పర్వతాలు పర్యావరణ వ్యవస్థకి ప్రాణదాతలు.... ఇంటర్నేషనల్ మౌంటెన్ డే 2024..
Publish Date:Dec 11, 2024
Advertisement
పర్వతాలు వాతావరణ సమతుల్యతను కాపాడటమే కాకుండా, మొక్కలజాతులు, నీటి వనరులు, జీవవైవిధ్యానికి ముఖ్యమైన మూలాలుగా ఉంటాయి. ఇవి ప్రపంచ ప్రధాన నదులకి మూలాలు. జలచక్రంలో ముఖ్యమైన పాత్ర పోషించి మానవ మనుగడకి అవసరమైన ఆహారోత్పత్తిలో కూడా సాయపడుతున్నాయి. పర్వతాలు పర్వత ప్రాంతాల్లో నివసించే వారికి మాత్రమే కాకుండా లోతట్టు ప్రాంతాల్లో నివసించే కోట్ల మందికి కీలకమైనవి. అంతర్జాతీయ పర్వత దినోత్సవ చరిత్ర: 1992లో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ సమావేశంలో, “విరిగిపోతున్న పర్యావరణవ్యవస్థ నిర్వహణ : సుస్థిర పర్వత అభివృద్ధి” అనే అధ్యాయాన్ని ఆమోదించారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి 2002ను పర్వతాల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది. 2003 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 11న అంతర్జాతీయ పర్వత దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. ఈ రోజు పర్వతాల అభివృద్ధిని ప్రోత్సహించడానికిగానూ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించడానికి ఐక్యరాజ్య సమితి ప్రజలకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి ఈ పర్వత దినోత్సవ బాధ్యతను ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO)కు అప్పగించింది. అంతర్జాతీయ పర్వత దినోత్సవం 2024 - థీమ్: "స్థిరమైన భవిష్యత్తు కోసం పర్వత పరిష్కారాలు –ఆవిష్కరణ, అనుసరణ, యువత " అనే థీమ్ ను ఏడాది రూపకల్పన చేసింది. కొత్త కొత్త ఆవిష్కరణల ద్వారా, సాంకేతికతని ఆడాప్ట్ చేసుకోవటం ద్వారా, యువతని భాగస్వామ్యం చేసుకోవటం ద్వారా పర్వత ప్రాంతాలకి చెందిన ప్రదేశాల వారసత్వ నిర్వహణ, స్థిరమైన అభివృద్ధికిగానూ జియో పార్కుల సహకారాన్ని ప్రోత్సహించటం మీద దృష్టి సారించింది. యువత సుస్థిర భవిష్యత్తు నిర్మాణంలో పర్వత సముదాయాలు కీలక పాత్ర పోషిస్తాయనే విషయాన్ని ఈ అంశం హైలైట్ చేస్తోంది. అంతర్జాతీయ పర్వత దినోత్సవం ఎందుకు అవసరమంటే.. 2003 నుండి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) నేతృత్వంలో జరుపుకుంటున్న అంతర్జాతీయ పర్వత దినోత్సవం పర్వతాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచుతుంది. ఇది పర్వత అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు, సవాళ్లను హైలైట్ చేస్తూ, పర్వత సముదాయాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి ప్రజల సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. పర్వతాల ప్రాముఖ్యతను గుర్తించడంలో, వాటి సంరక్షణకు కృషి చేయడం వల్ల పర్యావరణానికి, సమాజానికి ఎంత ప్రయోజనం ఉంటుందో గుర్తు చేయడం ద్వారా ప్రజలలో అవగాహనను పెంచుతుంది. పర్వతాలు ఎందుకు ముఖ్యం.. పర్వతాలు జల చక్రంలో కీలకమైనవి. శీతాకాలంలో పర్వతాలపై పడే మంచు వసంత, వేసవి కాలంలో కరుగుతుంది, ఇది వ్యవసాయం, నివాసాలు, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందిస్తుంది. పర్వతాలు లేకపోతే ఇది జరగదు. కొన్ని చోట్ల సుమారు 90% నదుల నీరు పర్వతాల నుండే ఉత్పన్నమవుతుంది. పర్వతాలు ప్రపంచ జనాభాలో సగానికి త్రాగునీటిని అందిస్తాయి. పర్వతాలు అనేక మొక్కలు, జంతువులకు నివాసాన్ని అందిస్తాయి. ఇవి జీవవైవిధ్యాన్ని నిలబెట్టడంలో, పర్యావరణ సమతౌల్యాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచంలో ఉన్న జీవవైవిధ్య హాట్‌స్పాట్లలో అధికభాగం పర్వతాల్లోనే ఉన్నాయి.పర్వతాలు ప్రకృతి యొక్క అమూల్యమైన ఆభరణాలు. ప్రపంచ జనాభాలో 15% ప్రజలు పర్వత ప్రాంతాల్లో నివసిస్తారు. *రూపశ్రీ.
భూమి మీద జీవజాల మనుగడలో కీలక పాత్ర పోషిస్తున్న పర్వతాల ప్రాముఖ్యతను ప్రజలకి తెలియజేయడానికి, ప్రధానంగా పర్వతాల సంరక్షణ అవసరాన్ని, వాటికి ఎదురయ్యే ముప్పులను గురించి అవగాహన కల్పించడంపై దృష్టి సారించడంలో ఈరోజు కీలకమవుతుంది. పర్వతాల సంరక్షణ సుస్థిర అభివృద్ధికి ముఖ్యమైనది. వాతావరణ మార్పులు, పర్వతాల నుంచి దొరికే వనరుల అధిక వినియోగం కారణంగా తీవ్రమైన ముప్పులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పర్వతాల సంరక్షణ అత్యవసరమని తెలియజేస్తుంది.
పర్వతాలు చెక్క, గనులు, ఇతర వనరుల కోసం కూడా ముఖ్యమైనవి. పర్వతాల నుండి ప్రవహించే నీరు ప్రధాన హైడ్రోఎలక్ట్రిక్ శక్తికి మూలం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, పర్వత ప్రాంతాల నుండి లభించే వృక్ష, ఇంధన వనరులు ప్రాథమిక శక్తి మూలం. వ్యవసాయం, శుద్ధమైన శక్తి, ఔషదాల కోసం కూడా పర్వతాలు ముఖ్యమైనవి.
భారత దేశంలో*హిమాలయాలు, వింధ్య పర్వతాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, నీలగిరి కొండలు, పాపి కొండలు వంటి ఎన్నో ప్రఖ్యాతి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. వీటిని కాపాడుకోవడం అందరి భాద్యత. పర్వతాలు ప్రకృతిలో భాగమైనప్పుడు ప్రకృతి పరిరక్షణ అందరి కర్తవ్యం అని గుర్తించాలి.
http://www.teluguone.com/news/content/international-mountain-day-35-189693.html