TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. ఆ పోరాటం మరువలేనిది: కేటీఆర్

Published on: Sun Nov 29, 2026 2:54PM

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ రాజకీయాలనే కదిలించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. దీక్షా దివస్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్న ఆయన.. 2009 నాటి ఉద్యమ పోరాట స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు.

2009 నవంబర్ 29న 'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో' అనే నినాదంతో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపుగా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి కేసీఆర్ సాగించిన పోరాటం అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించిందని తెలిపారు.

కేసీఆర్ చేపట్టిన దీక్ష ఫలితంగానే డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందని, అనంతరం సుదీర్ఘ ఉద్యమ పోరాటం ఫలించి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తుచేశారు. నవంబర్ 29 నాటి చారిత్రక ఘట్టం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే.. దీక్షా దివస్ సందర్భంగా కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. 2009లో కేసీఆర్ నిరాహార దీక్షకు బయలుదేరిన సమయంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న ప్రాంతం కావడంతో ఈ వేదికకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించనున్న ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి ఉద్యమకారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.

ఇది కూడా చదవండి: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత.!

మరోవైపు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కూడా దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ పోరాటాన్ని స్మరించుకున్నారు. కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చరిత్ర గతిని మార్చిందని, తెలంగాణ ప్రజల తరతరాల ఆకాంక్షను నెరవేర్చిందని పేర్కొన్నారు. కేసీఆర్ దీక్షాబలం, అమరవీరుల త్యాగఫలమే నేటి తెలంగాణ రాష్ట్రం అని సోషల్ మీడియా వేదికగా సందేశం ఇచ్చారు.

అలుగునూరు సభ ద్వారా తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పార్టీ శ్రేణుల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సభా వేదికగా కేటీఆర్ చేసే రాజకీయ వ్యాఖ్యలు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన ఇచ్చే సంకేతాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మీకు నచ్చవచ్చు: మాజీ డిప్యూటీ మేయర్ హత్యకు భారీ కుట్ర.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు.!

మీకు నచ్చవచ్చు:  హైదరాబాద్‌లో ర్యాపిడో డ్రైవర్‌పై దారుణ దాడి.. తీవ్ర గాయాలు.! 

 

[ Deeksha Diwas, KCR, KTR, Telangana Movement, BRS, Harish Rao, Alugunur Public Meeting,KCR Hunger Strike, Telangana State Formation, Alugunur Meeting, BRS Public Meeting ]