TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పశ్చిమ బెంగాల్ లో ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు: సాయుధ పోరాటానికి కాలం చెల్లిందని వ్యాఖ్య.!

Published on: Thu Sep 24, 2026 1:42PM

వామపక్ష తీవ్రవాద సంస్థ, నిషేధిత సీపీఐ(మావోయిస్టు) పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ముగ్గురు సీనియర్  మావోయిస్టు నాయకులు లొంగిపోయారు. పశ్చిమ బెంగాల్‌లోని బాంకురా జిల్లాలో  సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన  ముగ్గురు సీనియర్ కమాండర్లు హింసా మార్గాన్ని వీడుతున్నట్లు ప్రకటించి, పోలీసుల ఎదుట   లొంగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వపు లొంగుబాటు,  పునరావాస విధానం పట్ల ఆకర్షితులై   జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బాంకురా పోలీస్ లైన్స్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ లొంగుబాటు మావోయిస్టు పార్టీకీ, మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురు దెబ్బగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

 డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్   ఆనంద్ కుమార్ సమక్షంలో  జబా మహాతో అలియాస్ బులు అలియాస్  గోరి, నయనతార సాహు (అలియాస్ మిత అలియాస్  జుమా, రామ్‌ప్రసాద్ మండి అలియాస్ మహాదేవ్ అలియాస్  సచిన్ ఆయుధాలు అప్పగించి సరెండర్ అయ్యారు.   వీరిలో జబా మహాతో, నయనతార సాహు మావోయిస్ట్ సంస్థలో జోనల్ కమిటీ సభ్యులు కాగా, రామ్‌ప్రసాద్ మండి రీజనల్ కమిటీ సభ్యుడిగా ఇంత వరకూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని జార్గ్రామ్, బాంకురా, పురూలియా, పశ్చిమ మేదినీపూర్ జిల్లాలు సహా  పొరుగున ఉన్న జార్ఖండ్ లోని తూర్పు సింగ్‌భూమ్ ప్రాంతంలో ఈ ముగ్గురూ దశాబ్దాలుగా మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తూ..  పోలీసుల  మోస్ట్ వాంటెడ్‌ జాబితాలో ఉన్నారు.

వీరిపై బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో హత్య, పేలుడు పదార్థాల చట్టం,  ఉపా  చట్టాల కింద 80కి పైగా కేసులు  ఉన్నాయి.   వీరు సరెండ్ అవుతూ..   తమ వద్ద ఉన్న   ఆయుధాలను అప్పగించారు.  ఏకే-47 రైఫిల్, రెండు ఇన్సాస్  రైఫిల్స్‌తో పాటు 10 మ్యాగజైన్లు, 154 తూటాలను పోలీసులకు సరెండర్ చేశారు. వీరి లొంగుబాటు మావోయిస్ట్ నెట్‌వర్క్‌ను దెబ్బతీయడంలో కీలక పరిణామమని పోలీసులు చెప్పారు.  

లొంగుబాటు అనంతరం మావోయిస్ట్ నేత రామ్‌ప్రసాద్ మండి మీడియాతో మాట్లాడుతూ, తాము ఏ సిద్ధాంతం కోసం అయితే ఆయుధాలు పట్టామో,   ఆ ఆశయాలు ప్రస్తత పరిస్థితుల్లో కాలం చెల్లినవిగా మారాయన్నారు.   ప్రజల కోసం హింసా మార్గంలో పోరాడాల్సిన అవసరం ఇప్పుడు లేదన్నారు.  ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తోందన్నారు.  

[Maoists surrender,  West Bengal, Bankura police, CPI Maoist leaders, Junglemahal Naxals news, Telugu One]