క్లాస్‌రూంలో నేర్చుకోని పాఠం
Publish Date:Jan 11, 2019
Advertisement
ఇదంతా జరిగి సుమారు 25 సంవత్సరాలు గడిచింది. ఈసారి ప్రొఫెసరుగారికి మరో ఆలోచన వచ్చింది. తాను ఒకప్పుడు చేయించిన ప్రాజెక్టు ఎంతవరకు నిజమైందో తెలుసుకోవాలని అనుకున్నాడు. వెంటనే తన దగ్గర ఇప్పుడు చదువుతున్న కొంతమందికి పాత పేపర్లు అప్పగించి, అప్పటి పిల్లలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో పరిశీలించి రమ్మని చెప్పాడు. ప్రొషెసరుగారు అప్పగించిన కాగితాలు తీసుకుని విద్యార్థులు బయల్దేరారు. ఆనాటి రెండు వందల మంది పిల్లల్లో ఓ 180 మంది ఆచూకీ కనిపెట్టగలిగారు. వాళ్లంతా రకరకాల వృత్తులలో ఉన్నారని తేలింది. ఆశ్చర్యంగా వాళ్లలో కేవలం నలుగురంటే నలుగురు మాత్రమే ఏదో ఒక నేరం చేసి జైలుకి వెళ్లినట్లు బయటపడింది. ఒకప్పుడు అల్లరిచిల్లరగా తిరిగిన పిల్లలలో అంత మార్పు ఎలా వచ్చిందో విద్యార్థులకి అర్థం కాలేదు. చివరికి అక్కడ పనిచేసిన ఓ టీచర్ కారణంగా వాళ్లంతా బుద్ధిమంతుల్లా మారిపోయారని బయటపడింది. అంతమందిలో మార్పు తీసుకువచ్చిన టీచర్ గురించి విద్యార్థులలో ఆసక్తి పెరిగిపోయింది. ఆవిడ ఎక్కడ ఉంటారో కనుక్కుని విద్యార్థులంతా బయల్దేరారు. ఆ టీచర్‌ని కలవగానే, తాము స్లమ్ ఏరియాలో చూసిన అద్భుతాన్ని ఆవిడతో చెప్పుకొచ్చారు. ‘మీరు ఇంతమందిలో మార్పు ఎలా తీసుకువచ్చారు,’ అంటూ ఆ టీచర్ని అడిగారు. విద్యార్థుల ప్రశ్నకి టీచర్ ఏమాత్రం తడుముకోలేదు. ‘నేను వాళ్లని ప్రేమించాను. వాళ్లు తప్పకుండా మారతారని నమ్మకం ఉంచాను. ఒక టీచర్‌గా నా బాధ్యతని నిర్వహించాను. వాళ్లు భవిష్యత్తులో నేరగాళ్లు అవుతారనే అనుమానమే నాకు ఉండేది కాదు,’ అంటూ చిరునవ్వుతో చెప్పుకొచ్చింది. ఆ టీచర్ సమాధానం విద్యార్థులందరికీ ఓ కొత్త పాఠాన్ని నేర్పింది. - నిర్జర.
అది అమెరికాలో జాన్ హాప్‌కిన్స్ అనే యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్‌కి ఓ ఆలోచన వచ్చింది. ‘తన కళ్ల ముందు ఉన్న స్టూడెంట్స్ అంతా మంచి మంచి కుటుంబాల నుంచి వచ్చినవాళ్లే కదా! వాళ్లు ఎప్పటికైనా మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు కదా! మరి బస్తీలో పెరిగే పిల్లల సంగతి ఏంటి?’ అన్న ఆలోచన ప్రొఫెసర్ మనసుని కదిలించేసింది. వెంటనే ఆయన కొంతమంది స్టూడెంట్స్‌ని పిలిచాడు. ‘ఈ ఊరి చివర ఓ స్లమ్ ఏరియా ఉంది కదా! మీరంతా అక్కడికి వెళ్లండి. అక్కడ పిల్లల మనస్తత్వాన్నీ, వాళ్ల నేపథ్యాన్నీ గమనించండి. వాళ్లు పెద్దయ్యాక ఏమవుతారో ఊహించండి?’ అంటూ ఓ ప్రాజెక్ట్ వర్క్ అప్పగించాడు.
ప్రొఫెసర్ చెప్పినట్లుగానే విద్యార్థులు ఊరి చివర ఉన్న స్లమ్ ఏరియాకు వెళ్లారు. అక్కడ పిల్లలని ఓ రోజంతా పరిశీలించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు దాదాపు రెండువందల మంది పిల్లలను గమనించారు. చివరికి వాళ్లలో కనీసం 90 శాతం మంది పిల్లలైనా, పెద్దయ్యాక ఎందుకూ పనికిరాకుండాపోతారని అంచనా వేశారు. వాళ్లలో చాలామంది ఏదో ఒక నేరం చేసి జైలుకి వెళ్లితీరతారని ఊహించారు. తమ ప్రాజెక్టుని ప్రొఫెసరుకి అందించారు.
(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)
http://www.teluguone.com/news/content/johns-hopkins-university-35-82679.html