TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

బెజవాడ దసరా ఉత్సవాలకు సీఎం విజయ్: ఆహ్వానానికి సానుకూల స్పందన.!

విజయవాడలో జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. విజయవాడ ఉత్సవ ప్రతినిధి బృందం చెన్నైలోని తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో విజయ్‌ను కలిసి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించింది. ఈ ఆహ్వానంపై సీఎం విజయ్ సానుకూలంగా స్పందించారు. విజయ్‌ను కలిసి ఆహ్వానించిన ప్రతినిధి బృందంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. విజయవాడలో జరగనున్న దసరా శరన్నవరాత్రి వేడుకలతో పాటు విజయవాడ ఉత్సవ్-2.0 కార్యక్రమాల గురించి కూడా వారు తమిళనాడు సీఎంకు వివరించారు. మైసూరు దసరా ఉత్సవాలకు దీటుగా బెజవాడ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు విజయ్ కు తెలిపిన ప్రతినిథి బృందంఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవ వైభవాన్ని వీక్షించాలని కోరారు. ఈ సందర్భంగా విజయవాడ నగరానికి ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని కూడా వారు ఆయనకు వివరించారు. అదలా ఉంటే.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరగనున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ దర్శనం, క్యూలైన్లు, హోల్డింగ్ ఏరియాలు, అన్నప్రసాదం, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా వేడుకలతో పాటు విజయవాడ ఉత్సవ్-2.0ను కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆధ్వర్యంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరిగే ఈ పది రోజుల ఉత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కళలు, భక్తి కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, కార్నివాల్, ఎగ్జిబిషన్లు, క్రీడా కార్యక్రమాలు తదితరాలు ఉండనున్నాయి. విజయవాడ దసరా, విజయవాడ ఉత్సవ్-2.0కు జాతీయ స్థాయిలో ప్రముఖులను ఆహ్వానించే కార్యక్రమం కొనసాగుతోంది. తమిళనాడు సీఎం విజయ్‌తో పాటు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులను కూడా కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది విజయవాడ ఉత్సవాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడుతోంది. [Vijayawada Dasara Celebrations, Invitation CM Vijay, Tamil Nadu CM Vijay, Vijayawada Sharannavaratri Celebrations, Vijayawada Utsav, Kesineni Chinni, Lavu Sri Krishna Devarayalu, Magunta Srinivasulu,Telugu One]

Published on: Wed Oct 7, 2026 3:47PM

political-news-img

కొలికపూడి వర్సెస్ బాలకోటయ్య: టీడీపీ హైకమాండ్ సీరియస్..ఉపేక్షించబోమంటూ వార్నింగ్.!

