భారత్ సమ్మిట్‌తో తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి చాటుతాం: సీఎం రేవంత్ రెడ్డి
Published on: Fri Nov 13, 2026 6:40PM
.webp)
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నవంబర్ 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌కు 70 దేశాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఈ సదస్సుకు ఆహ్వానించామని, హైదరాబాద్ నగరాన్ని ప్రత్యక్షంగా సందర్శించి రాష్ట్ర పారిశ్రామిక విధానాలను తెలుసుకునే అవకాశం కల్పించడమే సమ్మిట్ ఉద్దేశమని వెల్లడించారు.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీలో కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించామని, త్వరలో ముంబై, అహ్మదాబాద్‌లోనూ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించి 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
తెలంగాణ ప్రజలకు మేలు చేసే ప్రతి నిర్ణయాన్నీ బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, తుమ్మిడిహట్టి ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే వైఖరి ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు. వారు వ్యతిరేకిస్తున్నది కాంగ్రెస్ పార్టీని కాదని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి, రాంచందర్ రావు, కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని సీఎం వెల్లడించారు. గిగ్ వర్కర్ల చట్టాన్ని రేపటి నుంచి అమలు చేయబోతున్నామని, రాహుల్ గాంధీ చేతుల మీదుగా గిగ్ వర్కర్ల పాలసీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. భారత్ సమ్మిట్ ముగింపు సందేశం ఇచ్చేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వస్తున్నారని చెప్పారు.

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై బీజేపీ చేస్తున్న విమర్శలను రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లి ప్రసంగాలు చేసినప్పుడు స్వాగతించే బీజేపీ.. రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తే ఎందుకు విమర్శిస్తోందని ప్రశ్నించారు. ఢిల్లీలో గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి పీయూష్ గోయల్ హాజరైతే స్వాగతించారని, మరి భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ వస్తే అభ్యంతరాలెందుకని నిలదీశారు.
బీజేపీ వైఖరి నియంతృత్వ ధోరణికి నిదర్శనమని సీఎం విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అందరి అభిప్రాయాలకూ ప్రాధాన్యత ఉంటుందని, ప్రపంచ శాంతి కోసం చర్చలు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారత్ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతి అతిథి తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ బీజేపీని ఓడించి దేశానికి ప్రధాని అవుతారనే భయంతోనే ఆ పార్టీ నేతలు ఆయన పర్యటనను వ్యతిరేకిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించాలని, తమ రాజకీయాలను తెలంగాణ ప్రజలపై రుద్దవద్దని హితవు పలికారు. తెలంగాణపై విషం చిమ్మడం మానుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
మీకు నచ్చవచ్చు: ఒక్క నగ్న ఫొటో కోసం దేశ భద్రతను తాకట్టు పెట్టిన ఐఏఎఫ్ అధికారి.!
మీకు నచ్చవచ్చు: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది దుర్మరణం.!
[ Telangana Global Summit 2026, CM Revanth Reddy, Invest Telangana, Telangana Investments, Rahul Gandhi, BJP, BRS, Kishan Reddy, KTR, Gig Workers Policy, Gig Workers Act ]


