అతడు హనుమంతు నుద్దేశించి. హనుమా ఈ వీర పురుషు లిర్వురూ ఎవరో తెలిసికొనిరమ్ము .
శత్రు పక్షీయులైనచో ఇచ్చట నుండి పారిపోవలెను. ఉదాసీనులై సహకారాభిలాషతో నున్నచో వారి మైత్రి చేసికొని పరస్పరేష్టసిద్ధులను సాధింపవలెను.నీవు బ్రహ్మచారి వేషములో పోయి వారి జాడలు తెలిసికొనిరమ్ము. వివరములు తెలియగానే సంజ్ఞ చేయుమనగ హనుమంతుడు సుగ్రీవాదేశము శిరోధార్యముగా అట్లే చేసెను.
బ్రహ్మచారి వేషమును ధరించి హనుమంతుడు వారి సమీపమునకు వెళ్ళేను .శిష్టాచార వ్యవహారము పూర్తియైన తరువాత అతడు వారిద్దరినీ ప్రశంసించుచూ వారి పరిచయమును గురించి ప్రశ్నించుచూ “మహాత్ములారా! మీ శరీర సౌష్టవ శస్త్రాదులను చూడ మీరు వీరపుత్రులుగా గోచరిస్తున్నారు .మీ కమలచరణములు మీరు రాజభవన వాసులని తెలియబర్చుచున్నవి.
గతమం దేన్నడు గిరికావనములో నివసి౦పలేదని సువ్యక్తమగుచున్నది.మీ వేషములు తిలకి౦చగా ఋషిపుత్రులుగా గోచరిస్తున్నారు. కాని నిశ్చయాత్మకముగా ఏమియు చెప్పజాలను. మీ వదన మండలముల నుండి బహిర్గతమయ్యే తేజమునవలోకింప మీరు సామాన్యులు కారనియూ, అలౌకికులనియూ సుస్పష్టముగా తెలియుచున్నది. మీరు హరిహర హిరణ్యగర్భులలో ఎవరు? నా మనస్సులో మీరు నరనారాయణులేమోనన్నశంక కలుగుచున్నది. భవదీయ సౌ౦దర్య మాధుర్యములతో నా చిత్తము ముగ్ధమై పోవుచున్నది . మీరు నా కత్యంత మమతాస్పదులుగా గోచరమగుచున్నారు. గతమందు మీతో నున్నట్లు స్పురణకు వచ్చుచున్నది .దయచేసి నా సందేహములను నివారించెదరు గాక!”అనెను.
|