తిరువూరు తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు పట్ల పార్టీ హైకమాండ్ మరో సారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ పరువు తీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్యను కూడా మందలించింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, పోతుల బాలకోటయ్య మధ్య విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఈ ఇద్దరు సీనియర్ నేతలూ బహిరంగంగా విమర్శలు, ప్రతివిమర్శలకు పాల్పడటంపై హైకమాండ్ సీరియస్ అయ్యింది. వీరి వ్యవహార తీరు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఉందని అభిప్రాయపడింది. వీరిరువురి మధ్యా విభేదాలు రచ్చకెక్కడానికి కారణం, ఎస్సీ వర్గానికి చెందిన పీఈటీని ఎమ్మెల్యే కొలికపూడి తన ఇంటికి పిలిపించి దూషించారని, దాడి చేశారని పోతుల బాలకోటయ్య పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడమే. అయితే ఈ ఆరోపణలను కొలికపూడి శ్రీనివాసరావు ఖండించారు. తనపై బాలకోటయ్య కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసత్య ఆరోపణలతో తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని కొలికిపూడి అన్నారు. ఈ వివాదం ఇరువురి మధ్యా విమర్శలు, ప్రతి విమర్శలు దారి తీసింది. వీరి విభేదాలపై మీడియా కూడా విస్తృతంగా కథనాలు ప్రచారం చేసింది. ప్రచురించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇద్దరు నేతలతో వేర్వేరుగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పార్టీ కార్యాలయంలో పోతుల బాలకోటయ్యతో భేటీ అయిన ఆయన, అలాగే కొలికపూడి శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలకు పార్టీ అధిష్టానం తరఫున గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఎవరికైనా వ్యక్తిగత విభేదాలు లేదా మనస్పర్థలు ఉంటే వాటిని బహిరంగంగా కాకుండా అంతర్గతంగా సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అంతేకానీ, ఈ వ్యక్తిగత గొడవలను రెండు వేర్వేరు ఎస్సీ ఉప కులాల మధ్య కుల తగాదాలుగా లేదా ఘర్షణలుగా మార్చడానికి ప్రయత్నిస్తే మాత్రం పార్టీ పరంగా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ప్రవర్తనను తెలుగుదేశం పార్టీ ఏమాత్రం సహించబోదని పల్లా శ్రీనివాసరావు విస్పష్టంగా చెప్పారు. ప్రజాక్షేత్రంలో పార్టీ పరువుకు, కీర్తి ప్రతిష్టలకు ఏమాత్రం నష్టం కలిగించేలా ప్రవర్తించినా ఉపేక్షించేది లేదనిహెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి బహిరంగ విమర్శలకు పాల్పడకుండా ఇరువర్గాలు సంయమనం పాటించాలని, క్రమశిక్షణతో మెలగాలని హెచ్చరించారు. [Kolikapudi VS Pothul, Kolikipudi Srinivasa Rao, Pothula Balakotayya, TDP High Command, Palla Srinivasa Rao, Tiruvuru MLA, Telugu One]

Published on: Wed Oct 7, 2026 3:40PM

political-news-img

శభాష్ గాయత్రీ: మానవ సేవే మాధవ సేవ స్ఫూర్తిని చాటారు: చంద్రబాబు ప్రశంసలు.!

మానవ సేవే మాధవ సేవ అంటారు.. అటువంటిది మాధవుడి సన్నిధిలోనే మానవ సేవ చేసి అందరి ప్రశంసలూ అందుకుంది గాయత్రి అనే ఉద్యోగిని. ఆమె సేవకు ఫిదా అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చం్రబాబునాయుడు ఆమెను అభినందించారు. అసలింతకీ విషయమేంటంటే.. చిన్న తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నిత్యాన్నదాన కేంద్రంలో పని చేసే గాయత్రి అనే ఉద్యోగిని ఈ నెల 3న విధి నిర్వహణలో ఉండగా, భీమడోలు మండలంమండలం పాతూరు గ్రామానికి చెందిన దివ్యాంగ భక్తుడు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించున్న అనంతరం అన్నదాన కేంద్రానికి వెళ్లాడు. రెండు చేతులూ లేని ఆ భక్తులు భోజనం చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇది గమనించిన గాయత్రి.. వెంటనే అతని వద్దకు వెళ్లి అన్నం కలిపి స్వయంగా తినిపించారు. ఆమె అలా అన్న తినిపిస్తున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి వెంటనే వైరల్ అయ్యాయి. నెటిజనులు ఆమెను నిజమైన భగవంతుడి సేవకురాలిగా అభివర్ణిస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన శభాష్ గాయత్రీ అంటూ ప్రశంసించారు. దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించి ఆకలి తీర్చిన ఆమె సహృదయానికి వందనాలు తెలిపారు. మానవ సేవే మాధవ సేవ స్ఫూర్తిని గాయత్రీ తన చర్యతో చాటిచెప్పారని చంద్రబాబు ప్రశంసించారు. విధుల్లో భాగంగా భక్తులకు సేవలందించే ఆమె.. ఓ భక్తుడి ఇబ్బందిని ప్రత్యేకంగా గుర్తించి స్వయంగా సహాయం చేయడం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇదిలా ఉండగా, గాయత్రీ సేవాభావాన్ని ద్వారకాతిరుమల ఆలయ ఈవో వెండ్ర త్రినాథరావు అభినందించారు. ఆలయంలోని అన్నదాన భవనంలో ఆమెను శాలువాతో సత్కరించి, స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. తోటి మనిషి పట్ల గాయత్రీ చూపిన నిస్వార్థ సేవాభావం ప్రశంసనీయమని ఈవో పేర్కొన్నారు. [Gayatri Godly Service Differently Abled Devotee, Dwaraka Tirumala, Chandrababu,Praise, Service to Humanity, service to God, AP News, Dwaraka Tirumala, Telugu One]

