political-news-img

తెలుగుదేశంకు మరో గవర్నర్ పదవి.. రేసులో ఉన్నదెవరెవరంటే?

ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ విషయంలో సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ అధిష్ఠానం ఇటీవలే పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. అలాగే ఇప్పుడు దేశ వ్యాప్తంగా భర్తీ చేయాల్సిన ఉన్న ఐదు రాష్ట్రాల గవర్నర్ లను భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ ఐదు గవర్నర్ పదవులలో రెండింటిని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు కేటాయించాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రెండింటిలోనూ ఒకటి ఎన్డీయేలో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని మోడీ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా. ఈ సమాచారాన్ని ఆయన ఇప్పటికే చంద్రబాబుకు అందించారని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు. ఇప్పుడు 5 రాష్ట్రాల భర్తీలో మరో 2 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని కేంద్రం డిసైడ్ అవ్వడంతో, రెండో గవర్నర్ పదవి కూడా టీడీపీ ఖాతాలోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం తరఫున మరో గవర్నర్ పదవికి ఎవరు ఎంపికౌతారన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. కాగా గవర్నర్ రేసులో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ యనమలరామృష్ణుడు, అలాగే మరో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, అలాగే సీనియర్ నాయకుడు కేఈ క్రిష్ణమూర్తిలు ఉన్నారు. వీరిలో యనమల, కేఈ బీసీ వర్గానికి చెందిన వారు కాగా, ప్రతిభా భారతి ఎస్సీసామాజిక వర్గానికి చెందిన నేత. ఈ ముగ్గురూ కూడా ఆరంభం నుంచీ తెలుగుదేశం పార్టీకి విధేయంగా ఉండి కీలక బాధ్యతలలో సేవలందించిన వారే. వీరి ముగ్గురిలో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి, ఉత్కంఠా సర్వత్రా నెలకొని ఉంది. Another Governer post for TDP, NDA Governor Appointments, Yanamala Ramakrishnudu, Pratibha Bharati, KE Krishnamurthy, Chandrababu Naidu, TeluguOne

Publish Date: Aug 21, 2026 4:17PM

political-news-img

జగన్ హైదరాబాద్ పర్యటన.. స్వాగత ఫ్లెక్సీలపై కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు.!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఆ సందర్భంగా ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నేతలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు హాట్ టాపిక్‌గా మారాయి. వైఎస్ జగన్ ఏదో బీఆర్ఎస్ నాయకుడా అన్నట్లుగా ఆ కటౌట్లు, పోస్టర్లు, బ్యానర్లు ఉన్నాయి. ఈ ఫ్లెక్సీల్లో జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి. గతంలో వైసీపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న రాజకీయ సంబంధాలు, ఇరు రాష్ట్రాల ముఖ్య నేతల మధ్య ఉన్న సాన్నిహిత్యం నేపథ్యం దృష్ట్యా ఇప్పుడీ పోస్టర్లు, ఫ్లెక్సీలు ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, పొలిటికల్ చర్చకు తెరలేపాయి. జగన్ పర్యటనలూ ర్యాలీలలో కేటీఆర్, కేసీఆర్ ఫొటోలు.. తెలంగాణలో వైసీపీ, బీఆర్ఎస్ ల పొత్తకు సంకేతాలా అన్న చర్చకు తెరలేచింది. తెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికలు ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్, వైసీపీల మధ్య పొలిటికల్ అలయెన్స్ ఏదైనా కుదిరిందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే తెలంగాణ స్థానిక పోరులో ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్ పట్టు నిలుపుకోవాలంటే.. అందుకు జనసేన రంగంలో ఉండటం ఒక విధంగా జనసేన పోటీ బీఆర్ఎస్ విజయావకాశాలకు గండి కొట్టే అవకాశాలున్నాయన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఏపీకి చెందిన వారు జనసేన వైపు మొగ్గు చూపుతారనీ, అలా జరగకుండా అడ్డుకోవాలంటే..జగన్ సహకారం అవసరమనీ బీఆర్ఎస్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ కూడా అందుకు సుముఖంగానే ఉండటంతో రానున్న రోజులలో వైసీపీ, బీఆర్ఎస్ పోత్తుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడినా ఆశ్వర్యం లేదని అంటున్నారు. YS Jagan Hyderabad Visit, BRS YSRCP Flexis Begumpet, Jagan Jalavihar Wedding Visit, Telangana Politics Updates, KCR KTR YS Jagan Cutouts

