మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది: సీఎం చంద్రబాబు
Published on: Mon Nov 9, 2026 2:35PM
.webp)
రెబల్స్‌ను పార్టీలో చేర్చుకోము..సీఎం కీలక వ్యాఖ్యలు.!
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు అఖండ విజయాన్ని అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2024 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు మరింతగా ప్రజల ఆదరణ లభించిందని, వైసీపీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని పేర్కొన్నారు. రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన ఆమోదమే ఈ ఎన్నికల ఫలితాలని వెల్లడించారు.
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 100 మేయర్, చైర్‌పర్సన్ పదవులకు గాను 94 స్థానాలను కూటమి కైవసం చేసుకుందని తెలిపారు. 13 మేయర్ పదవుల్లో 12, 87 చైర్‌పర్సన్ పదవుల్లో 82 స్థానాలను గెలుచుకున్నామని చెప్పారు. ఇందులో తెలుగుదేశం పార్టీ 70, జనసేన 20, బీజేపీ నాలుగు పదవులను సాధించాయని వివరించారు.
వార్డుల్లోనూ కూటమి హవా.!
మొత్తం 3,941 వార్డులకు గాను 3,233 వార్డుల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారని చంద్రబాబు తెలిపారు. అంటే మొత్తం వార్డుల్లో 82 శాతం కూటమి ఖాతాలో చేరాయని వెల్లడించారు. 100 పట్టణ స్థానిక సంస్థల్లో 95 చోట్ల కౌన్సిల్‌లో కూటమికి మెజారిటీ లభించిందన్నారు. 16 పట్టణ స్థానిక సంస్థల్లో అన్ని వార్డులనూ కూటమి గెలుచుకుందని పేర్కొన్నారు.
విశాఖపట్నంలో 2,47,817, విజయవాడలో 1,30,872, గుంటూరులో 96,294 ఓట్ల మెజారిటీతో కూటమి అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు. అనంతపురంలో మేయర్ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ, కార్పొరేటర్లలో ఎక్కువ మంది కూటమి తరఫున ఎన్నికయ్యారని వివరించారు.
వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.!
మరోవైపు, వైసీపీ 100 మేయర్, చైర్‌పర్సన్ స్థానాల్లో కేవలం నాలుగింటికే పరిమితమైందని చంద్రబాబు అన్నారు. 13 మేయర్ పదవుల్లో ఒక్కటి మాత్రమే గెలుచుకుందని, 3,941 వార్డులకు గాను 558 వార్డులనే సాధించిందని తెలిపారు. అంటే కేవలం 14.2 శాతం వార్డులకే వైసీపీ పరిమితమైందన్నారు. 22 పట్టణ స్థానిక సంస్థల్లో వైసీపీ ఒక్క వార్డునూ గెలుచుకోలేకపోయిందని పేర్కొన్నారు.
పులివెందులలో కూటమి 13,875 ఓట్ల మెజారిటీతో చైర్‌పర్సన్ పదవిని కైవసం చేసుకుందని, మొత్తం 40 వార్డులకు గాను 37 వార్డులను గెలుచుకుందని వెల్లడించారు. కడప కార్పొరేషన్‌లో 65,588 ఓట్ల మెజారిటీతో కూటమి విజయం సాధించిందని, 66 వార్డులకు గాను 64 వార్డులను గెలుచుకుందని తెలిపారు. కడప జిల్లాలోని తొమ్మిది పట్టణ స్థానిక సంస్థలూ కూటమి ఖాతాలో చేరాయని, 345 వార్డులకు గాను వైసీపీ కేవలం తొమ్మిది వార్డులకే పరిమితమైందని చెప్పారు.
మహిళలకు నాయకత్వంలో పెద్దపీట.!
తెలుగుదేశం పార్టీ నుంచి మేయర్లు, చైర్‌పర్సన్లుగా ఎన్నికైన 70 మందిలో 42 మంది మహిళలేనని చంద్రబాబు తెలిపారు. అంటే 60 శాతం పదవులను మహిళలకు కేటాయించామని వెల్లడించారు. టీడీపీ గెలుచుకున్న పది మేయర్ పదవుల్లో ఎనిమిది స్థానాలను మహిళలే దక్కించుకున్నారని చెప్పారు. విశాఖపట్నం, విజయనగరం, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, కడప, కర్నూలు, చిత్తూరు నగరాలకు మహిళలు నాయకత్వం వహించనున్నారని వివరించారు.
విద్యావంతులకు, యువతకు ప్రాధాన్యం.!