Published on: Wed Oct 7, 2026 10:15AM

political-news-img

తిరుమల శ్రీవారికి భక్తుల కానుకలు: కొత్త రికార్డులు సృష్టిస్తున్న హుండీ ఆదాయం.!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం భక్తులతో నిత్యం కిటకిటలూడుతుంటుంది. ఇటీవలి కాలంలో భక్తుల తాకిడి మరింత పెరిగింది. పెరిగిన రద్దీకి తగినట్లుగానే శ్రీవారి హుండీ ఆదాయం కూడా కొత్త రికార్డులను సృష్టిస్తోంది. టీటీడీ వెల్లడించిన వివరాల మేరకు జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అంటే ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లోనే శ్రీవారి హుండీ ద్వారా రూ.1,129.04 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్క జులై నెలలోనే శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ.140.25 కోట్లు వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఒక నెలలో వచ్చిన అత్యధిక హుండీ ఆదాయంగా కొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలలోనూ ఏ నెల కానె శ్రీవారి హుండీ ఆదాయం భారీగా వచ్చిందని టీటీడీ పేర్కొంది. జనవరిలో రూ.124.36 కోట్లు, ఫిబ్రవరిలో రూ.110.92 కోట్లు, మార్చిలో రూ.125.24 కోట్లు, ఏప్రిల్‌లో రూ.115.84 కోట్లు, మేలో రూ.120.28 కోట్లు, జూన్‌లో రూ.128.30 కోట్ల ఆదాయం నమోదైంది. జూలైలో గరిష్ఠంగా రూ.140.25 కోట్లు రాగా, ఆగస్టులో రూ.137.44 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.126.41 కోట్లు వచ్చాయి. నెలవారీ ఆదాయంతో పాటు రోజువారీ హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. సెప్టెంబర్ 10న ఒక్కరోజే రూ.6.94 కోట్ల కానుకలు వచ్చాయి. ఇది టీటీడీ చరిత్రలో నాలుగో అత్యధిక రోజువారీ హుండీ ఆదాయంగా టీటీడీ తెలిపింది. [Tirumala Srivari Hundi Income New Record, Tirumala Hundi income, TTD Hundi income, Lord Venkateswara, Tirumala News, Telugu One]

Published on: Tue Oct 6, 2026 2:29PM

political-news-img

పల్నాడులో రోడ్డు ప్రమాదం: మంత్రి గొట్టిపాటి డ్రైవర్ దుర్మరణం.!

పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యక్తిగత డ్రైవర్ తన్నీరు శ్రీహరి దుర్మరణం పాలయ్యారు. ఆయన వయస్సు 32 ఏళ్ళు. చిలకలూరిపేట పరిధిలోని పోలిరెడ్డిపాలెం బైపాస్ రోడ్డుపై సోమవారం (అక్టోబర్ 5) రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీహరి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓ కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డ ఆయన చికిత్స కోసం తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన శ్రీహరి తన మోటార్‌సైకిల్‌పై పోలిరెడ్డిపాలెం బైపాస్‌ మీదుగా వెళ్తున్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు ఆయన బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి శ్రీహరి బైక్‌పై నుంచి ఎగిరిపడి రోడ్డుపై పడటంతో తలకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పాటు గాయపడిన శ్రీహరిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే తీవ్ర గాయాల కారణంగా ఆయన మార్గమధ్యంలోనే మృతి చెందారు.. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై శ్రీహరి తండ్రి అంకయ్య ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్‌కు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం ప్రమాదానికి అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.శ్రీహరి చాలాకాలంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ వద్ద వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. తన వద్ద నమ్మకంగా పనిచేసే శ్రీహరి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంపై మంత్రి గొట్టిపాటి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. [Minister drier Fied Road Accident, Gottipati Ravikumar, Minister Gottipatis driver Srihari, Chilakaluripet Road Accident, Palnadu Accident, Telugu One]

