ఏపీకి కియా భారీ పెట్టుబడులు.. పెనుకొండలో మరో ప్లాంట్.!
Published on: Thu Nov 12, 2026 6:52PM

రూ.19 వేల కోట్లతో రెండో యూనిట్ ఏర్పాటు.. 12 వేల మందికి ఉద్యోగాలు.!
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ రాష్ట్రంలో భారీ విస్తరణకు ముందుకొచ్చింది. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా ఏపీ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

పెనుకొండలో మరో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రూ.19 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కియా ఇండియా ఎండీ, సీఈఓ గ్వాంగ్ లీ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి, కియా ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు.
12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు.!
ఈ కొత్త పెట్టుబడితో రాష్ట్రంలో మరో 12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని ఎర్రమంచిలో ఉన్న కియా ప్లాంట్ ద్వారా ఏడాదికి 4.3 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం అదనంగా మరో 2 లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నారు.
ఇది కూడా చదవండి: అయ్యప్ప కటాక్షం వల్లే మాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.. శేఖర్ మాస్టర్ భావోద్వేగం.!
దీంతో ఏపీలో కియా మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 6.3 లక్షల కార్లకు చేరనుంది. ప్రస్తుతం ఏపీలో తయారవుతున్న కియా కార్లను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కొత్త పెట్టుబడితో రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగం మరింత విస్తరించనుంది. అనుబంధ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది.
కియా పెట్టుబడులపై చంద్రబాబు ఏమన్నారంటే.!
కియా సంస్థ రాష్ట్రంలో మరో రూ.19 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పెనుకొండలో కియా ప్లాంట్ ఏర్పాటు చేయడం వెనుక ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయని గుర్తు చేశారు.కియా సంస్థను ఏపీకి తీసుకురావడానికి అప్పట్లో విస్తృతంగా ప్రయత్నాలు చేశామని సీఎం గుర్తుచేశారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీటి సౌకర్యం కల్పించడంతో పాటు జాతీయ రహదారి, బెంగళూరు విమానాశ్రయానికి కనెక్టివిటీ కల్పించామని సీఎం తెలిపారు.

స్వయంగా దక్షిణ కొరియాకు వెళ్లి కియా యాజమాన్యాన్ని ఏపీలో పెట్టుబడులకు ఒప్పించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేవలం 14 నెలల్లోనే కియా ప్లాంట్ నిర్మాణం పూర్తి చేశారు. ఏపీలో తయారైన తొలి కియా కారును నేనే ప్రారంభించాని పేర్కొన్నారు. ఇప్పుడు మేడ్ ఇన్ ఏపీ కియా కార్లు 100కు పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఏపీపై నమ్మకంతో మరో రూ.19 వేల కోట్ల పెట్టుబడికి ముందుకు వచ్చిన కియా యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.
పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం పారిశ్రామికవేత్తలు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇకపై ఎస్క్రో ఖాతాల ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించాం.పెట్టుబడులకు రక్షణ కల్పించేందుకు ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకువస్తున్నాం. ఏపీ పారిశ్రామిక రంగానికి దక్షిణ కొరియా కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలి.
.webp)
విదేశీ పెట్టుబడులకు ఏపీ నమ్మకమైన భాగస్వామిగా ఉంది. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చాయి. సామాజిక బాధ్యతలో భాగంగా కియా పీ4 కార్యక్రమానికి కూడా సహకరించాలి. నైపుణ్యం కలిగిన యువత ఏపీలో ఉన్నారు. వారికి అవకాశాలు కల్పిస్తే పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతుందని చంద్రబాబు తెలిపారు
2029 మే నాటికి ప్లాంట్ పూర్తి చేయాలి.!
కొత్త ప్లాంట్ నిర్మాణ పనులను వేగవంతం చేసి 2029 మే నాటికే పూర్తి చేయాలని కియా యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ పెట్టుబడితో ఏపీ ఆటోమొబైల్ రంగానికి మరింత ఊతం లభించడంతో పాటు రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
మీకు నచ్చవచ్చు: మహిళల రాజకీయ, ఆర్థిక భాగస్వామ్యం మరింత పెరగాలి: సీఎం చంద్రబాబు
మీకు నచ్చవచ్చు: CII Summit: మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం.!
[ Kias huge investments in AP, Kia plant in Penukonda, CM Chandrababu, CII Summit, Kia CEO Kwang Lee]


