ఆస్తి రాయించుకుని తండ్రినే గెంటేశాడు.. కొడుకుకు షాకిచ్చిన బాంబే హైకోర్టు.!
Published on: Fri Nov 27, 2026 3:49PM

88 ఏళ్ల తండ్రి ఫ్లాట్ గిఫ్ట్ డీడ్ రద్దు.. 15 రోజుల్లో ఖాళీ చేయాలని కోర్టు ఆదేశం.!
88 ఏళ్ల వృద్ధ తండ్రి నివాస హక్కును పరిరక్షిస్తూ బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కొడుకు పేరుపై రిజిస్టర్ చేసిన ఫ్లాట్ గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేస్తూ, 15 రోజుల్లోగా ఆ ఇంటిని ఖాళీ చేసి తండ్రికి అప్పగించాలని ఆదేశించింది. నిర్ణీత గడువులోగా ఖాళీ చేయకపోతే పోలీసుల సాయంతో ఖాళీ చేయించాలని స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని మలాడ్ ప్రాంతంలో దేవ్చంద్ కోర్షి దేధియా 1999లో తన భార్య మంజులాతో కలిసి ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు. 2015లో భార్య మరణించిన తర్వాత పెద్ద కుమారుడు శిబన్, కోడలు రీటా తనను చిన్న కుమారుడితో కలిసి ఉండాలని సూచించారని దేవ్చంద్ తెలిపారు. వ్యాపార అవసరాల పేరుతో పవర్ ఆఫ్ అటార్నీపై సంతకం తీసుకుని, తెలియకుండానే ఫ్లాట్ వాటాలను కొడుకు పేరుపై బదిలీ చేశారని ఆరోపించారు.
2018 జూన్‌లో తన జీవితాంతం ఆ ఫ్లాట్‌లో నివసించే హక్కు ఉంటుందనే షరతుతో కొడుకుకు గిఫ్ట్ డీడ్ రాసిచ్చారు. తన దైనందిన అవసరాలు, సంరక్షణ కొడుకు, కోడలు చూసుకుంటారని ఆశించారు. కానీ ఆ తర్వాత తనను వేధించారని, కోవిడ్ సమయంలోనూ ఫ్లాట్‌లోకి అనుమతించలేదని, ఫలితంగా వృద్ధాశ్రమంలో ఉండాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ నెలకు రూ.10 వేల భరణం, గోడౌన్ అప్పగింతకు ఆదేశించినా గిఫ్ట్ డీడ్ రద్దుకు నిరాకరించింది. డిప్యూటీ కలెక్టర్ కూడా అదే నిర్ణయాన్ని సమర్థించడంతో బాధిత తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్తి సాతే, గిఫ్ట్ డీడ్‌లోని నివాస హక్కు షరతును కొడుకు, కోడలు ఉల్లంఘించారని పేర్కొన్నారు.
ఇది కూడ చదవండి: వంద రోజుల విరామానికి తెర.. నవంబర్ 30 నుంచి పార్లమెంట్ భేటీ.!
తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం–2007లోని సెక్షన్ 23 ప్రకారం, ఆస్తి బదిలీ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆ బదిలీని రద్దు చేసే అధికారం ఉంటుందని కోర్టు గుర్తుచేసింది. భరణంలో ఆహారం, దుస్తులతో పాటు గౌరవప్రదమైన నివాసం, వైద్యం కూడా భాగమేనని స్పష్టం చేసింది.
ఆస్తి బదిలీ జరిగినంత మాత్రాన తల్లిదండ్రుల పట్ల బాధ్యతల నుంచి పిల్లలు తప్పించుకోలేరని ఈ తీర్పు మరోసారి చాటిచెప్పింది. కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాల మధ్య ఇబ్బంది పడుతున్న వృద్ధ తల్లిదండ్రులకు ఈ నిర్ణయం న్యాయపరమైన భరోసానిస్తుందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు 15 రోజుల్లోగా ఫ్లాట్ అప్పగింత ప్రక్రియ ఎలా సాగుతుందో చూడాలి. అలాగే వృద్ధుల సంక్షేమ చట్టం అమలుపై క్షేత్రస్థాయి అధికారులకు ఇది మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: కరెంట్ షాక్‌తో స్తంభంపైనే వేలాడిన లైన్‌మన్.. సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడిన వ్యక్తి.!
మీకు నచ్చవచ్చు: Karthigai Deepam: రేపు దీపం వెలిగించాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.!
[ Bombay High Court, Gift Deed Cancellation, Senior Citizens Act, Mumbai Malad Flat, Elderly Fathers Right to Residence ]