Published on: Tue Oct 6, 2026 12:02PM

political-news-img

12 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ఏర్పాట్లపై టీటీడీ సమీక్ష.!

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బ్రహ్మోత్సవాట ఏర్పాట్లపై టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ఇతర ఉన్నతాధికారులతో కలిసి తిరుమల అన్నమయ్య భవన్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, టీటీడీ జేఈవోలు, సీవీఎస్వోతో పాటు వివిధ విభాగాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత నెలలో నిర్వహించిన సాలకట్ల బ్రహ్మోత్సవాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి ఏర్పాట్లను మరింత మెరుగుపరచాలని నిర్ణయించారు. ఈ ఉత్సవాలకు గతంతో పోలిస్తే సుమారు పాతిక నుంచి 30 శాతం అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది. వరుస సెలవులు, పెరటాసి మాసం నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, వసతి, అన్నప్రసాదం, రవాణా, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత వంటి విభాగాలను అప్రమత్తం చేశారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారి వాహన సేవలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో భద్రత పరంగా ఎటువంటి లోటుపాట్లూ లేకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అధికారులకు సూచించారు. భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న అంచనాలతో అన్నప్రసాదం, పారిశుధ్యం, వైద్య సేవలు, రవాణా, పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్వీబీసీ ప్రసారాలు, విజిలెన్స్, పోలీసు భద్రత వంటి అంశాలపై టీటీడీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. తిరుపతిలోని వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కోఆర్డినేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత నెల సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో ఎదురైన అనుభవాలను కూడా అధికారులు సమీక్షించారు. భక్తులకు ఇబ్బందులు ఎదురైన అంశాలు, ఏర్పాట్లలో ఉన్న లోటుపాట్లను గుర్తించి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఆదేశించారు. పోలీసు, జిల్లా యంత్రాంగం, టీటీడీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. [Tirumala Navaratri Brahmotsavams, TTD Tirumala, Srivari Brahmotsavam, Tirumala Devotees, TTD arrangements, Review Meeting, Telugu One]

Published on: Tue Oct 6, 2026 10:47AM

political-news-img

ఏపీలో కొత్తగా మరో నాలుగు పోలీస్ కమిషనరేట్ లు: జీవో జారి చేసిన ప్రభుత్వం.!

