తెలుగుజాతి మరవలేని త్యాగం.... మరవకూడని త్యాగం…శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి 2024

Publish Date:Dec 14, 2024

Advertisement

 

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవియైన మహాపురుషుడని, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడని, మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడని అంటూ ఆయన చేసిన త్యాగాన్ని  ఏదో రెండు మాటల్లో చెప్పేస్తే అయిపోయేది కాదు. ఒక మనిషి తన శరీరం నిలువునా కుళ్లిపోతున్నా, క్రుంగి కృశించిపోతున్నా కూడా తన కోసం, తన కుటుంబం కోసం  కాకుండా, నిస్వార్ధంగా మొత్తం తెలుగు జాతి ఆత్మ గౌరవం కాపాడటం కోసం, 1952వ సంవత్సరం,  డిసెంబర్  15న తన ఆత్మ శరీరాన్ని విడిచే వరకూ పోరాటం చేశారు. ఆయన మరెవరో కాదు, శ్రీశ్రీ పొట్టి శ్రీరాములు గారు. తెలుగువారిగా మనమిప్పుడు  పొందుతున్న గౌరవం ఆనాడు  ఆయన చేసిన త్యాగం వల్ల వచ్చిందని ఇప్పటికీ తెలుగుజాతి వారందరకీ  తెలియకపోవటం చాలా  బాధాకరం.  మన జాతి కోసం ప్రాణాలర్పించిన ఆ మహనీయుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం  నేటి యువతకి ఎంతైనా ఉంది..... 

  జీవిత విశేషాల..

పొట్టి శ్రీరాములుగారు  1901,  మార్చి 16వ తేదీన న మద్రాసునగరంలోని, జార్జిటౌనులో నివాసముంటున్న   గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వారి పూర్వీకులది ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని, కనిగిరి ప్రాంతంలో ఉన్న  పడమటిపల్లె గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి,  దాదాపు నాలుగేళ్ళు అక్కడే ఉద్యోగం చేసాడు.

1928లో శ్రీరాములు దంపతులకి కలిగిన బిడ్డ చనిపోయాడు. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. ఈ బాధాకర సంఘటనలన్నీ ఎదుర్కొన్న 25 ఏళ్ల వయసున్న  శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుచరుడిగా  సబర్మతి ఆశ్రమంలో చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో కూడా పాల్గొన్నాడు.

భారత స్వాతంత్రోద్యమంలో పాత్ర..

పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-1942 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోను, ఆంధ్రలో కృష్ణా జిల్లాలోని కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 

కొమరవోలులో యెర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. 1946లో నెల్లూరు జిల్లా  మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించారు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసారు. గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవారట.  


జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, ఆయన హరిజనోద్ధరణకు కృషిచేసాడు. దీనిగురించిన నినాదాలను అట్టలమీద  రాసి, మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. కానీ  ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు.

ఆంధ్ర రాష్ట్రసాధన దీక్ష..

అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉండేవారం.  మద్రాసు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం పంతులు గారు..  రాజగోపాలాచారి  రాజకీయానికి, అహంకారానికి బలై తన పదవిని పోగొట్టుకున్నారు. దాంతో తెలుగువారంటే ఆరంభ శూరులు మాత్రమేనని పుకారు అంతటా పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా కూడా, మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులనే  పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు మాత్రం ప్రాధాన్యత లేదు. 1952 నాటికి కూడా  మద్రాసు వాళ్లమనే తప్ప  ఆంధ్రావాళ్లంటే ప్రపంచానికి తెలియదు. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కానీ రాజాజీ ప్రభుత్వం ఆ శిబిరాన్ని అణచివేసి,  సీతారాం దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభశూరులు అని మళ్ళీ హేళన చేసింది. 


ఈ అవమానాన్ని దిగమింగుకోలేని పొట్టి శ్రీరాములుగారు స్పందించారు. సర్కార్ ఎక్స్ ప్రెస్లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి 1952,  అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తిగారి ఇంట దీక్ష ప్రారంభించారు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ర్టాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు.  ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్ళారా.... వారి అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టి శ్రీరాములు ఒంటరివాడైపోయాడు.  9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేసారు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నెహ్రూకు నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అప్పట్లో తెలుగువారి ఐక్యత అంత హీనంగా ఉండేది.  ఈ సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని నాయకులు గ్రహించలేకపోయారు. తెలుగు నాయకులంతా ముఖం చాటేశారు. ప్రజలు మాత్రం శ్రీరాములకి మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు.

 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీ దయ కలగలేదు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించారు.

రోజురోజుకూ ఆరోగ్యం క్షీణస్తున్నా, శ్రీరాములులో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండేది. పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. శరీరం ఎంత క్షీణిస్తున్నా కూడా డాక్టర్లు వారిస్తున్నప్పటికీ కూడా  ఆయన స్పృహలో లేని సమయంలో కూడా తనకి ఏ గ్లూకోజ్ ఎక్కించద్దని ఖరాఖండిగా చెప్పేశారు. క్రుంగిపోతున్న శరీరం వల్ల కలిగే  బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగులు  నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణవ్యవస్థ తిరగబడి మలం కూడా నోటినుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకంతో నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్వటానికి 58 రోజులుపట్టింది. అలా  డిసెంబర్ 15,  రాత్రి 11.23 గంటలకు పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకొన్నాడు.  ఆయన తెలుగువారి కోసం ఎంత దారుణమైన మరణవేదన అనుభవించి అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు. 

