TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్నేహితులను అయినా లైఫ్ పార్టనర్ ను ఈ ప్రశ్నలు అడగకండి..రిలేషన్ నాశనం అవుతుంది..!

Published on: Fri Aug 28, 2026 8:17PM

స్నేహితులతో లేదా జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉండాలంటే నమ్మకం, పరస్పర గౌరవం చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు మనం అడిగే కొన్ని ప్రశ్నలు ఎదుటివారి మనసును గాయపరచడమే కాకుండా, కాలక్రమేణా ఆ రిలేషన్‌ను పూర్తిగా నాశనం చేసే ప్రమాదం ఉంది. బంధాలు నిలబడాలన్నా, స్నేహం కొనసాగాలన్నా ఎలాంటి ప్రశ్నలకు దూరంగా ఉండాలో తెలుసుకోవడం చాలా మంచిది. అవేంటో తెలుసుకుంటే..

  గతం..

గతానికి సంబంధించిన వ్యక్తిగత ప్రశ్నలు మనుషులను చాలా డిస్టర్బ్ చేస్తాయి. "నీకుగతంలో ఎంతమందితో సంబంధాలు ఉన్నాయి?", "నాకంటే వాళ్లే ఎక్కువ నచ్చారా?" వంటి ప్రశ్నలు స్నేహితుల మధ్య లేదా భాగస్వాముల మధ్య అనవసరమైన అనుమానాలను, అభద్రతా భావాన్ని పెంచుతాయి. గతంలో జరిగిన విషయాలను పదే పదే తోడటం వల్ల ప్రస్తుత బంధంలో ప్రశాంతత కొల్పోవలసి వస్తుంది.

 ఆర్థిక విషయాలు , వ్యక్తిగత సంపాదన..

"నువ్వు ఎంత సంపాదిస్తున్నావ్?", "అంత డబ్బు ఏం చేస్తున్నావ్?", "నాకంటే నీ స్నేహితులకు/కుటుంబానికే ఎక్కువ ఖర్చు పెడుతున్నావా?" ఇలాంటి ఆర్గ్యూ లు చాలా మంది దగ్గర వింటూ ఉంటాం. కానీ ఇలాంటి ప్రశ్నలతో  నిలదీయడం వల్ల ఎదుటివారు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతారు. డబ్బు విషయాల్లో అతిగా ప్రశ్నించడం వల్ల బంధంలో స్వార్థం లేదా అసూయ ఉందనే భావన కలుగుతుంది.

  పోల్చడం..

"మిగతా వారి భాగస్వాములను చూసి నేర్చుకోలేవా?", "నీకంటే నా వేరే ఫ్రెండ్ నన్ను బాగా అర్థం చేసుకుంటాడు తెలుసా?" లాంటి మాటలు అనడం వల్ల ఎదుటివారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇటువంటి మాటలు వారిలోని ప్రాధాన్యతను తగ్గించేలా చేసి, దూరానికి కారణమవుతాయి.

  నమ్మకాన్ని పరీక్షించే ప్రశ్నలు..

"నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా?", "నాతోనే ఉన్నావని గ్యారెంటీ ఏమిటి?", "ఆ సమయంలో ఎవరితో మాట్లాడావ్?" అంటూ ప్రతిదానికీ ఆధారాలు అడగడం వల్ల బంధంలో ఉండే స్వేచ్ఛ నశిస్తుంది. అనుమానంతో కూడిన ప్రశ్నలు ఉన్న చోట ఏ రిలేషన్ ఎక్కువ కాలం నిలబడలేదు.

  కుటుంబం లేదా స్నేహితుల గురించి తక్కువ చేసి మాట్లాడటం ..

"నీకు నేనుముఖ్యమా, నీ కుటుంబం ముఖ్యమా?" లేదా "ఆ స్నేహితుడితో నీకేంటి పని?" వంటి మాటలతో ఒత్తిడి చేయడం వల్ల తీవ్రమైన విభేదాలు వస్తాయి. ఎవరి స్థానం వారిదే అని గుర్తించకుండా ఇటువంటి పోటీ వాతావరణాన్ని సృష్టించే ప్రశ్నలు అడగకపోవడమే మంచిది.

బంధాల్లో అనుమానాలు, పోలికలు, అభద్రతా భావాన్ని పెంచే ప్రశ్నలను పక్కన పెట్టి, పరస్పర గౌరవంతో సాగినప్పుడే ఏ రిలేషన్ అయినా కలకాలం నిలుస్తుంది. మాట్లాడే ప్రతి మాట, అడిగే ప్రతి ప్రశ్న బంధాన్ని బలపరిచేలా ఉండాలి తప్ప బలహీన పరిచేలా ఉండకూడదు.


                         *రూపశ్రీ.