పోలీస్ శాఖలో మార్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో తిరుపతి, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం కేంద్రాలుగా నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, ట్రాఫిక్, నేరాలు, వీఐపీ భద్రత, శాంతిభద్రతల నిర్వహణ మరింత మెరుగుపరి చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త కమిషనరేట్లకు ఐజీపీ లేదా డీఐజీ స్థాయి అధికారి కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా వ్యవహరించనున్నారు. వీరికి బీఎన్ఎస్ఎస్ 2023లోని సెక్షన్ 14(6) ప్రకారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను కల్పించింది.. దీంతో పోలీస్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ నిర్వహణలో నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్రీకృతమవుతుంది. భక్తుల రద్దీ, ట్రాఫిక్, నేరాల నియంత్రణ, వీఐపీల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేశారు. దీని పరిధిలో తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీసిటీ టెరిటోరియల్ జోన్లు ఉంటాయి. తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట, చంద్రగిరి, శ్రీసిటీ, పుత్తూరు, నాయుడుపేట సబ్‌డివిజన్లు కూడా ఈ కమిషనరేట్ పరిధిలోకే వస్తాయి. తిరుపతి కమిషనర్ పోస్టు కోసం విజయవాడ సిటీ క్రైమ్స్ జాయింట్ సీపీ పోస్టును పునర్వ్యవస్థీకరించారు. అలాగే మెరైన్ వింగ్ ఎస్పీ పోస్టును డీసీపీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ పోస్టును డీసీపీ (శ్రీకాళహస్తి), విజయవాడ ట్రాఫిక్ డీసీపీ పోస్టును డీసీపీ (తిరుపతి), గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ పోస్టును డీసీపీ (శ్రీసిటీ)గా మార్చారు. ఇక గుంటూరు కమిషనరేట్‌కు కూడా ఐజీపీ లేదా డీఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. దీని పరిధిలో గుంటూరు, గుంటూరు రూరల్, అమరావతి క్యాపిటల్ రీజియన్, తెనాలి జోన్లను ఏర్పాటు చేశారు. గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తుళ్లూరు, మంగళగిరి తదితర ప్రాంతాలు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. కమిషనరేట్‌కు ఐదుగురు డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలను కేటాయించారు. రాజమహేంద్రవరం కమిషనరేట్‌కు ఐజీపీ లేదా డీఐజీ స్థాయి అధికారి కమిషనర్‌గా ఉంటారు. దీని కింద నలుగురు డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు పనిచేయనున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్, సౌత్, నార్త్, ఈస్ట్, కొవ్వూరు సబ్‌డివిజన్లు ఈ కమిషనరేట్ పరిధిలోకి రానున్నాయి. కర్నూలు కమిషనరేట్ పరిధిలో కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్‌డివిజన్లు ఉంటాయి. రాష్ట్రంలోని ఇతర కొత్త కమిషనరేట్ల మాదిరిగానే దీనికి కూడా ఉన్నత స్థాయి పోలీస్ అధికారి నేతృత్వం వహించనున్నారు. కాగా ఈ నాలుగు కమిషనరేట్ల ఏర్పాటు చేసినప్పటికీ, అదనపు పోస్టులను మంజూరు చేయకుండా, ఇప్పటికే ఉన్న పోలీస్ శాఖ పోస్టులను పునర్వ్యవస్థీకరించి సిబ్బందిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన చోట డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీల పోస్టులను ప్రస్తుతం ఉన్న క్యాడర్ నుంచి మార్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం నగరాలకు పోలీస్ కమిషనరేట్ వ్యవస్థ అమల్లో ఉంది. తాజాగా మరో నాలుగు కమిషనరేట్ల ఏర్పాటుతో ఈ వ్యవస్థ పరిధి రాష్ట్రంలోని మరిన్ని ప్రధాన పట్టణ, అభివృద్ధి ప్రాంతాలకు విస్తరించింది. మొత్తంగా చూస్తే, నాలుగు కొత్త కమిషనరేట్ల ఏర్పాటు ద్వారా పోలీస్ శాఖలో కమాండ్, కంట్రోల్, సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం, ఉద్యేశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుపతిలో భక్తుల రద్దీ, గుంటూరు, అమరావతి ప్రాంతంలో వేగంగా జరుగుతున్న అర్బనైజేషన్, రాజమహేంద్రవరం, కర్నూలు ప్రాంతాల్లో శాంతిభద్రతల నిర్వహణకు కొత్త వ్యవస్థ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. [AP Police Commissionerates, Andhra Pradesh Police, Tirupati Commissionerate, Guntur Commissionerate, Kurnool Commissionerate, Rajamahendravaram Commissionerate, AP Police, Police Commissionerates, Chandrababu Government,Telugu One]

