TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆధునిక యుగంలో ఆధ్యాత్మికత.. ఒత్తిడి లేని జీవితానికి మార్గం..!

Published on: Fri Aug 28, 2026 8:01PM


నేటి వేగవంతమైన ప్రపంచంలో పరిగెత్తే జీవితం, ఉద్యోగ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్లు, సామాజిక మానసిక ఆందోళనలు మనిషిని నిరంతరం ప్రశాంతతకు దూరం చేస్తున్నాయి. సాంకేతికత పెరిగి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, అంతరంగంలో శాంతి లోపించడం నేటి తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. ఎంత సంపాదించినా ప్రశాంతత లేక ఎంతోమంది ఏదో వెలితితో.. ఇంకా ఏదో దక్కలేదు అనే గందరగోళంలో బ్రతుకుతున్నారు.  ఈ పరిస్థితుల్లో ఆధ్యాత్మికత అనేది ఒక మతం లేదా పూజ పునస్కారాలకే పరిమితం కాకుండా, ఒత్తిడి లేని సమతుల్య జీవితాన్ని గడపడానికి ఒక గొప్ప మార్గదర్శిగా నిలుస్తోంది.

 ఆధ్యాత్మికత అంటే..

ఆధ్యాత్మికత అంటే కేవలం సంప్రదాయాలను అనుసరించడం మాత్రమే కాదు. అది మనల్ని మనకు పరిచయం చేసే ఒక అంతర ప్రయాణం. మన ఆలోచనలను, భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకుని, వాటిపై నియంత్రణ సాధించడమే ఆధ్యాత్మికత యొక్క నిజమైన అంతరార్థం. ఇది మనిషికి మానసిక స్థైర్యాన్ని, సంతోషాన్ని ప్రసాదిస్తుంది.
ఆధునిక జీవితంలో ఆధ్యాత్మికతను భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
 
  ధ్యానం , సృహతో కూడిన జీవనం..

దీనినే నేటికాలంలో మైండ్‌ఫుల్‌నెస్ అంటున్నారు. దీని ద్వారా మనస్సును వర్తమానంలో ఉంచడం సాధ్యమవుతుంది. భవిష్యత్తు గురించిన భయాలు, గతం గురించిన బాధల నుంచి మనస్సును విముక్తి చేసి, ప్రస్తుతం జీవిస్తున్న క్షణాన్ని ప్రశాంతంగా అనుభవించేందుకు ఇది సహాయపడుతుంది. నిత్యం కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా, మానసిక అలసట తగ్గుతుంది.

  కృతజ్ఞతా భావం..

 మన వద్ద ఉన్నదానితో సంతృప్తి చెందడం, ప్రకృతికి, మన చుట్టూ ఉన్న ప్రజలకు కృతజ్ఞతగా ఉండటం ఆధ్యాత్మికత నేర్పే ముఖ్యమైన గుణం. ఈ భావన మనుషుల్లో ప్రతికూల ఆలోచనలను, అసూయను తగ్గించి, ఆత్మసంతృప్తిని పెంచుతుంది.

  ప్రతికూల పరిస్థితులను స్వీకరించడం..

జీవితంలో ఎదురయ్యే గెలుపోటములను, కష్టసుఖాలను సమానంగా స్వీకరించే సమతా స్థితి ఆధ్యాత్మిక సాధన ద్వారా లభిస్తుంది. దీనివల్ల ఎలాంటి క్లిష్టమైన సమయంలోనైనా నిలకడగా నిర్ణయాలు తీసుకునే మానసిక పరిపక్వత లభిస్తుంది.

  అనుబంధాలను బలోపేతం చేస్తుంది..

 ప్రేమ, దయ, కరుణ, క్షమాగుణం వంటి సద్గుణాలు ఆధ్యాత్మిక జీవనశైలి ద్వారా పెంపొందుతాయి. ఇతరుల పట్ల సానుభూతితో ఉండటం వల్ల అనవసరమైన వివాదాలు, కోపతాపాలు తగ్గి సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి.

ఆధునిక యుగంలో ఆధ్యాత్మికత అనేది ఛాయిస్ గా తీసుకోవాల్సింది కాదు.. అదొక అవసరం. ప్రతిరోజూ మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకుని, ధ్యానం, యోగా లేదా ప్రకృతితో గడపడం వంటి చిన్న చిన్న అలవాట్లతో ఆధ్యాత్మిక మార్గంలో పయనించవచ్చు. ఇది మన బాహ్య ప్రపంచపు ఒత్తిళ్లను తట్టుకుని, అంతరంగంలో ఎల్లప్పుడూ ప్రశాంతతను నింపుకోవడానికి ఒక సురక్షితమైన మార్గంగా నిలుస్తుంది.

                        *రూపశ్రీ.