TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

Hyderabad: స్వీట్లలో పురుగులు.. బూజు.. ఎలుకల విసర్జితాలు..స్వీట్ షాపుల్లో దారుణాలు.!

Published on: Fri Oct 23, 2026 8:42PM

7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!

మూడు దుకాణాల లైసెన్సులు సస్పెండ్.!

పండగల సీజన్‌లో స్వీట్ల తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్న వేళ.. హైదరాబాద్‌లోని పలు ప్రముఖ స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. స్వీట్ల తయారీలో పరిశుభ్రత పాటించకపోవడం, నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేయడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయానికి ఉంచడం వంటి ఉల్లంఘనలు తనిఖీల్లో వెలుగుచూశాయి. తెలంగాణ ఫుడ్ అండ్ ఎస్సెన్షియల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అథారిటీ (TG SAFE) ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 11 ప్రత్యేక బృందాలు నగరంలోని కోవా, స్వీట్ల తయారీ కేంద్రాలు, రిటైల్ దుకాణాలు కలిపి మొత్తం 21 చోట్ల తనిఖీలు నిర్వహించాయి.

ఈ తనిఖీల్లో పలు దుకాణాల్లో అపరిశుభ్ర వాతావరణం, ఆహార పదార్థాల్లో పురుగులు, ఫంగస్, ఎలుకల విసర్జినాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు చేపట్టిన అధికారులు.. కల్తీ అనుమానంతో 21 ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. మరోవైపు మొత్తం రూ.7,75,850 విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజారోగ్యానికి ముప్పు కలిగించేలా వ్యవహరించిన మూడు దుకాణాల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్సులను సస్పెండ్ చేయగా.. లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న తార్నాకలోని సుదర్శన్ రెడ్డి ప్యూర్ ఘీ స్వీట్స్ దుకాణాన్ని మూసివేయించారు. పరిశుభ్రతకు పాతర.. స్వీట్ల తయారీలో నిర్లక్ష్యం అధికారుల తనిఖీల్లో పలు దుకాణాల్లో దారుణమైన పరిస్థితులు బయటపడ్డాయి. దెబ్బతిన్న ఫ్లోరింగ్, పేరుకుపోయిన ఆహార వ్యర్థాలు, మురికిగా ఉన్న వాషింగ్ ప్రాంతాలు, వ్యర్థాలతో మూసుకుపోయిన డ్రైనేజీ కాలువలు కనిపించాయి. గోడలపై మురికి, ఈగలు, బొద్దింకలు, ఎలుకల సంచారం ఉన్నట్లు గుర్తించారు. 

కొన్ని చోట్ల ఆహార పదార్థాల్లో పురుగులు, ఫంగస్‌తో పాటు ఎలుకల విసర్జితాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.స్వీట్లను పరిశుభ్రమైన పరిస్థితుల్లో తయారు చేయాల్సి ఉండగా.. కొందరు వ్యాపారులు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని తనిఖీల్లో తేలింది. సిబ్బంది హెయిర్ నెట్లు, గ్లౌజులు ధరించకపోవడం, పెరిగిన గోళ్లతోనే ఆహార పదార్థాలను తయారు చేయడం, స్వీట్లపై మురికి వస్త్రాలు, వార్తాపత్రికలు కప్పి ఉంచడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు. నాన్‌-ఫుడ్‌ గ్రేడ్ రోజ్ వాటర్ వినియోగం, గడువు ముగిసిన పదార్థాలు, లేబుళ్లు లేని ఆహార ఉత్పత్తుల నిల్వ కూడా అధికారుల దృష్టికి వచ్చింది. పెస్ట్ కంట్రోల్, సిబ్బంది వైద్య పరీక్షలకు సంబంధించిన రికార్డులు సైతం కొన్ని దుకాణాల్లో అందుబాటులో లేవని గుర్తించారు.

మూడు ప్రముఖ దుకాణాల లైసెన్సులు సస్పెండ్.!