Published on: Tue Oct 6, 2026 10:37AM

political-news-img

వెయ్యి పాఠశాలలకు 5-స్టార్ హోదా.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు.!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పాఠశాలల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు .ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాలల మౌలిక వసతులు, స్కిల్ డెవలప్‌మెంట్‌పై లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని జీరో-స్టార్ పాఠశాలలను వన్-స్టార్ స్థాయికి తీసుకురావాలని ఆదేశించారు. ఏడాదిలోగా వన్-స్టార్ పాఠశాలలను టూ-స్టార్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. 2029 నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలను 4-స్టార్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అలాగే.. కనీసం వెయ్యి పాఠశాలలను 5-స్టార్ స్థాయికి అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల్లోని పాఠశాలలకు మౌలిక వసతుల కల్పనలో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,685 వన్-స్టార్, 15,618 టూ-స్టార్, 19,099 త్రీ-స్టార్, 7,172 ఫోర్-స్టార్ పాఠశాలలు ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.రాష్ట్రంలోని సుమారు 7 వేల హైస్కూళ్లలో పూర్తిస్థాయి కంప్యూటర్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లోకేష్ ఆదేశించారు. అకడమిక్ సంస్కరణలు పూర్తవుతున్న నేపథ్యంలో.. ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాల మెరుగుదలపై అధికారులు, ఉపాధ్యాయులు దృష్టి సారించాలని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌పైనా మంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ ఏడాది 5 లక్షల మంది విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్ అందించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్, నేషనల్ అప్రెంటిస్‌షిప్ స్కీమ్ వంటి కేంద్ర పథకాలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను నైపుణ్యం పోర్టల్‌లోకి తీసుకురావాలని.. ఏఐ ఆధారిత విధానాలతో ఇంటర్వ్యూలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందేలా యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అన్నారు. సీడాప్, ఓంక్యాప్‌ల ద్వారా జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషల్లో శిక్షణ అందించాలని అధికారులను ఆదేశించారు.పాఠశాలల అభివృద్ధితో పాటు.. విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణ అందించడంపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. [ Minister Nara Lokesh, Andhra Pradesh Schools, AP Government Schools, 5 Star Schools, School Infrastructure, Education Development, AP Education, Skill Development, PMKVY, Skill Training, Student Skill Development, Government Schools, Leap Schools, Atal Tinkering Labs, Computer Labs, PM Internship Scheme ]

Published on: Mon Oct 5, 2026 7:17PM

political-news-img

సిలికాన్ వ్యాలీని తలదన్నేలా అమరావతి: చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్..