టీడీపీ నుంచి మేయర్లు, చైర్‌పర్సన్లుగా ఎన్నికైన 70 మందిలో 55 మంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగినవారని చంద్రబాబు వెల్లడించారు. వీరిలో 11 మంది పీజీ పూర్తి చేసినవారున్నారని తెలిపారు. ఎన్నికైన వారిలో 31 మంది 45 ఏళ్లలోపు వారేనని, ఎనిమిది మంది 35 ఏళ్లలోపు యువత ఉన్నారని చెప్పారు. టీడీపీ నుంచి ఎన్నికైన పది మంది మేయర్ల సగటు వయసు 39 సంవత్సరాలని వెల్లడించారు.
రాజంపేటలో 26 ఏళ్ల డాక్టర్ దొంతం గాయత్రి, మచిలీపట్నంలో 29 ఏళ్ల షేక్ అబ్దుల్ అబీదా, విజయనగరంలో 31 ఏళ్ల అవనాపు భార్గవి, విశాఖపట్నంలో 32 ఏళ్ల డాక్టర్ ముక్కా శ్రావణి మేయర్లుగా ఎన్నిక కావడం యువతకు ఇచ్చిన ప్రాధాన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఒంగోలులోని 27వ డివిజన్ నుంచి 24 ఏళ్ల చావలి చార్పిత కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారని తెలిపారు.
సామాజిక న్యాయానికి ప్రాధాన్యం.!
సామాజిక న్యాయం కేవలం మాటల్లో కాకుండా నాయకత్వ స్థానాల్లోనూ ప్రతిబింబిస్తోందని చంద్రబాబు అన్నారు. టీడీపీ నుంచి ఎన్నికైన 70 మంది మేయర్లు, చైర్‌పర్సన్లలో 44 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారని తెలిపారు. ఈ వర్గాలకు 62.9 శాతం ప్రాతినిధ్యం కల్పించామని వెల్లడించారు.
వీరిలో బీసీలకు 25, ఎస్సీలకు తొమ్మిది, మైనారిటీలకు తొమ్మిది, ఎస్టీలకు ఒక పదవి దక్కాయని వివరించారు. మొత్తం 27 సామాజిక వర్గాలకు చెందినవారు టీడీపీ నుంచి మేయర్లు, చైర్‌పర్సన్లుగా ఎన్నికయ్యారని తెలిపారు.
పది మంది టీడీపీ మేయర్లలో నలుగురు బీసీలు, నలుగురు ఓసీలు, ఒకరు ఎస్సీ, మరొకరు మైనారిటీ వర్గానికి చెందినవారని చెప్పారు. మేయర్లు, చైర్‌పర్సన్లలో తొమ్మిది మంది ముస్లిం మైనారిటీలు ఉన్నారని, వారిలో ఆరుగురు మహిళలని వెల్లడించారు.
ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు, నిరుపేదలు, రోజువారీ కూలీలు, రాజకీయ నేపథ్యం లేనివారు, సమాజంలో మంచి పేరున్నవారికి కూడా నాయకత్వ అవకాశాలు కల్పించామని చంద్రబాబు తెలిపారు. రాజకీయాల్లో తాము చేసిన ప్రయోగాలు అద్భుత ఫలితాలను ఇచ్చాయని, రాబోయే 30 ఏళ్లకు సరిపోయే నాయకత్వాన్ని ఈ ఎన్నికలు అందించాయని వ్యాఖ్యానించారు.
సుపరిపాలనకు ప్రజల ఆమోదం.!
'గుడ్ గవర్నెన్స్ లీడ్స్ టు గుడ్ పాలిటిక్స్' అన్నది తన నమ్మకమని చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమికి అఖండ విజయాన్ని అందించారని, 2024 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు మరింత ఆదరణ లభించిందని పేర్కొన్నారు. పట్టణ స్థానిక సంస్థలైనా, పరిషత్ ఎన్నికలైనా ప్రజలు కూటమికే మద్దతు పలికారని తెలిపారు.
అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పల్నాడు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో వైసీపీకి ప్రజా మద్దతు లభించలేదని వ్యాఖ్యానించారు. ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్లు.. ఏ విధానంలో ఎన్నికలు జరిగినా ప్రజలు కూటమి అభ్యర్థులకే మద్దతు తెలిపారని అన్నారు.
.webp)
ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించారని తెలిపారు. తుఫాన్ల సమయంలోనూ ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేసిందని, తమ కష్టాన్ని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు.
రెండున్నరేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి, సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన ఆమోదమే ఈ ఫలితాలని చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థులను గెలిపించిన రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: వలసదారుల విషయంలో తప్పు చేశాము..ఓటమిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.!
[ AP Municipal Elections, CM Chandrababu Naidu, TDP, Telugu Desam Party, NDA Alliance, Jana Sena, BJP, YSRCP, Municipal Election Results, Mayoral Elections, Chairperson Posts, Urban Local Bodies, Ward Elections, Pulivendula, Kadapa, Visakhapatnam, Vijayawada, Guntu ]


