టాయిలెట్‌లో ఓ కాగితం..గాల్లోనే ప్రయాణికులకు బాంబు టెన్షన్.!
Publish Date:Nov 14, 2026
Advertisement
శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.! ఆకాశంలో ప్రశాంతంగా సాగుతున్న విమాన ప్రయాణం.. ఒక్కసారిగా బాంబు భయంతో ఉత్కంఠగా మారింది. విమానం బాత్రూంలో కనిపించిన ఓ చిన్న కాగితం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అందులో బాంబు ఉన్నట్లు రాసి ఉండటంతో కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కన్నూర్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానం 6E 244లో ఈ ఘటన జరిగింది. విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో బాత్రూంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపుతో కూడిన కాగితాన్ని అతికించాడు. దాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే విమాన సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది పైలట్‌కు సమాచారం అందించారు. పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన పైలట్.. వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇది కూడ చదవండి: నటుడిగా..దర్శకుడిగా..నిర్మాతగా..తెలుగు సినీ రంగంలో గిరిబాబు చెరగని ముద్ర.! విమానం సురక్షితంగా దిగిన వెంటనే ప్రయాణికులందరినీ కిందకు దించారు. అనంతరం విమానాన్ని ప్రత్యేక ఐసోలేషన్ బేకు తరలించారు. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతి భాగాన్ని పరిశీలించి అనుమానాస్పద వస్తువుల కోసం గాలించారు. అయితే తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో అంతా ప్రమాదం నుంచి బయటపడినట్లయింది. అయితే విమానంలో బాంబు ఉన్నట్లు కాగితం అతికించిన వ్యక్తి ఎవరన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇది ఆకతాయి చర్యనా? కావాలనే భయాందోళనలు సృష్టించేందుకు చేసిన ప్రయత్నమా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ చిన్న కాగితం.. వందల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ప్రయాణికుల అప్రమత్తత, పైలట్ సమయస్ఫూర్తితో పెను ప్రమాద భయం తప్పింది. అయినప్పటికీ ఈ ఘటన విమానయాన భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది. [ Indigo Flight, Shamshabad Airport, Bomb Threat, Kannur Hyderabad Flight, Emergency Landing, CISF ]
మీకు నచ్చవచ్చు: క్వాలిటీ రాజకీయాలు ఇక పనిచేయవు.. మైండ్‌సెట్ మార్చుకుంటాం: బొత్స
http://www.teluguone.com/news/content/-indigo-flight-23-237119.html





