వైసీపీ నుంచి జనసేనలోకి వలసలు: కూటమి ఐక్యతకు వరమా, శాపమా.?
Publish Date:Sep 29, 2026
Advertisement
ఏపీలో వైసీపీ నుంచి పెరుగుతున్న వలసలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. వైసీపీకి చెందిన పలువురు నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు జనసేన బాట పడుతున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది. రాజకీయంగా ఏ పార్టీకైనా ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలు రావడం సానుకూల సంకేతం అనడంలో సందేహం లేదు. అంతే కాకుండా ఈ వలసలు ప్రజలకు కూడా బలమైన సంకేతాలు ఇస్తుంది. ఇప్పుడు వైసీపీ నుంచి జనసేనలోకి పెరుగుతున్న వలసలు జనసేన పార్టీ పట్ల ప్రజలలో కూడా విశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, వైసీపీ బలహీనపడుతోందన్న బలమైన సంకేతాలను పంపుతున్నాయి. జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం. ఆ పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో ఉంది. దీంతో పరిశీలకులు ఈ చేరికలు కూటమిని బలోపేతం చేస్తున్నాయి తప్ప.. ఆ బలం కేవలం జనసేన పార్టీకి మాత్రమే కాదని అంటున్నారు. ఇక ఈ చేరికలు మరింత పెరిగితే.. రానున్న రోజుల్లో సీట్ల సర్దుబాటు విషయంలో మిత్రపక్షాల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు మెండుగా ఉండే ప్రమాదం లేకపోలేదంటున్నారు. పెద్ద ఎత్తున చేరికలను ఆహ్వానించడం ద్వారా ముందు ముందు సీట్ల సర్దుబాటు, పదవుల కేటాయింపు వంటి విషయాల్లో జనసేనకు తలనొప్పలు తప్పవని పరిశీలకులు అంటున్నారు. దీనికి తోడు.. కొత్తగా వచ్చి చేరిన వారి వల్ల పార్టీలో తొలి నుంచీ ఉన్న నాయకులు, కొత్తగా వచ్చి చేరిన వారి మధ్య సమన్వయం సాధించి ఏకతాటిపై ముందుకు నడిపించే విషయంలో కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు. ఈ సమస్యలను జనసేనాని ఎలా అధిగమించి కూటమి ఐక్యతకు భంగం కలగకుండా పార్టీని బలోపేతం చేస్తారన్నది వేచి చూడాల్సిందే.
[Janasena Party, Pawan Kalyan Politics, YCP Leaders Join Janasena, AP Political Alliance, TDP Janasena BJP Coalition, Telugu One]
http://www.teluguone.com/news/content/janasena-party-45-232836.html




