ఈ భీం మనని కాపాడతాడా
Publish Date:Dec 31, 2016
Advertisement
500, 1000 రూపాయల విలువ కలిగిన పాతనోట్లను రద్దుచేయగానే దేశం యావత్తూ నివ్వెరపోయింది. ఆ నివ్వెరపాటు నుంచి తేరుకున్న జనం ఒక్కసారిగా బ్యాంకుల వైపు పరుగులు తీశారు. తొలుత నల్లధనం రద్దుకోసమే ఈ నిర్ణయం అంటూ ప్రకటించిన కేంద్రం నిదానంగా నగదురహితం అనే కొత్త పల్లవిని అందుకుంది. నోట్ల పాట్లుతో విసిగెత్తిపోయి ఉన్న దేశప్రజలు కూడా నగదురహిత లావాదేవీలకు అలవాటు పడటం మొదలుపెట్టారు. అప్పటివరకూ డెబిట్ కార్డులను కేవలం ఏటీఎంలలో మాత్రమే ఉపయోగించినవారు... ఇప్పుడు స్వైపింగ్ మెషీన్లలలోనూ, ఆన్‌లైన్ కొనుగోళ్లలోనూ తమ కార్డులను వాడటం నేర్చుకున్నారు. ప్రజల్లో మొదలైన ఈ ‘నగదురహిత’ అలవాటుని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఓ కొత్త యాప్‌ను ప్రారంభించింది. అదే భీమ్ (Bharat Interface for Money - BHIM). భీం రావ్ అంబేడ్కర్ పేరు మీదుగా ఈ యాప్‌కు ఆ పేరు పెట్టామంటూ ప్రకటించిన కేంద్రం, నిన్న మోదీ చేతుల మీదుగా దీనిని లాంఛనంగా ప్రారంభించింది. రిజర్వ బ్యాంక్ ప్రోత్సాహంతో National Payments Corporation of India (NPIC) అనే సంస్థ ఈ యాప్‌ను రూపొందించింది. కేవలం UPI పిన్ నెంబరు, IFSC కోడ్ల ద్వారానే కాకుండా QR కోడ్‌ని బదిలీ చేసుకోవడం ద్వారా కూడా భీం చెల్లింపులు సాధ్యమవుతాయంటున్నారు అధికారులు. అంతేకాదు! ఈ యాప్ మెసేజ్‌ల ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి, సాధారణ ఫీచర్ ఫోన్లు ఉన్నవారు కూడా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చునని సూచిస్తున్నారు. వ్యాపారస్తులు కనుక ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే, కొనుగోలుదారుల వేలిముద్రల తీసుకుంటే చాలు... చెల్లింపులు పూర్తియిపోతాయని భరోసా ఇస్తున్నారు. కొనుగోలుదారుని బ్యాంకు ఖాతా అతని ఆధార్‌కార్డుతో అనుసంధానమై ఉండటం వల్ల ఇది సాధ్యపడుతుంది.
NPIC రూపొందించిన ఈ యాప్ ప్రపంచంలోనే ఓ గొప్ప అద్భుతంగా నిలవబోతోందంటూ మోదీ సైతం ప్రశంసిస్తున్నారు. భీం యాప్‌లో ఫీచర్స్‌ను గమనించినవారికి, ఇది నిజంగానే ఓ అద్భుతమైన యాప్ అనిపించక మానదు. ఎందుకంటే మన మొబైల్ నెంబరు బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉంటే చాలు, భీం యాప్ ద్వారా లావాదేవీలను నిర్వహించవచ్చు. అయితే దీనికోసం మన బ్యాంకు నుంచి ఒక UPI పిన్ నెంబరుని పొందాల్సి ఉంటుంది. ఒకవేళ మనం చెల్లింపులు జరిపే వ్యక్తికి UPI సౌకర్యం లేకపోతే అతని ఖాతా వివరాలతో పాటుగా అతని బ్యాంక్ IFSC CODEని ఎంటర్ చేయడం ద్వారా లావాదేవీని పూర్తిచేయవచ్చు.
ఏ రకంగా చూసినా కూడా ఈ యాప్ ఒక చక్కటి సౌకర్యంగానే కనిపిస్తోంది. కానీ వాడకంలోకి వచ్చేసరికి ఇది ఏ మేరకు ఉపయోగపడుతుందన్నది వేచి చూడాలి. నిరక్షరాస్యులు ఈ యాప్‌ను ఉపయోగించడం అంత తేలిక కాదన్నది పక్కన పెట్టేద్దాం. కనీసం సాంకేతికత మీద పట్టున్నవారిని సైతం ఈ యాప్ ఆకర్షిస్తుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే యాప్ మధ్యమధ్యలో హ్యాంగ్ అయిపోతోందనీ, ఒకసారి వాడిన తరువాత మళ్లీ తెరుచుకోవడం లేదనీ కొన్ని వార్తలు వస్తున్నాయి. యాప్ ఇంకా ప్రారంభదశలోనే ఉందికాబట్టి, దానిని ఉపయోగించే సమయంలో ఎదురయ్యే సాధకబాధకాలన్నింటినీ NPIC పరిశీలిస్తుందనీ... మరో నెల రోజుల్లో ఈ యాప్ ఎలాంటి అవాంతరమూ లేకుండా పనిచేసేలా తగు మార్పులు చేస్తుందనీ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే కనుక జరిగితే 2017 భీం నామ సంవత్సరంగా మిగిలిపోవడం ఖాయం.
http://www.teluguone.com/news/content/bharat-interface-for-money-45-70745.html





