చీపురుపల్లిలో వైసీపీ ఖాళీ: బొత్స పరిస్థితి ఏంటి.?
Publish Date:Sep 28, 2026
Advertisement
ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా మారుతోంది. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాననమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ దాదాపుగా ఖాళీ అయిపోతున్న పరిస్థితి. దీంతో సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. ఇలా వైసీపీని వీడిన వారిలో సీబొత్స బంధువులు, సన్నిహితులు ఉండటం విశేషం. ఈ వలసల ప్రభావంతో చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, క్యాడర్ కూడా వైసీపీకి దూరం అవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. చీపురుపల్లి నియోజకవర్గంలో తిరుగులేని పట్టు ఉన్న నేతగా గుర్తింపు పొందిన బొత్స సత్యనారాయణకు ఈ పరిణామాలు మింగుడుపడటం లేదు. ఆయన తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ ఎదుర్కొనని ప్రతికూల పరిస్థితులను ఇప్పుడు ఎదుర్కొంటున్నారని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. వలసలకు అడ్డుకట్ట వేసి పట్టు నిలుపుకునేందుకు ఆయన చేసిన, చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన నిస్సహాయంగా మిగిలిపోయినట్లు పరిశీలకులు అంటున్నారు. ఈ సంక్షోభాన్ని, చీపురుపల్లి నియోజకవర్గంలో తన పట్టుకు సవాల్ విసిరుతున్న వలసలను ఆయన ఎలా ఆపుతారు, పట్టును ఎలా నిలుపుకుంటారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వలసల పర్వం ఇలాగే కొనసాగితే, వైసీపీలో కూడా బొత్స ప్రభ, ప్రాధాన్యత మసకబారడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తొలుత వైసీపీ సీనియర్ నాయకుడు, బొత్స సత్యనారాయణకు స్వయానా మేనల్లుడు పార్టీకి దూరం కావడంతో మొదలైన వలసన పరంపర.. వేగం పుంజుకుని గ్రామ స్థాయి కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధుల వరకు విస్తరించాయి. పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్య నాయకులు వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. వైసీపీ నుంచి ఈ మూకుమ్మడి రాజీనామాలు నియోజకవర్గంపై బొత్స పట్టు సడలిందనడానికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
[Botsa Satyanarayana, Cheepurupalli, YCP Leaders Resign, Botsa Loose, Grip, AP Politics, Telugu One]
http://www.teluguone.com/news/content/botsa-satyanarayana-45-232744.html




