సీఈసీ అంశం: ఏకకాలంలో రాహుల్ కు అందివచ్చిన అవకాశం, పోలిటికల్ చాలెంజ్ కూడా.!
Publish Date:Oct 7, 2026
Advertisement
దేశ రాజకీయాలలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రంగా ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఒకేు సమయంలో అందివచ్చిన అవకాశంగా, ఎదుర్కోవలసిన సవాల్ గా మారాయి. కేంద్ర ఎన్నికల సంఘం అంతర్గత వ్యవహారాలు, నిర్ణయాలపై వెలువడుతున్న వార్తలు ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్, ఇతర కమిషనర్ల మధ్య నెలకొన్న విభేదాలకు సంబంధించిన అంశాలు జాతీయ స్థాయిలో కలకలం రేపాయి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది పౌరులు అత్యంత పవిత్రంగా భావించే ప్రాథమిక హక్కు. ఈ తరుణంలో ఎన్నికల సంఘం పనితీరు, దాని స్వయంప్రతిపత్తిపై ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాలు, అనుమానాలు, ఆందోళనలను సరిగా అంచనా వేసి ముందుకు సాగాల్సిన గురుతర బాధ్యత ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ పై ఉంది. ఎన్నికల సంఘంలో కమిషనర్ల మధ్య భేదాభిప్రాయాలు రావడం సాధారణమేనని అధికార బీజేపీ, అలాగే ఆ పార్టీ నేతృత్వంలోని కూటమి పార్టీలూ అంటున్నాయి. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీ ఇస్తున్న సమర్థనలుఎంత మాత్రం సమంజసంగా లేవన్నది పరిశీలకుల విశ్లేషణ. 1993లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో తీసుకువచ్చిన చట్టబద్ధమైన మార్పులను గనుక పరిశీలిస్తే.. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నాటి ఎన్నికల సంఘం కమిషనర్ టీఎన్ శేషన్ సర్వాధికారాలను నియంత్రించడానికి బహుళ సభ్యుల ఎన్నికల సంఘం నిబంధనను తీసుకువచ్చారు. ఆప్పట్లో శేషన్ తాను కేవలం ప్రజలకు, పార్లమెంట్‌కు, రాష్ట్రపతికి మాత్రమే బాధ్యత వహిస్తానని విస్ఫష్టంగా ప్రకటించారు. అయితే.. సుప్రీం కోర్టు బహుళ సభ్యుల ఎన్నికల సంఘం అన్న అప్పటి పీవీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లకు సమానమైన అధికారాలు ఉంటాయని, అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీ ఓటు ద్వారా జరగాలని విస్పష్ట తీర్పు కూడా ఇచ్చింది. అయితే.. తరువాత తరువత ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉండే అధికారులను ఈసీ స్థానాల్లో నియమించడానికి వివిధ మార్గాలను అన్వేషించాయి. 2009 జనవరిలో నాటి సీఈసీ ఎన్. గోపాలస్వామి అప్పటి ఈసీ నవీన్ చావ్లాకు రాజకీయ తటస్థత లేదంటూ ఆయనను తొలగించాలని రాష్ట్రపతికి సిఫారసు చేసిన ఉదంతాన్ని తీసుకుంటే.. అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆయన్ను తొలగించకపోవడమే కాకుండా.. తదుపరి సీఈసీగా నియమించింది. ఇటువంటి పరిణామాలు గతంలోనూ జరిగినప్పటికీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం 2023లో తీసుకువచ్చిన సరికొత్త చట్టం మాత్రం ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి విషయంలో పెను మార్పులకు కారణమైంది. ఈ కొత్త చట్టం ప్రకారం, ఎన్నికల సంఘం కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి దేశ ప్రధానన్యాయమూర్తిని తొలగించారు. అంతేకాకుండా, ఈసీ సభ్యులకు జీవితాంతం న్యాయపరమైన విచారణల నుంచి సంపూర్ణ మినహాయింపు అంటే ఇమ్యూనిటీ కల్పించారు. ఈ నూతన చట్టం ప్రకారం ఎంపిక కమిటీలో ప్రధాని, కేంద్ర కేబినెట్ మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మాత్రమే ఉంటారు. అయితే ప్రధాని, కేబినెట్ మంత్రి ఎప్పుడూ ఒకే వర్గంగా ఉంటారు కాబట్టి.. ప్రతిపక్ష నేత పాత్ర నామమాత్రంగా మిగిలిపోతుంది. ఇదే విషయంపై విపక్షాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ.. ఎటువంటి చర్చా లేకుండానే పార్లమెంటులో ఈ బిల్లుకు కేంద్రం ఆమెదముద్ర వేయించుకుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అప్పుడే కాదు, ఇప్పటికీ ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల మీడియా సంస్థల కథనాల ద్వారా ఈసీ అంతర్గత విభేదాలు వెలుగులోకి రావడం, ఆ తర్వాత ఈ సంస్థ సమావేశమై కొన్ని నిర్ణయాలను ప్రకటించడం వంటి పరిణామాలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడి గళమెత్తే అవకాశం లభించింది. ప్రభుత్వ విధానాలను, సంస్థలు స్వయంప్రతిపత్తి కోల్పోవడాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఆయన ఇప్పటికే ఒకింత విజయం సాధించారు. అయితే ప్రసంగాలలో విమర్శలకే పరిమితం కావడం కాకుండా.. బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గళమెత్తి, బలంగా నిలబడే అవకాశాన్ని ఆయన ఎలా సద్వినియోగం చేసుకుంటారన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఇక సవాల్ ఏమిటంటే.. బలమైన కార్యాచరణతో ఆయన ప్రజలను చైతన్య వంతం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిచడం. ఎందుకంటే.. మెజారిటీ జనం.. తమ ఓటుహక్కు కోల్పోతామన్న ఆందోళనలో ఉన్నారు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘంలో పారదర్శకతను డిమాండ్ చేస్తున్నారు. ఈ సానుకూల అవకాశాన్ని రాహుల్ గాంధీ ఏ మేరకు ఉపయోగించుకుని ప్రజా చేతనను బలమైన ఆయుధంగా మలచుకుంటారన్నది చూడాల్సి ఉంది. ఒకవైపు దేశ ప్రజలు ఓటు హక్కు పట్ల ఎంతో జాగరూకతతో ఉన్నందున, సంస్థల పారదర్శకతను కాపాడాలని కోరుకుంటున్నారు. అధికార పక్షం ఈ సంక్షోభాన్ని మరింత పెంచకుండా సద్దుమణిగేలా చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నది. ఆందోళనలను అణచివేయడానికి బలప్రయోగానికి కూడా వెనుకాడటం లేదు. రాహుల్ గాంధీ ఈ తరుణంగా గట్టిగా నిలబడి ఈ అంశాన్ని ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించాల్సి ఉంది. ఈ విషయంలో ఆయన సాధించే విజయమే, ఆయన రాజకీయ భవిష్యత్ ను, అలాగే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఈ విషయంలో ఆయన విజయంసాధిస్తేనే.. జాతీయ రాజకీయాల్లో ఆయన నాయకత్వాన్ని అంగీకరించేందుకు ఇండియా కూటమి పార్టీలు ముందుకు వస్తాయి. [Election Commission ssue A Big Challenge, Rahul Gandhi, Congress, Political Future, Modi Government Law, Chief Election Commissioner, Indian politics, PV Narasimharrao, TN Seshan, Telugu One]
http://www.teluguone.com/news/content/election-commission-ssue-a-big-challenge-45-233654.html