Publish Date: Aug 21, 2026 3:13PM

political-news-img

కాంగ్రెస్ గూటికి ప్రవీణ్ ప్రకాష్.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, ఐఏఎస్ వ్యవస్థలోనూ అత్యంత ప్రభావమంతమైన అధికారిగా గుర్తింపు పొందిన 1994 బ్యాచ్ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ జగన్ హయాంలో వ్యవహరించిన తీరు కారణంగా ప్రతిష్ఠను మసకబార్చుకున్నారు. చివరికి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. జగన్ హయాంలో తన పరిధులను మరిచి వ్యవహరించిన ఆయన తీరా వైసీపీ 2024 ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకు అధికారం కోల్పోయిన తరువాత.. తప్పులను గ్రహించి.. ఆ తప్పులకు శిక్ష తప్పదన్న భయంతో వీఆర్ఎస్ తీసుకున్నారు. సెప్టెంబర్ 30, 2024న ఆయన ఇలా రాజీనామా చేయగానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలా ఆమోదించేసింది. అప్పుడు గానీ ఆయనకు తాను చేసినది తొందరపాటు చర్య అని గ్రహింపునకు రాలేదు. రాజీనామాను వెనక్కు తీసుకుని తిరిగి సర్వీసులో చేరుదామని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చేసేదేమీ లేక ఆయన తన స్వరాష్ట్రమైన యూపీకి చేరుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఏపీలో 2019 నుండి 2021 వరకు ప్రవీణ్ ప్రకాష్ అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన ముఖ్యమంత్రి సీఎంవోలో క్రియాశీల అధికారిగా, ప్రభుత్వ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన మోస్ట్ పవర్ ఫుల్ బ్యూరోక్రాట్‌గా పేరొందారు. జగన్‌ హయంలో ఆయన ఓ సమర్ధుడైన ఐఏఎస్ అధికారిగా కంటే జగన్‌కు, వైసీపీ నమ్మకస్తుడైన ఓ పొలిటికల్ అసిస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో వ్యవహరించిన తీరుతో తీవ్ర విమర్శల పాలయ్యారు. ఆ తరువాత వారికి క్షమాపణ చెప్పారు. ఇలా ఒకటనేంటి ఆయన తన చర్యలతో చేష్టలతో బోలెడంత అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దిగిపోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రవీణ్ ప్రకాష్ కు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. దాదాపు మూడు నెలలు వేచి చూసి ప్రవీణ్ ప్రకాష్ చేసిన రాజీనామాను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆమోదించింది. అటువంటి ప్రవీణ్ ప్రకాష్ తాజాగా కాంగ్రెస్ గూటికి చేరి ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టారు. Praveen Prakash join Congress, Ex IAS Praveen Prakash, Andhra Pradesh IAS VRS, UP Congress Politics, contravarsies, Ap Politics

