపన చేయాలని చూస్తున్నారనే చర్చ మొదలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు వెళితే ఆశించిన ఫలితాలు రావేమోనన్న ఆందోళన వైసీపీలో గట్టిగా వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందంటూ ప్రచారం చేస్తున్న వైకాపా, ఒకవేళ స్థానిక ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో స్థానాలు గెలుచుకోలేకపోతే ఆ ప్రచారం తప్పని రుజువై ఉన్న కాస్తపరువూమంటగలుస్తుందన్న భయంలో ఉంది. అందుకే వీలైనంత కాలం ఎన్నికల వాయిదా దిశగా వ్యూహాలు పన్నుతోందనీ, అందులో భాగంగానే ఎన్నికల నిలుపుదల కోరుతూ కోర్టును ఆశ్రయించిందని చెగుతున్నారు.
{AP Local Body Elections, YSRCP High Court Petition, YS Jagan Mohan Reddy, Lella Appi Reddy, Voter List Special Intensive Revision, AP Politics News, Local Bodies Grant}
http://www.teluguone.com/news/content/ap-local-body-elections-45-230209.html





