ఆంజనేయుడు శ్రీరామచంద్రునికి నమ్మినబంటు కదా! కనుక రాముని సేవలో తరించాలి అనుకుంటాడు. అలా శ్రీరామునికి, హనుమంతుడే సమస్త ఉపచారాలూచేస్తున్నాడట. మరేవ్వరికీ ఎంతమాత్రమూ అవకాశం ఇవ్వడం లేదు. సేవాకార్యము లన్నియూ అతి జాగ్రత్తగా నిర్వర్తిస్తున్నాడు.
భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు కూడ రామచంద్రునికి సేవ చేయాలని తహతహలాడుచున్నారు. చివరికి వారందరూ కలిసి ఒక ఉపాయ మాలోచించినారు. తదనుసారము రఘునాథునికొక కొత్త దినచర్య ను ఏర్పాటు చేశారు. అందులో, భగవానునికి ఏ సేవను ఎవరు చేయాలి అనే విషయము నిర్ణయము కావాలి. మన మందరము మన కార్యములు, మన సమయములు నిర్ణయించుకోవాలి. మనము హనుమంతునికేమీ అవకాశ మీయకూడదు. ప్రణాళిక ఏకగ్రీవముగా అంగీకరింపబడినది. సీతామాత ద్వారా శ్రీరామచంద్రులకు విషయము సర్వస్వము నివేదింపబడింది.
శ్రీరాముడు మందస్మితము చేసి దానిని హనుమంతునకు చూపి చిరునవ్వు నవ్వుతూ – “ హనుమా! ఈ ప్రణాళిక నీకు సమ్మతమేనా!” అనగా “ ప్రభూ! అందరికీ అంగీకారమై తల్లి ద్వారా ఇది నిర్ణయమైనచో మీరు అవశ్యం అంగీకరించవలసినదే. ఏ సేవయు లేనివాడను నేనొకడినేకదా!” అన్నాడుహనుమంతుడు.
“ఏ పనియూ విడువకుండ ప్రణాళికా సిద్ధపరచినారా? జాగ్రతగా చూడండి”అని భగవానుడు అనగా, ''ఏమియు మరువలేదని'' వారు సమాధనమిచ్చారు. అందరూ హనుమంతుని అభిప్రాయమున కామోదముద్ర వేశారు. శ్రీరాముని ముద్ర కూడ పడినది.
“స్వామీ! ప్రభువులు ఆవులించు సమయమున చిటికెలు వేయడం రాజసంప్రదాయమేకదా! ఆ పని నాకు మిగిలింది” అని ఆంజనేయుడనగా, అందరూ దానిని సామాన్య కార్యముగా భావించారు. అందుకు శ్రీరాముడు కూడా చిరునవ్వుతో అంగీకరించాడు. సేవా సంబంధములో హనుమంతుని సూక్ష్మ జ్ఞాన మెట్టిదో! భరతుడు మాత్రం ఆశ్చర్యచకితుడయ్యాడు.
హనుమంతుని కోరిక నెరవేరింది. అలా ఆంజనేయుడు చిటికెల ఆంజనేయుడు అయ్యాడు. శ్రీరాముడు తింటున్నా, తాగుతున్నా, కూర్చున్నా, పడుకున్నా – సర్వకాల సర్వావస్థల్లో ఆయనతో కూడా హనుమంతుడు ఛాయవలె ఉండసాగాడు. భగవానుడు నిదురించువేళ కూడా కొద్ది దూరములో కూర్చుని, రాముని వదనబింబపు సోయగమును తిలకించసాగాడు. ఇది చూసి, అనేకమంది అనేక విధాలుగా అనుకోసాగారు. కాని, హనుమంతుడు వారితో – “అయ్యా! ప్రభువులకు ఆవులింత ఎప్పుడు వచ్చునో ఎవరు చెప్పగలరు? అందుకే చూస్తూనే ఉన్నాను” అనేవాడు.
హనుమంతుడు శ్రీరామచంద్రునకు నిత్యమూ నీడవలె మసలుచుండుటతో సీతామాత కూడా ప్రభువులకు ఏకాంత సేవలు చేసుకోలేకపోతున్నది.
ఎవరైనా వెళ్ళి, హనుమంతునివలన భగవత్ సేవలోతమకు ఏర్పడుతున్నఆటంకములను తెలియజేసి నప్పటికీ శ్రీరామచంద్రుడు వాటినన్నిటినీ శ్రద్ధగా విని, హాయిగా చిరునవ్వు లొలికించేవాడే తప్పించి, హనుమంతుని మందలించెడి వాడు కాదు.
ఆంజనేయుని భక్తిశ్రద్ధలు చూసి, లక్ష్మణ, శత్రుఘ్నులు భయపడేవారు. చివరికి సీతామాత అడిగిన మీదట, శ్రీరాముడు పూర్వ ప్రణాళికనే అమలులోకి తెచ్చాడు. ఆంజనేయుడు మొదట్లో లాగానే నిరంతరం రామసేవతో పావనమయ్యాడు.