Publish Date: Aug 21, 2026 2:41PM

political-news-img

జగన్ ప్రెస్ మీట్లు.. మీమర్లకు పండుగ.. వైసీపీకి దండగ.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైపీపీ అధినేత ప్రెస్ మీట్ అనగానే వైసీపీ నేతలు, శ్రేణుల గుండెల్లో గుబులు మొదలౌతుంది. అదే సమయంలో ఆయన ప్రత్యర్థులకు, నెటిజనులకు, మీమర్లకు పండుగ వస్తున్నదన్నంత ఆనందం మొదలౌతుంది. జగన్.. పర్యటనలు, ప్రకటనలు, మీడియా సమావేశాలు ఎప్పుడూ రాజకీయ సంచలనమే. ఆయన ఏం మాట్లాడినా నెటిజనులకు, విమర్శకులకు, ప్రత్యర్థులకు ఎప్పుడూ అడ్డంగా దొరికి పోతుంటారు. వాస్తవ దోషాలు, తప్పులు, తడబాటు ఇవే జగన్ రెడ్డి ప్రసంగాలనూ, ప్రెస్ మీట్లనూ ప్రత్యేకంగా నిలుపుతాయి. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండూ ఒకటేనంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను తలలుపట్టుకునేలా చేస్తే.. ఆయన ప్రత్యర్థులు, నెటిజనులు, మీమర్లు పండుగ చేసుకున్నారు. కనీసమైన ప్రాథమిక పరిజ్ణానం లేని వ్యక్తా ఐదేళ్ల పాటు ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసింది అంటూ నెట్టింట జగన్ తెగ ట్రోలింగ్ కు గురయ్యారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య ఉన్న తేడా తెలియని వ్యక్తికి రాజకీయాలెందుకు? అంటూ తెలుగుదేశం కూటమి నేతలు, నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. గతంలో వైసీపీ సోషల్ మీడియా, మీడియా లోకేష్ ఆహార్యం, ఆహారం, భాష ఇలా ప్రతి విషయంలోనూ ట్రోల్ చేసేది. బాడీ షేమింగ్ కు కూడా వెనుకాడేది కాదు. అయితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. దీంతో వైపీపీయులు జగన్ ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటే మేలని అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ప్రెస్ మీట్ లనేమిటి అసలు బయటకు రాకుండా సైలంట్ గా ఉంటే పార్టీకి మేలు జరుగుతుందనీ, అలా కాకుండా ఆయన బయటకు వచ్చి మాట్లాడితే ఉన్న కొద్ది పాటి ప్రతిష్ఠ కూడా మంటగలిసేలా ఉందన్న భయం వైసీపీయుల్లో వ్యక్తమతోంది. YS Jagan pressmeets worrying YCp, YSRCP Politics, Jagan Press Meet Controversies, AP Politics News, Jagan Mohan Reddy Speeches

Publish Date: Aug 21, 2026 2:21PM

political-news-img

తమిళనాడు సీఎం విజయ్ బాటలో కల్వకుంట్ల కవిత.. ఏం చేశారంటే?

తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేతత్రి కల్వకుంట్ల కవిత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ను అనుసరిస్తున్నారు. ఎన్నికల బరిలో దిగిన తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించి సీఎం పీఠాన్ని అధిరోహించిన టీవీకే అధినేత విజయ్ అడుగు జాడల్లో నడుస్తూ కవిత కూడా తెలంగాణ రక్షణ సేనను గెలుపు బాటలో నడిపించి తెలంగాణ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇందుకోసం ఆమె తాజాగా తమిళనాడు సీఎం విజయ్ కి సన్నిహితుడు, ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన కవితతో భేటీ అయ్యారు. తమిళనాడు రాజకీయాల్లో రిక్కీ రాధన్ పండిట్ పాత్ర కీలకమైనదిగా భావిస్తారు. ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ ప్రతికూలంగా వ్యాఖ్యానించినప్పటికీ, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని రికీ రాధన్ జోస్యం చెప్పారు. ఆయన చెప్పినట్లే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో రిక్కీ రాధన్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. విజయ్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాధన్‌ను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కూడా నియమించారు. అయితే ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆ నియామకాన్ని ఉపసంహరించుకున్నారనుకోండి అది వేరే విషయం. అయితే విజయ్ రాజకీయ నిర్ణయాల్లో రాధన్ పండిట్ సలహాలు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయని అంటారు. ఇటువంటి రాధన్ పండిట్ చెన్నై నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి కవితతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత తన కుమారుడితో కలిసి రిక్కీ రాధన్ పండిట్‌ను శాలువాతో సత్కరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రక్షణ సేన భవిష్యత్తు, రాబోయే రోజుల్లో కవిత రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతోందనే అంశాలపైనే కవిత రాధన్ పండిట్ సలహాలు కోరినట్లు తెలుస్తోంది. తమిళనాడులో విజయ్‌కి తిరుగులేని రాజకీయ విజయం లభిస్తుందని ముందుగానే జోస్యం చెప్పిన రాధన్ పండిట్ ను కవిత ఆశ్రయించారని అంటున్నారు. తమిళనాడు సీఎం విజయ్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై కవిత ఇటీవల బహిరంగంగానే ప్రశంసలు కురిపించడం, తెలంగాణలో అమ్మ పాలన అందిస్తామని ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాధన్ పండిట్ తో కవిత భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. Kalvakuntla Kavitha follows Tamilnadu CM Vijay, Ricky Radhan Pandit, CM Vijay Astrologer, Kavitha Ricky Radhan Meeting, Telangana Rakshana Samithi, Telangana Politics

