శ్రీరామచంద్రుడు విజయలక్ష్మిని వరించెను. విజయ సందేశమును సీతామాతకు అందజేయునదెవరు? అన్న భావము ఉదయించగానే భగవానుడు హనుమంతుని పిలచి “హనుమంతా! సీతకు నీ ఎడల అమితమైన వాత్సల్యమున్నది. ఈ విజయ సమాచారము సీతకు నీవే వినిపింపవలెను. విభీషణరాజువద్ద ఆజ్ఞను తీసుకొని, లంకలో ప్రవేశించి సుగ్రీవ లక్ష్మణసమేతముగా నేను కుశలముగా ఉన్నానని ఆమెతో చెప్పి, రావణ సంహార వృతాంత్తమును కూడా వినిపించుము. సీతకు ఆనందము కలుగు రీతిని భాషింపుము’ అనగా హనుమంతుడు లంకయందు ప్రవేశించెను. లంకావాసులు అతనిని ఘనముగా సన్మానించినారు. విభీషణ ఆదేశానుసారం, అశోక వనములో శింశుపా వృక్షము క్రింద కూర్చొని యున్న సీతామాతను సమీపించి ఆమెకు సాష్టాంగ నమస్కారమొనర్చి యావత్ వృత్తాంతమును నివేవిదించెను. క్షణకాలం సీతామాత ఏమియు మాట్లాడలేకపోయెను. హర్షగద్గదకంటయై కనులనుండి ఆనందబాష్పములు జలజల ప్రవహించుచుండగా – “ నాయనా! అన్యధా భావించకుము. నా జీవితాన ఇంతకన్న ఆనందకర విషయమేముండును? దీనికి ప్రత్యుపకారము నీకేమి చేయవలయునన్న విషయమై యోచించున్నాను. సంతోషకర వార్త నందజేసినవారిని బహూకరించుట లోకమర్యదగదా! కాని, లోకత్రయములో గల సంపద నంతయూ నీకు ఇచ్చిననూ నాకు సంతోషము కలుగదు. నీ హృదయము సదా అనన్య భగవద్భక్తితో నిండియుందుగాక! సద్గుణములు అన్నియు నీ హృదయములో నివాసము ఏర్పరచుకొనుగాక. నాపై రాఘవుల కృపాదృష్టి సర్వదా ప్రసరించుగాక!” అని ఆశీర్వదించినది.
హనుమంతుడు వినయ వినమ్రతాంజలి ఘటించి “మాతా! ఇట్టి వాత్సల్య పూర్ణమైన సంభాషణ నీవు వినా చేయగలవారు ఎవరుగలరు? నా హృదయ మందిరములో సర్వకాల సర్వావస్థలయందు మీ సీతారాముల యుగళమూర్తి భాసించుచుండునుగాక! నేను మీ నీడలో ఆనందించు చుందునుగాక! ఇంతకన్న మీరు నా కీయగలది మాత్రమేమున్నది తల్లీ! నేను మీకెట్టి సేవ చేయవలెనో ఆజ్ఞాపించండి” అనెను. “నాయనా! నేను భగవానుని దర్శించవలెనన్న ఉత్సుకతతో నున్నాను. ఇక క్షణకాల విలంబన కూడా సహించజాలను” అని జానకిమాత పలుకగా, హనుమంతుడు వెంటనే శ్రీరాముని చేరి సీతామాత అభిప్రాయము నీవేదించెను. సీతను తీసుకుని రమ్మని శ్రీరామచంద్రుడు విభీషణుని ఆదేశించెను. |