మీ దగ్గర డబ్బు నిలవడం లేదా..అసలు కారణాలు ఇవే..!
Published on: Wed Nov 11, 2026 7:24AM
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా..అసలు కారణాలు ఇవే..!
.webp)
మనం ఎంతో కష్టపడి సంపాదిస్తాం, కానీ ఆ సంపాదన మన జేబులో ఎంతకాలం నిలుస్తుంది? ఒక్క క్షణం ఆగి నిజాయితీగా ఆలోచిస్తే ఎవరికైనా ఇదొక పెద్ద ప్రశ్నగానే కనిపిస్తుంది. చాలా మంది డబ్బు సంపాదించడం బాగానే నేర్చుకుంటారు, కానీ దాన్ని తమ దగ్గర ఎలా నిలబెట్టుకోవాలో, ఎలా కాపాడుకోవాలో మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేరు. ఈ ఆర్థిక సమస్య ఈనాటిది కాదు. సుమారు రెండు వేలకు పైగా సంవత్సరాల క్రితమే ఆచార్య చాణక్యుడు దీనికి సంబంధించిన కొన్ని స్పష్టమైన , అద్భుతమైన నియమాలను మనకు అందించాడు. ఒక సాధారణ గురువుగా ఉండి ఒక గొప్ప సామ్రాజ్యాన్నే నిలబెట్టిన ఆయన దగ్గర కనీసం బంగారు ఆభరణం కూడా ఉండేది కాదు. కానీ ఆయన చెప్పిన ఆర్థిక సూత్రాలు మాత్రం నేటికీ మన జీవితాలకు ఎంతో సహాయపడతాయి. చాణక్యుడు చెప్పిన ఆ మూడు ముఖ్యమైన నియమాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే..
ఎమర్జెన్సీ ఫండ్..
ఆపద సమయంలో వాడుకోవడానికి ఎప్పుడూ కొంత మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలని చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు. ఒకసారి యుద్ధం ముగిసిన తర్వాత చంద్రగుప్తుడి ఖజానా నిండిపోయింది. మంత్రులందరూ ఉత్సాహంగా వచ్చి విజయానికి ప్రతీకగా భారీ ఉత్సవాలు చేద్దామని, ప్రజలు సంతోషిస్తారని కోరారు. కానీ చాణక్యుడు ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడు. ఈ ధనం కేవలం ఉత్సవాల కోసం కాదని, భవిష్యత్తులో కరువు లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఉపయోగపడుతుందని హితవు పలికాడు.
నిజంగానే మూడేళ్ల తర్వాత ఆ ప్రాంతంలో పెద్ద కరువు వచ్చింది. చుట్టుపక్కల రాజ్యాలన్నీ ఆర్థికంగా కుప్పకూలిపోయినా, మగధ సామ్రాజ్యం మాత్రం చెక్కుచెదరక నిలబడింది. మన జీవితంలో కూడా కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బును ఎప్పుడూ అత్యవసర నిధిగా పక్కన పెట్టుకోవాలి. ఆ డబ్బును కేవలం సాధారణ పొదుపుగా కాకుండా, కష్టకాలంలో మనల్ని కాపాడే ఒక కవచంగా భావించాలి. అన్నింటికంటే మన ఆరోగ్యమే మన మొదటి ఆస్తి, దాన్ని కాపాడుకోవడం కూడా ఈ పొదుపులో భాగమే.
.webp)
సంపాదించిన ధనాన్ని సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడం..
సంపాదించిన ప్రతి నాణెం దాచుకుంటూ పోతే సరిపోదు, దాన్ని సరైన చోట పెట్టుబడిగా పెట్టాలి. పాటలీపుత్రంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను సంపాదించిన ప్రతి పైసాని నేలలో పాతిపెట్టేవాడు, ఎవరికీ ఇచ్చేవాడు కాదు, వ్యాపారంలోనూ పెట్టేవాడు కాదు. ఒకసారి చాణక్యుడు ఆ ఊరి చెరువు దగ్గరకు వెళ్లాడు. అక్కడ కాలువ మూసుకుపోయి చెరువు నీరు పూర్తిగా మురిగిపోయి ఉంది. నీరు ఎప్పుడూ కదులుతూ ఉండాలి, లేకపోతే అది చెరువులా ఉండకుండా కేవలం బురదగా మారుతుంది.
