భార్యాభర్తల మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందా..ఈ విషయాలు నిర్లక్ష్యం చేయకండి..!
Published on: Thu Oct 22, 2026 11:12AM
భార్యాభర్తల మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందా..ఈ విషయాలు నిర్లక్ష్యం చేయకండి..!

భార్యాభర్తల మధ్య బంధం కేవలం ఒకరికొకరు తోడుగా ఉండటం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య ఉండే భావోద్వేగాల అనుబంధం కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు దంపతులు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ, వారి మధ్య మానసిక దూరం పెరుగుతూ వస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో లేదా మనసులోని భావాలను పంచుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో భాగస్వామి మనల్ని పట్టించుకోవడం లేదనే భావన కలగడం సహజం. బంధంలో ఇలాంటి ఎమోషనల్ గ్యాప్ రావడం వల్ల ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే..
వివాహం తర్వాత పెరిగే దూరం..
పెళ్లయిన కొత్తలో ఉన్న ఆప్యాయత, సంభాషణలు కాలక్రమేణా మరుగున పడిపోవడం చాలా జంటల్లో కనిపిస్తుంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం, మానసిక ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల ఒకరికొకరు సమయం కేటాయించడం తగ్గిపోతుంది. అయితే, ఈ దూరం చిన్న చిన్న విషయాల నుంచి ప్రారంభమై పెద్ద సమస్యగా మారుతుంది. భాగస్వామి ప్రవర్తనలో వచ్చే మార్పులను సరిగ్గా గమనించకపోతే, అది మానసికంగా ఇద్దరినీ ఒంటరి చేసేస్తుంది. కాబట్టి సంబంధంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందో లేదో తెలుసుకోవడానికి కొన్ని కీలకమైన లక్షణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం.
రెస్పాండ్ కాకపోవడం..
మీరు చెప్పే విషయాలను లేదా మీ సమస్యలను భాగస్వామి గమనించకపోవడం లేదా వాటికి సరైన స్పందన ఇవ్వకపోవడం చాలా స్పష్టమైన సంకేతం. రోజులో జరిగిన విషయాలు లేదా మనసులోని ఆందోళనలను పంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వారు ఫోన్ చూస్తూ ఉండటం లేదా మీ మాటలను మధ్యలోనే ఆపేయడం చేస్తుంటే అక్కడ ఎమోషనల్ బాండింగ్ సన్నగిల్లుతోందని అర్థం చేసుకోవాలి. కేవలం వినడం మాత్రమే కాకుండా, మీ మాటలకు విలువ ఇవ్వకపోవడం వల్ల అభద్రతాభావం పెరుగుతుంది.
నిర్లక్ష్యం..
మీ ఫీలింగ్స్ లేదా మీ ఆవేదనను తేలికగా తీసుకోవడం లేదా చిన్నచూపు చూడటం కూడా ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందని చెప్పడానికి ఒక సంకేతం. మీకు ఏదైనా విషయంలో బాధ కలిగినప్పుడు, భాగస్వామి మిమ్మల్ని ఓదార్చాల్సింది పోయి మీరు అతిగా ఆలోచిస్తున్నారని అనడం లేదా చిన్న విషయాలకే పెద్దవి చేస్తున్నారని అనడం సరికాదు. మీ ఫీలింగ్స్ కు గౌరవం ఇవ్వకపోవడం వల్ల మీ మనసులోని మాటలను ఎవరితో పంచుకోవాలో తెలియని అయోమయం ఏర్పడుతుంది. ఇలాంటి ప్రవర్తన ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ ను మరింత పెంచుతుంది.
షేర్ చేసుకోకపోవడం..
భాగస్వామి తమ వ్యక్తిగత విషయాలు లేదా మనసులోని ఆలోచనలను మీతో పంచుకోవడం మానేయడం కూడా ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోంది అనడానికి సంకేతం. గతంలో ప్రతి చిన్న విషయాన్ని మీతో చెప్పే వారు, ఇప్పుడు తమ ప్లానింగ్స్, ఇబ్బందులు లేదా అనుభవాలను పూర్తిగా దాచడం ఒకవేళ అడిగినా కూడా ఏదో ఒక సాకు చెప్పి దాటవేయడం చేస్తుంటే అక్కడ దూరం పెరుగుతోందని గ్రహించాలి. ఎమోషన్స్ ను లేదా మనసులోని విషయాలను ఒకరికొకరు షేర్ చేసుకోలేని చోట బంధం కేవలం పేరుకే మిగులుతుంది.
బంధం కోసం ప్రయత్నం..
బంధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎప్పుడూ ఒక వైపు నుంచే జరగడం అనేది కూడా భార్యాభర్తల మధ్య ఎమోషనల్ దూరం పెరుగుతోంది అనడానికి సంకేతం. మాట్లాడటం మొదలుపెట్టడం, కలిసి సమయం గడపడానికి ప్లాన్ చేయడం లేదా మనస్పర్ధలను సరిదిద్దడానికి ప్రయత్నించడం వంటి బాధ్యతలన్నీ ఒక్కరి మీదే పడటం గమనించవచ్చు. భాగస్వామి తరపు నుంచి ఎలాంటి చొరవ లేకపోవడం వల్ల ఆ బంధం ఒకే వైపు నుంచి నడుస్తున్న అనుభూతి కలుగుతుంది.
ఒంటరితనం..
భాగస్వామి పక్కనే ఉన్నప్పటికీ తీవ్రమైన ఒంటరితనం అనుభవించడం. ఇద్దరూ ఒకే గదిలో ఉన్నా, ఒకరినొకరు పలకరించుకోకుండా ఎవరి ప్రపంచంలో వారు ఉండటం భావోద్వేగ శూన్యతను సూచిస్తుంది. మీ మనసులోని సంతోషాన్ని లేదా బాధను పంచుకునే ముందు అవతల వ్యక్తి వింటారో లేదో అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే, ఆ బంధంలో మార్పు అవసరమని అర్థం.
పరిష్కారం ఎలా?
ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కంటే ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. వారి ప్రవర్తన వల్ల మీకు కలుగుతున్న భావోద్వేగాలను నిరాశకు గురి కాకుండా, స్పష్టంగా వివరించాలి. అవతలి వ్యక్తి ఏవైనా ఇతర ఒత్తిళ్లలో ఉన్నారేమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇద్దరూ కలిసి కూర్చుని మనసు విప్పి మాట్లాడితే చాలా వరకు ఈ దూరాన్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ పరిస్థితి అలాగే కొనసాగితే, నిపుణుల సహాయం తీసుకోవడం, కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది.
*రూపశ్రీ.


