మనం చేసే పొదుపు, భవిష్యత్తు తరాలకి అందించే బహుమతి...జాతీయ ఇంధన పరిరక్షణా దినోత్సవం 2024!
Publish Date:Dec 14, 2024
Advertisement
శరీరానికి నీరు ఇంధనం వంటివి అని చెబుతారు. ఒక వాహనానికి ఇంధనం ఎంత అవసరమో.. మనిషి శరీరానికి నీరు అంతే అవసరం. శరీరానికి నీరు బాగా లభిస్తేనే శరీరంలో అవయవాలు బాగా పని చేస్తాయి. అట్లాగే మనిషి జీవితంలో బోలెడు కార్యకలాపాలు సాగడానికి ఇంధనాలు అవసరం అవుతాయి. ప్రకృతి ఇచ్చిన సహజ వనరులతో పాటు.. చాలా రకాల ఇంధనాలు మనిషి రోజువారీ జీవిత కార్యకలాపాలకు అవసరం. కొన్ని వనరులను ఒక రూపం నుంచి మరో రూపానికి మార్చగలం తప్ప సృష్టించలేము అనే విషయం తెలిసిందే. ఇలా వనరుల మీద అవగాహన పెంచి మానవ మనుగడను ఇబ్బందులలో పడకుండా ఉండేందుకు అందరికీ అవగాహన కల్పించే దిశగా ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని గూర్చి మరింతగా తెలుసుకుంటే.. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం.. 1991వ సంవత్సరం డిసెంబర్ 14న, మొదటిసారి మన భారతదేశంలో ‘జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని’ జరుపుకున్నారు. 2001 ఎనర్జీ కన్జర్వేషన్ యాక్టులో భాగంగా ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ’ (BEE) స్థాపించబడింది. అప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఇంధనం పొదుపు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించడానికి వ్యక్తులు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు వినియోగించే శక్తి వృధా కాకుండా చూడటం, పచ్చదనంతో కూడిన వాతావరణాన్ని పెంచడం, ఇంధన-పొదుపు పద్ధతులను అనుసరించేలా ప్రోత్సహించడమనే విషయాలను లక్ష్యంగా చేసుకుని సాగుతోంది. ఈ దినోత్సవాన్ని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ అవగాహన ప్రచారాలు, అవార్డు వేడుకలు, వ్యక్తిగత, సంస్థాగత స్థాయిలలో శక్తి పరిరక్షణా ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాల రూపంలో జరుపుతుంది. థీమ్.. "పవరింగ్ సస్టైనబిలిటీ: ఎవ్రీ వాట్ కౌంట్స్”. ఈ థీమ్ స్వల్ప స్థాయిలోనైనా ఇంధన సంరక్షణలో వ్యక్తిగత, సామూహిక ప్రయత్నం చేయటంలో ఉన్న కీలక పాత్రను నొక్కి చెబుతుంది. వ్యక్తులు, పరిశ్రమలు, ప్రభుత్వాలు స్థిరమైన ఇంధన పొదుపు పద్ధతులను అవలంబించేలా ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రాముఖ్యత.. బాధ్యతాయుతంగా ఇంధనాలను ఉపయోగించుకోవాలనే ఆలోచన పెంచి, పెరుగుతున్న ఇంధన డిమాండ్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ఇంధన పొదుపు పద్ధతుల వైపు మళ్లేలా వారిని ప్రోత్సహించడమే దీని ప్రత్యేకత. ఇంధన పొదుపు ప్రాముఖ్యతపై వ్యక్తులు, సంస్థలు, పరిశ్రమలకు అవగాహన కల్పిస్తుంది. స్థిరమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించవలసిన విషయాన్ని నొక్కి చెప్తుంది. ఇంధన భద్రతను సాధించాలనే మన భారతదేశ లక్ష్యానికి మద్దతు ఇస్తుంది. పర్యావరణం దెబ్బతినటానికి కారణమవుతున్న కార్బన్ ఫుట్ ప్రింటుని వీలైనంతవరకూ తగ్గించాల్సిన ఆవశ్యకతని తెలియజేస్తుంది. ప్రభుత్వాలు, సంస్థలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా, ఎంతలా మనకి పొదుపు గురించి చెప్పినా కూడా చివరికి ఫలితం రావటమనేది ప్రతీ వ్యక్తి చేతిలో ఉంటుంది. వ్యక్తిగతంగా మనం ఎంతవరకూ దాని కోసం పని చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మన ఇంట్లో అవసరం లేకుండా వెలిగే ఒక లైటునో, తిరుతున్న ఒక ఫ్యానునో ఆపకుండా బయటకి వచ్చి పర్యావరణం గురించి, కాలుష్యం గురించి మాట్లాడటం వింతగా ఉంటుంది కదా.. అందుకే ఇంధన పొదుపుకి ఉన్న ఆవశ్యకత, అవసరం తెలుసుకుని, దానికి తగిన చర్యలు మన ఇంటినుంచి మనమే మొదలుపెట్టాలి. పౌరులంతా బాధ్యతగా ప్రవర్తిస్తే ఇదేమీ అసాధ్యం కాదు... ఈ రోజు మనం ముందడుగు వేయకపోతే మన భవిష్యత్తు తరాలకి అందాల్సిన శక్తివనరులని మనమే హరించి, చేతులారా మనమే వారి జీవితాలని నరకం చేసినవాళ్లమవుతాం....
*రూపశ్రీ
http://www.teluguone.com/news/content/national-energy-conservation-day-35-189839.html