ఇది కూడా చదవండి ఆఫీస్ కొలీగ్స్ తో స్నేహం చేస్తున్నారా.. జాగ్రత్త ఈ తప్పులు మాత్రం చేయకండి..!
డబ్బు విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. కేవలం ఎవరికీ ఇవ్వకుండా ఒకేచోట దాచిన డబ్బు ఎవరినీ కాపాడదు. మన సంపాదనలో కొంత భాగం ఎప్పుడూ ఏదో ఒక రూపంలో పని చేస్తూ ఉండాలి. ముఖ్యంగా మన చదువు మీద, నైపుణ్యాల మీద, ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు ఎప్పుడూ వృధా కాదు. అది భవిష్యత్తులో మనకు రెట్టింపు సంపాదనను తెచ్చిపెట్టే సరైన మార్గం అవుతుంది.
అదృష్టాన్ని నమ్ముకుని కూర్చోకుండా నిరంతరం ప్రయత్నించడం..
కేవలం అదృష్టం గురించినే ఆలోచిస్తూ మన ప్రయత్నాన్ని ఎప్పుడూ వదిలేయకూడదు. ప్రయత్నం చేయకుండా నువ్వుల్లో నుంచి నూనె రాదు. ఒక యువకుడు చాణక్యుడి దగ్గరకు వచ్చి తన అదృష్టం బాగోలేదని, ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదని వాపోయాడు. అప్పుడు చాణక్యుడు మౌనంగా ఒక పిడికెడు నువ్వులు తీసుకుని అతని చేతిలో పెట్టాడు. ఇందులో నూనె ఉందా అని అడిగాడు. ఉంది గురువుగారు అని ఆ యువకుడు సమాధానం ఇచ్చాడు. అయితే దాని నుంచి నూనె తీయి అని చాణక్యుడు సూచించాడు. ఆ యువకుడు ఎంత గట్టిగా నొక్కినా ఒక్క చుక్క నూనె కూడా బయటకు రాలేదు. అప్పుడు చాణక్యుడు నూనె లోపలే ఉంది, కానీ గానుగ తిరగనిదే అది బయటకు రాదని వివరించాడు.
మన దగ్గర కూడా ప్రతిభ ఉంటుంది, కానీ కష్టపడి ప్రయాసపడితేనే ఫలితం బయటకు వస్తుంది. కేవలం అదృష్టం కలిసి వస్తుందని ఎదురుచూడటం మానేయాలి. ప్రతిరోజూ కొంత సమయాన్ని మన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కేటాయించాలి. మొదటిసారికే ఫలితం రాకపోవచ్చు, గానుగ మొదటి తిప్పుకు నూనె ఇవ్వదు. ఎక్కడా ఆగకుండా నిరంతరం శ్రమించేవాడికే కాలం సరైన సమాధానం ఇస్తుంది.
డబ్బును కేవలం సంపాదించేవాడు దాన్ని ఏదో ఒక రోజు సులభంగా కోల్పోతాడు. కానీ దాని అసలు విలువను తెలుసుకుని, దాన్ని సరిగ్గా కాపాడటం , సరైన చోట వినియోగించడం నేర్చుకున్నవాడు తన తర్వాతి తరానికి కూడా ఆ సంపదను సక్సెస్ గా అందిస్తాడు. అత్యవసరాల కోసం దాచుకోవడం, సంపదను సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడం, ఏ క్షణంలోనూ ప్రయత్నం ఆపకపోవడం అనే ఈ మూడే మన ఆర్థిక జీవితాన్ని నిలబెట్టే నిజమైన సూత్రాలు.
*రూపశ్రీ.
మీకు నచ్చవచ్చు బలమైన భార్యాభర్తల బంధానికి, డబ్బుకు ఉన్న లింకు ఇదే..
కుటుంబంలో వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుకోవడం ఎలా.!
Money Comes In But Never Stays,Discover the Real Reasons,Why Does Money Never Stay in Your Hands,Here Are the Real Reasons


