TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ మళ్లీ సీఎం కాలేరా? విశ్లేషకులు చెబుతున్నదేంటి?

Published on: Mon Aug 31, 2026 4:39PM

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయ్యింది. మరో మూడేళ్లలో మళ్లీ ఎన్నికలు రానున్నాయి. అయితే ముందస్తుగానే రాష్ట్రంలో రాజకీయ వేడి పీక్స్ కు చేరింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా అన్న రేంజ్ లో  పొలిటికల్ హీట్ ఉంది. రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.  

తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై  వైసీపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. అయితే.. అదే సమయంలో  వైసీపీ ఈ రెండేళ్లలో ఇసుమంతైనా పుంజుకోలేదన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాని, ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించడంపై జన సామాన్యంలో కూడా అసంతృప్తి వెల్లువెత్తుదోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ సీఎంను అవుతానంటూ ధీమాగా ప్రకటనలు గుప్పిస్తున్న జగన్ పొలిటికల్ ఫ్యూచర్ పై రాజకీయ పండితులు, పరిశీలకులు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు.  ప్రస్తుత పాలనలోని కొన్ని అంశాలను తటస్థ వేదికలపై విమర్శించే విశ్లేషకులు సైతం..  రాబోయే ఎన్నికలలో వైపీపీ విజయం సాధించి అధికారంలోకి రావడం సాధ్యమేనా అంటే ఔనని చెప్పలేమంటున్నారు.   వైసీపీకి ఏ మాత్రం సానుకూల పరిస్థితి లేదని, వైసీపీ పుంజుకుని జగన్ మళ్లీ సీఎం అవ్వడం సులువు కాదని ఎలాంటి శషబిషలూ లేకుండా చెబుతున్నారు. 

సాధారణంగా  పబ్లిక్ ఒపీనియన్ ను ప్రభావితం చేయడంలో పొలిటికల్ అనలిస్టుల పాత్ర కీలకంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా తటస్థ అనలిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా చూసినా తటస్థ విశ్లేషకులు సైతం వైసీపీ తీరుపై పెదవి విరుస్తున్నారు. వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ ఆ పార్టీ చేసుకున్న సెల్ఫ్ గోల్ గా అభివర్ణిస్తున్నారు.   ప్రభుత్వ వైఫల్యాలు లేదా లోపాలను ఎత్తిచూపుతూనే విశ్లేషకులు  వైఎస్సార్సీపీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. 

గతంలో  అంటే 2014 నుండి 2019 మధ్యకాలంలో   తెలుగుదేశం   అధికారంలో ఉన్న సమయాన్ని గుర్తుచేసుకుంటే, నాటి రాజకీయ వాతావరణం వైసీపీకి   సానుకూలంగా ఉండేది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న  వైసీపీ . ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయడం, బలమైన మీడియా మద్దతు లభించడం మరియు అప్పటి జాతీయ సమీకరణాలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారాయి. ఆ కాలంలో ప్రతిపక్షంలో ఉన్న తీవ్రమైన దూకుడు, ప్రభుత్వ నిర్ణయాలను నిలదీసే నైతిక బలం జగన్ వైపు స్పష్టంగా కనిపించాయి.

అంతేకాకుండా, 2014-2019 మధ్యకాలంలో నాటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మేధావులు, రిటైర్డ్ అధికారులు, తటస్థ విశ్లేషకులు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. ఉదాహరణకు, నాటి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టిన పలువురు ప్రముఖులు, ఐఏఎస్ అధికారులు మరియు ఇతర రంగాల ప్రముఖులు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని బహిరంగంగానే  చెప్పారు.  

అయితే, 2019 నుండి 2024 వరకు సాగిన ఐదేళ్ల  జగన్ పాలన తరువాత   పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆయన అధికారంలో ఉండా తీసుకున్న  వివాదాస్పద నిర్ణయాలు, పాలనా విధానాలు విధానాల కారణంగా ప్రజా వ్యతిరేకత అధికమైంది. అదే 2024 ఎన్నికలలో ప్రభుత్వ పతనానికి కారణమైంది. అన్నిటికీ మించి మూడు రాజధానులు, బాబాయ్ గొడ్డలి పోటు, మద్యం కుంభకోణం వంటి అంశాలు జగన్ క్రెడిబులిటీని కోలుకోలేనంతగా దెబ్బతీశాయి.  

ఆ తరువాత అధికారం కోల్పోయిన తరువాత జగన్ ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితం కావడం, వారానికోసారి చుట్టపు చూపుగా రాష్ట్రానికి వచ్చినా తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశాలతో సరిపెట్టేయడం వంటివి పార్టీ శ్రేణులలో నిరుత్సాహానికి కారణమయ్యాయి. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు నామమాత్రమయ్యాయి.  అన్నిటికీ మించి అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి పుంజుకోవడానికి కావలసిన రాజకీయ వ్యూహాలు, ప్రజా విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నాలు జగన్ నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ జరగలేదు. దీంతో పార్టీ ఇమేజ్ రోజురోజుకూ మసకబారుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విధానాలను విమర్శించే మేధావులు కూడా వైసీపీకి అనుకూలంగా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. 

 

Can Jagan Become CM Again, AP politics, YS Jagan Mohan Reddy, YCPs Future, AP elections, Telugu One