చనిపోయిన తర్వాత..

అతి దారుణమైన విషయమేంటంటే,  ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా ఆయన పార్ధివదేహాన్ని ముట్టుకోవడానికి కూడా మొదట తెలుగువాళ్లు రాలేదు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి పార్ఢివదేహాన్ని  ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదని భావించి, తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి యేర్నేని సాధు సుబ్రహ్మణ్యం , ఘంటసాలగారు మరికొంతమంది ముందుకి వచ్చి   ఒక ఎద్దులబండి మాట్లాడి దేహాన్ని  అందులోకి ఎక్కించారు. ఘంటసాలగారు అప్పటికప్పుడే ఆశువుగా తన వీరకంఠాన్ని ఎలుగెత్తి ‘తెలుగుజాతి పౌరుషం చచ్చిందని, చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువులు  బాసిన శ్రీరాములు నువ్వంటూ’  గొంతెత్తి పాడుతూ శవయాత్ర ప్రారంభించారు. యేర్నేని సాధు సుబ్రహ్మణ్యంగారే అమరజీవి శ్రీరాములకు దహనక్రియలు,  కర్మకాండ జరిపారు. పొట్టి శ్రీరాములు గారు  ప్రాణాలర్పించిన విషయం తెలిసిన  ప్రజలు ఆగ్రహావేశులై, హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. చివరికి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ దిగి వచ్చి, డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ఒక  ప్రకటన చేసారు. అలా కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న  ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. ఇలా పొట్టి శ్రీరాములు గారు అమరుడై ఆంధ్రరాష్ట్ర సాధనకు కారణమయ్యాడు.


                                  *రూపశ్రీ 

By
en-us Political News

  
ప్రపంచంలో ప్రతీ దేశంలోనూ వేర్వేరు జాతులవారు, వేర్వేరు భాషలవారు,  వేర్వేరు మతపరమైన విశ్వాసాలు కలిగినవారు ఉంటారు.
సరదా.. చాలా సహజంగా అనిపించే విషయం. చాలామంది సాధారణంగా మాట్లాడే సమయంలో సరదా పేరుతో కొన్ని జోక్స్ వేయడం లేదా కొన్ని మాటలు అనడం చేస్తుంటారు.
డబ్బు.. ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది.  సిల్లీ విషయం ఏంటంటే.. ఈ డబ్బును మనిషే కనిపెట్టాడు.
నేడు ప్రస్తుత ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే ఏ దేశానికాదేశం,  వారి మిలిటరీ శక్తి సామర్ధ్యాలతో భయపెట్టి తమ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలని,ప్రపంచ రాజకీయాల్లో తామే హీరో అవ్వాలని ప్రయత్నిస్తున్నాయి.
పెళ్లి ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన దశ.  పెళ్లి సంబంధం చూసేది,  వివాహం జరిపించేది పెద్దలే అయినా ఆ బంధంలో కలిసి ఉండేది మాత్రం పెళ్లి చేసుకునే అమ్మాయి, అబ్బాయి ఇద్దరే. జీవితాంతం ఈ బందాన్ని వాళ్లిద్దరే నడిపించుకుంటూ వాళ్లు ఒక కుంటుంబంలా ఏర్పడతారు.
శరీరానికి నీరు ఇంధనం వంటివి అని చెబుతారు. ఒక వాహనానికి ఇంధనం ఎంత అవసరమో.. మనిషి శరీరానికి నీరు అంతే అవసరం.
ఇప్పటి కాలంలో చాలా ఇళ్లలో ఇంటిపని చేయడానికి పని మనుషులను నియమించుకుని ఉంటున్నారు
ప్రపంచవ్యాప్తంగా యువతలో  టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనే వ్యాధి పెరిగిపోతోందట.
సీజన్ ను బట్టి దుస్తులను మార్చడం సహజం.
నేడు పేదవారైనా, మధ్య తరగతివారైనా ఆరోగ్యం కాపాడుకుంటే చాలు  ఆస్తి కాపాడుకున్నట్టే అని భావిస్తున్నారు.
పర్వతాలు వాతావరణ సమతుల్యతను కాపాడటమే కాకుండా, మొక్కలజాతులు, నీటి వనరులు, జీవవైవిధ్యానికి ముఖ్యమైన మూలాలుగా ఉంటాయి. ఇవి ప్రపంచ ప్రధాన నదులకి  మూలాలు.
సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా  ‘పిల్లలే మా ఆస్తి, వారిని పెంచి, పోషించి వారి కాళ్ళ మీద వారు నిలబడితే అదే చాలు’ అని అంటుంటారు.
నోబెల్ బహుమతి.. ప్రపంచం మొత్తం మీద ఎంతో గొప్పగా పేర్కొనే గుర్తింపు. ఎంతో మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు నోబెల్ బహుమతి సాధించాలనే తపనతో ప్రయోగాలు చేస్తూనే ఉంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.