Publish Date: Aug 21, 2026 11:49AM

political-news-img

వల్లభనేని వంశీ.. ఎలా ఉండేవారు.. ఎలా అయిపోయారు.!

గన్నవరం నియోజకవర్గంలో తిరుగులేని నేతగా చక్రం తిప్పిన వల్లభనేని వంశీ పరిస్థితి ఇప్పుడు ఆయన ప్రత్యర్థులకు సైతం జాలికలిగేలా మారిపోయింది. రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పంచన చేరిన తరువాత వల్లభనేని వంశీ రాజకీయ జీవితం మెట్టుమెట్టుగా దిగజారుతూ వచ్చచింది. ఇప్పుడు ఆయన పరిస్ధితి వైసీపీలో ఓ సామాన్య కార్యకర్తతో సమానంగా మారిపోయింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కన్నూమిన్నూ గానకుండా వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ చట్టపరంగానూ, రాజకీయంగానూ కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ.. రెండో సారి అంటే 2019 ఎన్నికలలో విజయం సాధించిన అనంతరం తెలుగుదేం వీడి వైసీపీ పంచన చేరారు. రాజకీయాలలో ఓ నాయకుడు పార్టీ మారడం సాధారణమే అయినా, ఆయన పార్టీ మారిత తరువాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, దూషణలు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే.. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి సాక్షులను బెదిరించడం, కిడ్నాప్ ఆరోపణలు వంటి పలు కేసుల్లో ఆయన జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రాజకీయంగానూ ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వైసీపీ అధినేత జగన్ వంశీకి కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేట్ వద్దకు కూడా అనుమతించని పరిస్థితి ఉంది. ఇటీవలి కాలంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లిన సమయంలో వంశీ ఎదుర్కొన్న పరిస్థితులు, ఆయన ఎదురుచూడాల్సిన వచ్చిన తీరు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యింది. ఒకప్పుడు గన్నవరం నియోజకవర్గాన్ని శాసించిన వల్లభనేని వంశీకి ఇప్పుడు అక్కడ ఇసుమంతైనా గుర్తింపు లభించడంలేదు. ఆయనపై నమోదైన వరుస కేసులు, అరెస్టుల భయంతో ముఖ్య అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం వంశీకి దూరంగా జరుగుతున్నారు. తాజాగా జగన్ కు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన సందర్భంగా వంశీ ఒక సాధారణ కార్యకర్తలా బారికేడ్ల వెనుక నిలబడి తోసుకుంటూ.. అధినేత చూపుల్లో ఒక్కసారి పడేందుకు తాపత్రేయపడుతున్న దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇంతగా ప్రాధాన్యత కోల్పోయి, అవమానాలు ఎదుర్కొంటూ కూడా వైసీపీలో వంశీ ఎందుకు కొనసాగుతున్నారు అన్న ప్రశ్నకు వంశీకి వైసీపీ తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి ఉండటమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీలోకి ఫిరాయించిన తర్వాత ఆయన పరువు, ప్రతిష్టలతో పాటు రాజకీయ భవిష్యత్తును కూడా కోల్పోయారంటున్నారు. అన్ని వైపులా తలుపులు మూసుకు పోవడంతో వంశీకి వైసీపీలోనే కొనసాగాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Jagan ignoe Vallabhaneni Vamsi, YCP, Gannavaram Politics, YSJagan, AP Politics, TeluguOne

Publish Date: Aug 21, 2026 11:17AM

MOVIE NEWS