ఏపీ స్థానిక సమరం: రాష్ట్రంలో పీక్స్ కు పొలిటికల్ హీట్.!
Publish Date:Oct 14, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కసరత్తు కొలిక్కి వచ్చింది. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం (అక్టోబర్ 14) విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల ప్రణాళిక, భద్రతా ఏర్పాట్లు, ఇతర నిర్వహణాంశాలకు సంబంధించిన సమగ్ర నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గవర్నర్‌కు సమర్పించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఎన్నికల సామగ్రి తరలింపు వంటి అంశాలపై చేపట్టిన కసరత్తును ఆయన గవర్నర్ కు వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా లోక్ భవన్ లో గవర్నర్ తో మంగళవారం (అక్టోబర్ 13) సమావేశమయ్యారు. షెడ్యూల్ ప్రకటనతో పాటు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు సంబంధించిన మున్సిపల్ పోరు నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన రిజర్వేషన్ల కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే స్పష్టత వచ్చింది. విశాఖపట్నం మేయర్ స్థానం బీసీ వర్గానికి కేటాయించగా, తిరుపతి ఎస్సీ మహిళకు, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ వర్గానికి, కృష్ణా అన్‌రిజర్వ్‌డ్ మహిళకు కేటాయించారు. అలాగే ప్రకాశం ఎస్సీ, నెల్లూరు జనరల్, గుంటూరు ఎస్సీ మహిళ, పల్నాడు అన్‌రిజర్వ్‌డ్ మహిళ, తూర్పుగోదావరి అన్‌రిజర్వ్‌డ్ మహిళ, కోనసీమ ఎస్సీ మహిళ, పోలవరం, అల్లూరి జిల్లాల్లో ఎస్టీ మహిళలకు స్థానాలు కేటాయించారు. అదేవిధంగా అనకాపల్లి, అనంతపురం జిల్లాల్లో బీసీ మహిళలకు, బాపట్ల, కాకినాడ ప్రాంతాల్లో అన్‌రిజర్వ్‌డ్ మహిళలకు అవకాశం కల్పించారు. కర్నూలులో బీసీ వర్గానికి, నంద్యాల, మార్కాపురం ప్రాంతాల్లో అన్‌రిజర్వ్‌డ్ స్థానాలు కేటాయించగా, పార్వతీపురం మన్యంలో ఎస్టీ అభ్యర్థులకు అవకాశం లభించింది. శ్రీసత్యసాయి జిల్లా అన్‌రిజర్వ్‌డ్‌గా ఉండగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. పశ్చిమగోదావరి, కడప, చిత్తూరు, ఏలూరు తదితర ప్రాంతాలకు సంబంధించి కూడా రిజర్వేషన్ల వివరాలను కమిషన్ ఖరారు చేసింది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల మధ్య తీవ్రమైన చర్చలు నడిచాయి. పాలకపక్షం, ప్రతిపక్షాల మధ్య రిజర్వేషన్ల అంశంపై వాగ్వాదాలు కూడా చెలరేగాయి. బీసీ రిజర్వేషన్ల తగ్గింపు, పెంపు అంశాలపై రాజకీయ వేదికలపై విమర్శలు, ప్రతివిమర్శలు జోరుగా సాగాయి. అయినప్పటికీ, రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించే దిశగా ఎన్నికల సంఘం ఎలాంటి ఒత్తిళ్లకు తలవంచకుండా ముందుకెళ్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఏళ్ల తరబడి అనుసరిస్తున్న నిబంధనలనే ప్రస్తుతం కూడా కొనసాగిస్తున్నామని, నోటిఫికేషన్ వెలువడే సమయంలో కొత్త నిబంధనలు తీసుకురావడం సాధ్యం కాదని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను నిర్ణీత నిబంధనల ప్రకారమే నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థల్లో మేయర్ పదవులకు, మున్సిపాలిటీల్లో ఛైర్మన్ స్థానాలకు ఈసారి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరగనుండటం విశేషం. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చెల్లించాల్సిన నామినేషన్ల ధరావతు (డిపాజిట్) మొత్తాన్ని కూడా ఎన్నికల సంఘం నిర్ణయించింది. మేయర్ అభ్యర్థులకు 3 వేల రూపాయల డిపాజిట్ నిబంధన ఖరారైంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే ఈ ప్రజాప్రతినిధి స్థానాలను గెలుచుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. [AP Local Body Elections Schedule, SEC Anil Chandra Punetha, Andhra Pradesh Municipal Elections, AP Elections Schedule, Telugu One]
http://www.teluguone.com/news/content/ap-local-body-elections-schedule-43-234317.html





