స్తంభించిన మైక్రోసాఫ్ట్ సేవలు: ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు గగ్గోలు.!
Published on: Fri Nov 13, 2026 8:04AM
.webp)
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ అందిస్తున్న సేవలు ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయాయి. దీంతో లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా కార్పొరేట్, వ్యక్తిగత కార్యకలాపాలలో అత్యంత కీలకంగా మారిన ఈమెయిల్ వ్యవస్థ, ఆఫీస్ కమ్యూనికేషన్ యాప్స్ అకస్మాత్తుగా పనిచేయకపోవడం టెక్ ప్రపంచంలో కలకలం రేపింది. సాంకేతికంగా తలెత్తిన ఇబ్బంది కారణంగానే సేవలు నిలిచిపోయినట్లు మైక్రోసాఫ్ట్ అధికారికంగా థృవీకరించింది. వినియోగదారులకు ఎదురైన ఇబ్బందులకు చింతిస్తున్నట్లు పేర్కొంది.
ఈ గ్లోబల్ ఔటేజ్ సమయంలో మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ సర్వీస్ ఔట్‌లుక్, అలాగే ఆఫీస్ వర్క్‌ప్లేస్ మెసేజింగ్ అప్లికేషన్ టీమ్స్ సేవలు నిలిచిపోయాయి. గంటల తరబడి ఈ సేవలు నిలిచిపోయాయి. యూజర్ల ఇన్‌బాక్స్‌లు లోడ్ కాకపోవడంతో సమాచార మార్పిడి స్తంభించింది.
ఆన్‌లైన్ సేవలను ట్రాక్ చేసే సంస్థల నివేదికల ప్రకారం, వేలాది మంది ఒక్కసారిగా కనెక్టివిటీ సమస్యలు ఎదుర్కొన్నారు. ఈమెయిల్స్ మాత్రమే కాకుండా, మైక్రోసాఫ్ట్ 365 సూట్‌లోని ఇతర ప్రధాన సేవలతో పాటు ఏఐ అసిస్టెంట్ కో-పైలట్ వినియోగంలోనూ అంతరాయం ఏర్పడింది.
.webp)
ఈ వైఫల్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక కార్పొరేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఐటీ రంగ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. కార్యాలయాల్లో రోజువారీ విధులు నిర్వహించే ఉద్యోగులు కమ్యూనికేషన్ సాధనాలు అందుబాటులో ఇక్కట్లు పడ్డారు. అమెరికా తదితర దేశాల్లో ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్ మెయిల్‌బాక్స్‌లను యాక్సెస్ చేయడానికి యూజర్లు సమస్యలు ఎదుర్కొన్నారు.
ఇది కూడా చదవండి: మైక్రోసాఫ్ట్‌లో భారీ సంచలనం: కీలక ఈవిపి అకస్మాత్తుగా రాజీనామా!
పరిస్థితి తీవ్రతను గమనించిన మైక్రోసాఫ్ట్ యాజమాన్యం వెంటనే స్పందించి సాంకేతిక లోపాలను సరిదిద్దే పనిలో పడింది. తమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోని సర్వర్ల నిర్వహణ, ఆటోమేటెడ్ తనిఖీల సమయంలో తలెత్తిన వైఫల్యాల వల్లే ఈ సమస్య తలెత్తిందని ప్రాథమికంగా నిర్ధారించింది. సర్వర్లపై అసాధారణమైన లోడ్ పడటం వల్ల కొన్ని విభాగాలు మొరాయించినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది.

సమస్య తీవ్రతను తగ్గించేందుకు సంస్థ ఇంజనీరింగ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఉత్తర అమెరికా వంటి ప్రాంతాలలో టీమ్స్ సేవలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురాగలిగామనీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో యూజర్లు ఇంకా కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారనీ మైక్రోసాఫ్ట్ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి గ్లోబల్ స్థాయి సర్వర్ వైఫల్యాలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చింది.
మీకు నచ్చవచ్చు: వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్: ఉద్యోగుల తొలగింపునకు మైక్రో సాఫ్ట్ సరికొత్త వ్యూహం.!
తెలంగాణలో మైక్రోసాఫ్ట్ డేటాసెంటర్.. ఏపీకి అథోగతే..నా? చంద్రబాబు ఉండి ఉంటేనా..
[Microsoftoutage, Services Down, Outlook, Teams, Technews, Teluguone]