అమరావతి సైబరాబాద్ ను తలదన్నే ఐటీ హబ్ గా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ పేరిట నిర్వహించిన ఉన్నత స్థాయి సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలపై కీలక ప్రకటనలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను నిర్మించి అభివృద్ధి చేసిన సైబరాబాద్‌ను మించిన సాంకేతిక కేంద్రంగా ఏపీ రాజధాని అమరావతిని రూపుదిద్దుతున్నట్లు చెప్పారు. ఆధునిక టెక్నాలజీ రంగానికి పెద్దపీట వేస్తూ, అమరావతిని సిలికాన్ వ్యాలీని తలదన్నేలా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. భవిష్యత్తులో దేశ విదేశాల నుంచి పేరుమోసిన ఐటీ నిపుణులు ఈ ప్రాంతం వైపు ఆకర్షితులయ్యే విధంగా మౌలిక వసతులను కల్పిస్తున్నామని నారా చంద్రబాబు చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా ఆధునికమైన క్వాంటం కంప్యూటర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించిన చంద్రబాబు.. ప్రాంతీయంగానే కాకుండా, ఈ అధునాతన వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు క్వాంటం కంప్యూటర్ సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల సేవలను తలపించేలా సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు అమరావతి కేంద్ర బిందువు కానుందన్నారు. ఒకప్పుడు కేవలం పరిమిత సంకేతాలు అందించిన టెలికాం రంగం నేడు అన్ని రంగాలను శాసిస్తున్నట్లే, క్వాంటం టెక్నాలజీ కూడా భవిష్యత్తులో అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయ ఐటీ నిపుణులు సైతం ఇప్పుడు అమరావతి వైపు ఆసక్తిగా చూస్తున్నారనీ, నూతన ఆవిష్కరణలకు ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తామని, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో పనిచేయాలనుకునే యువతకు, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో ఎర్ర తివాచీ పరుస్తామని చెప్పారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులు ఇప్పటికే అమరావతి వైపు వస్తున్నాయని, ఇది రాబోయే కాలంలో రాష్ట ఆర్థిక వ్యవస్థకు బ్యాక్ బోన్ కానుందన్నారు. సాంకేతిక రంగంతో పాటు వ్యవసాయం, తాగునీటి రక్షణకు సంబంధించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. దేశంలో ఇప్పటికే విద్యుత్ గ్రిడ్ ఏ విధంగా అమల్లో ఉందో, అదే రీతిలో దేశవ్యాప్తంగా వాటర్ గ్రిడ్ ఏర్పాటు కీలకమన్న చంద్రబాబు నాయుడు, దేశంలోని ఐదు ప్రధాన నదులను అనుసంధానించడం ద్వారా ఏ రాష్ట్రానికీ తాగు, సాగునీటి కొరత లేకుండా చూసే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రతిపాదనను ఇప్పటికే దేశ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. దేశ ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్న ప్రస్తుత నాయకత్వం కింద, ఇలాంటి గ్రిడ్ ఏర్పాటు జరిగితే రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు శాశ్వతంగా తొలగిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్‌ నగరంలో తాము చేపట్టిన దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే, నేడు ఆ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరుగా మారిందని గుర్తు చేసిన చంద్రబాబు.. భవిష్యత్తులో అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుగులేని ఆర్థిక శక్తిగా మారుతుందని చెప్పారు. నిర్దేశిత గడువు ప్రకారం 2028 నాటికల్లా రాజధాని తొలి దశ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. [Amaravati Development, Cyberabad Plus, AP Chief Minister Chandrababu Naidu, Quantum Computer, Swarna Andhra Vision, Andhra Pradesh Capital, Telugu One]

Published on: Mon Oct 5, 2026 2:50PM

political-news-img

రాయలసీమ ఇక రతనాల సీమ: రూ.30,156 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులకు శ్రీకారం.!

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక అడుగులు వేస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ 2.0 కింద 'అమరజీవి జలధార' తాగునీటి పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన రాయలసీమ ప్రాంతాన్ని ఇకపై 'రతనాల సీమ'గా మారుస్తామని గట్టిగా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రూ.30,156 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మహా యజ్ఞానికి రూపకల్పన చేసిందని ఆయన వెల్లడించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు ఇళ్ల వద్దే స్వచ్ఛమైన కుళాయి కనెక్షన్లను అందించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని సీఎం వివరించారు. ప్రజలు తాగునీరు తాగిన ప్రతిసారీ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకోవాలనే సదుద్దేశంతోనే ఈ ప్రతిష్టాత్మక పథకానికి 'అమరజీవి జలధార' అని నామకరణం చేసినట్లు ఆయన తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో కేవలం తాగునీటి పథకాల పేరుతో రూ.2,600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించిన చంద్రబాబు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ తాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ భారీ నిధులను కేటాయించిందని చెప్పారు. మదనపల్లిలో లక్ష కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు ఇప్పటికే పునాదులు వేశామని, తద్వారా రాయలసీమ సస్యశ్యామలంగా మారుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. కేవలం తాగునీరు మాత్రమే కాకుండా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంతిల్లు, ప్రతి ఇంటిపై సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజల సాగు, తాగునీటి అవసరాలను పూర్తిగా తీరుస్తామని, పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేసి గోదావరి పుష్కరాల నాటికి జాతికి అంకితం చేస్తామని పునరుద్ఘాటించారు. రాయలసీమ అభివృద్ధికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. [ Jal Jeevan Mission, CM Chandrababu, Rayalaseema, Amarajeevi Jaladhara, Drinking Water Scheme, Proddatur, Jal Jeevan Mission 2.0, Amarajeevi Jaladhara, AP drinking water project, Telugu One, Telugu News ]

Published on: Mon Oct 5, 2026 2:42PM