కూకట్‌పల్లిలోని ప్రశాంత్ నగర్‌లో ఉన్న వాసిరెడ్డి స్వగృహ ఫుడ్స్‌లో అపరిశుభ్ర వాతావరణం, బూజు, జిడ్డు పేరుకుపోయిన ఎగ్జాస్ట్‌లు, పచ్చళ్లలో ఫంగస్, బొద్దింకలు, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతలో లోపాలను అధికారులు గుర్తించారు. దీంతో ఆ దుకాణం లైసెన్సును సస్పెండ్ చేశారు.అలాగే మాసబ్ ట్యాంక్‌లోని హుమాయున్ నగర్‌లో ఉన్న మధుర్ స్వీట్స్‌లో స్వీట్లను వార్తాపత్రికలతో కప్పి ఉంచడం, బొద్దింకలు సంచరించడం, గడువు ముగిసిన ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను విక్రయానికి ఉంచడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. ఇక్కడ రూ.5,63,000 విలువైన 705 కిలోల ఆహార పదార్థాలను సీజ్ చేసి, లైసెన్సును సస్పెండ్ చేశారు.అదే విధంగా చందానగర్‌లోని బి. బిచ్చారెడ్డి స్వీట్స్‌లో గోడలపై నాచు, ఎలుకల విసర్జితాలు, తుప్పు పట్టిన సామగ్రి, లేబుళ్లు లేని నెయ్యి ఉన్నట్లు గుర్తించారు. దీంతో రూ.2,12,850 విలువైన 330 కిలోల నెయ్యిని స్వాధీనం చేసుకుని, ఆ దుకాణం లైసెన్సును సస్పెండ్ చేశారు.

లైసెన్స్ లేకుండా నడుస్తున్న దుకాణం మూసివేత.!


తార్నాకలోని సుదర్శన్ రెడ్డి ప్యూర్ ఘీ స్వీట్స్ దుకాణం సరైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండానే నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అపరిశుభ్ర పరిస్థితులతో పాటు గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఉండటంతో దుకాణాన్ని మూసివేయాలని ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనలపై వివరణ కోరుతూ  గుండ్ల పోచంపల్లి పరిధిలోని హనీ ఫుడ్స్, శ్రీనగర్ కాలనీలోని హర్ష ఎంటర్‌ప్రైజెస్‌/స్వీట్ బాస్కెట్ , కూకట్పల్లి పరిధిలోని ఆల్మండ్ హౌస్ , దాదూస్ మిఠాయి వాటిక , నల్లకుంట పరిధిలోని రాజీవ్ రెడ్డి స్వీట్స్ , యూసఫ్ గూడా లోని పరుచూరి ఫుడ్స్ , తార్నాక లోని సుదర్శన్ రెడ్డి ప్యూర్ ఘీ స్వీట్స్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 

మరోవైపు బంజారాహిల్స్ పరిధిలోని మీఠే మియా, టోలిచౌకి లోని మెజెస్టిక్ స్వీట్స్ , జీడిమెట్ల లోని శివ నాగిరెడ్డి స్వీట్స్ , వెంగళరావు నగర్ లోని గోదావరి వంటిల్లు , ఇంద్ర పార్క్ వద్ద ఉన్న శుభం హోమ్ ఫుడ్స్ , ప్రమదాస్ స్వీట్స్ అండ్ హాట్స్ లకు మెరుగుదల చర్యలు చేపట్టాలని ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు ఇచ్చారు. మొత్తంగా పండగల వేళ ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. స్వీట్ల తయారీ, నిల్వ, విక్రయాల్లో పరిశుభ్రతతో పాటు ఆహార భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే దుకాణాలపై తనిఖీలు కొనసాగుతాయని హెచ్చరించారు.

 

 

[ Hyderabad Sweet Shops Raids, Food Safety Department, TG SAFE, FSSAI, Food Safety Inspections, Hyderabad News, Adulterated Sweets, Food Adulteration, Expired Food Products, Food Hygiene, Sweet Shops License Suspended, 1035 Kg Food Seized, Food Safety Violations, Vassireddy Swagruha Foods, Madhur Sweets, B Bichareddy Sweets, Sudarshan Reddy Pure Ghee Sweets, Food Safety Alert, Festival Season Food Safety ]