APPSC: 84 రోజుల పాటు రిసార్ట్‌లో గ్రూప్-1 పత్రాలు..ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు.!
Published on: Thu Nov 5, 2026 7:40PM

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, గుంటూరులోని మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన తనిఖీలు పూర్తయ్యాయి. అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి, ఐపీఎస్ అధికారి పి. సీతారామాంజనేయులు నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 17 కింద హైదరాబాద్ జోనల్ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.
84 రోజుల పాటు రిసార్ట్‌లోనే జవాబు పత్రాలు.!
ఈ కేసులో గుంటూరు జిల్లా చినకాకానిలోని హాయ్‌లాండ్ రిసార్ట్ వ్యవహారం కీలకంగా మారింది. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకన బాధ్యతను కామ్‌సైన్ మీడియా అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా జవాబు పత్రాలను రిసార్ట్‌కు తరలించి, 2021 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఏకంగా 84 రోజుల పాటు అక్కడే ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైన అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
మూల్యాంకనం చేయకుండానే రూ.1.14 కోట్లు.?
ఈడీ ప్రాథమిక విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవంగా మూల్యాంకనం చేయకుండానే పాత మార్కులను కొత్త మార్కులుగా నమోదు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, అప్పటి కార్యదర్శి సంతకంతో కామ్‌సైన్ సంస్థకు రూ.1.14 కోట్ల ప్రజాధనం చెల్లించిన వ్యవహారంపై అధికారులు దృష్టి సారించారు. ఆ తర్వాత ఆ మూల్యాంకనాన్ని రద్దు చేసి, సీసీటీవీ నిఘాలో మరోసారి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించినట్లు సమాచారం.
ఏడు చోట్ల సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం.!
కామ్‌సైన్ మీడియా ఎండీ మధుసూదన్ రావుకు సంబంధించిన ప్రదేశాలు, హాయ్‌లాండ్ రిసార్ట్, ట్రూగ్రేడర్ సర్వీసెస్ కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. రూ.1.14 కోట్ల చెల్లింపులను నేరం ద్వారా సంపాదించిన సొమ్ము (Proceeds of Crime) కోణంలో పరిశీలిస్తోంది. సీతారామాంజనేయులుతో పాటు పలువురి వాంగ్మూలాలను నమోదు చేసిన అధికారులు, సంబంధిత ఆస్తుల పత్రాలనూ పరిశీలిస్తున్నారు.

మొత్తంగా 84 రోజుల పాటు రిసార్ట్‌లో జవాబు పత్రాలను ఉంచడం వెనుక అసలు కారణమేంటి? మూల్యాంకనం చేయకుండానే రూ.1.14 కోట్లు ఎలా చెల్లించారు? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? అనే ప్రశ్నలకు ఈడీ దర్యాప్తులో సమాధానాలు లభించాల్సి ఉంది. ఈ సోదాలతో గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: మయోనైజ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఏడాది పాటు బ్యాన్.!
[ APPSC Group-1 Scam, ED Investigation, Group-1 Evaluation Scam, Resort Controversy, 84 Days Resort Stay, APPSC Papers, Enforcement Directorate, Evaluation Irregularities, Andhra Pradesh Politics, Group-1 Case ]


