పరాజయం నుంచే అద్భుతాలు మొదలవుతాయి
Publish Date:May 28, 2019
Advertisement
మన దృష్టి సాధారణంగా మనలో ఉన్న బలాల మీద కాకుండా బలహీనతల మీదే ఉంటుంది. ఆ బలహీనతల వల్ల ఏర్పడిన పరాజయాల మీదే ఉంటుంది. కానీ ఫెయిల్యూర్ ఎదుర్కొన్న ప్రతిసారీ... దాని నుంచి ఏదన్నా నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తే... అదే మన విజయానికి దారితీస్తుంది. అందులో మన బలం కూడా ఎక్కడో దాగి ఉందని తెలుస్తుంది. నమ్మడం లేదు కదూ! కావాలంటే ముక్తామణి కథ వినండి... ఈ కథ 1989లో మొదలవుతుంది. అప్పట్లో మణిపూర్‌లో ముక్తామణి అనే ఆవిడ ఉండేది. ముక్తామణి కుటుంబం తీవ్రమైన పేదరికంలో ఉండేది. ఆ కుటుంబానికి పూట గడవడమే కష్టంగా ఉండేది. పేదవాడి కష్టాలకి కొదవ ఉండదు కదా! అలా ఓ రోజు ఆమె రెండో కూతురు చిరిగిపోయిన షూస్‌తో ఇంటికి వచ్చింది. ఆ షూస్ అప్పటికే చిన్న చిన్న రిపేర్లతో బాగుపడే పరిస్థితిని దాటిపోయాయి. కూతురు షూస్ చూసిన ముక్తామణికి ఏం చేయాలో పాలుపోలేదు. ఒకపక్క తినడానికే డబ్బు లేదు. ఇక కొత్త షూస్ ఎక్కడి నుంచి తీసుకువస్తుంది. ఇక చేసేదేమీ లేక... చివరికి ఆ షూస్ చుట్టూ వులెన్ దారంతో అల్లింది. కానీ ఆ తల్లీకూతుళ్ల మనసులో ఒకటే అనుమానం. మర్నాడు టీచర్ ఏం తిడతారో అని! యూనిఫాంతో సరిపోని షూస్‌ని చూసి టీచర్ తప్పకుండా తిట్టిపోస్తుందని వాళ్ల భయం. ఆ భయంతోనే ముక్తామణి కూతురు మర్నాడు స్కూళ్లో అడుగుపెట్టింది. కానీ విచిత్రం! టీచర్ ఆ అమ్మాయిని తిట్టలేదు సరికదా... వాటిని ఎవరు అల్లారో కనుక్కొంది. అంతేకాదు- ‘మా పాపకి కూడా ఇలాంటి షూస్ అల్లిస్తుందేమో మీ అమ్మని కనుక్కో!’అంది. తిట్టు వినపడతాయనుకునే చోట ప్రశంసలు కనిపించడంతో ముక్తామణి సంతోషానికి హద్దు లేకపోయింది. దాంతోపాటే ఆమెలో ఆ ఆలోచన కూడా మొదలైంది- ‘తను వులెన్ దారంతో షూస్ అల్లగలదు కదా! దాన్నే ఓ వృత్తిగా చేసుకుంటే ఎలా ఉంటుంది?’. ఆ ఆలోచన ప్రస్తుతం ‘ముక్తా షూ ఇండస్ట్రీ’కి దారి తీసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఈ ముప్ఫై ఏళ్లలో ముక్తామణి వెయ్యిమందికి పైగా ఉపాధి కల్పించింది. ఆవిడ కంపెనీలో తయారయ్యే షూస్ ఇప్పుడు ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలకు ఎగుమతి కూడా అవుతున్నాయి. ముక్తా సాధించిన విజయాలకి లెక్కలేనన్ని అవార్డులు కూడా దక్కాయి. ఈమధ్యే ‘ద టెలిగ్రాఫ్’ పత్రిక ఆవిడను ‘True Legends Awards 2018’తో సత్కరించింది. ఇంత ఎదిగినా కూడా ముక్తామణిలో కొంచెం కూడా గర్వం కనిపించదు- ‘నాతో పాటు అలుపెరగకుండా పనిచేసేవాళ్ల సాయం ఉండబట్టే, ఈ స్థాయికి చేరుకున్నానని చెబుతారు.’ - Nirjara
http://www.teluguone.com/news/content/mukta-mani-manipur-35-82705.html