ఇంద్రజిత్తు మహానందముతో హనుమంతుని రాజసభలోకి తీసుకుని వెళ్ళాడు. రాజసభలో అడుగు పెట్టాడో లేదో, హనుమంతుని శరీరమునుండి బ్రహ్మ పాశం విడిపోయింది. రావణుని సభలో లోకపాలురు, దేవతలు, దిక్పాలకులు చేతులు జోడించి నిలబడి ఉండటం రామదూత చూశాడు. సూర్యుని ప్రకాశం తగ్గి, కాంతిహీనంగా ఉన్నాడు. వాయువు మృదువైన వీవెన వీస్తున్నాడు. అగ్నిదేవుడు రావణాసురుడి ఆదేశము కోసం
ప్రతీక్షిస్తున్నాడు. ఎవరికి వారే, రావణుని కనుసన్నల్లో మెలగుతున్నారు. మారుతాత్మజుడు నిస్సందేహముగా ధైర్యముగా నిలిచాడు.
అలా
వినయ రహితంగా నిలబడిన
హనుమంతుని చూసి రావణుడు వికటట్టాహాసము చేసి గద్దించి ఓరి ! నీవు ఎవడవురా? ఎవరి బలముతో ఈ కోలాహాలమును చెలరేగదీసినావు అని ప్రశ్నించాడు.
“రావణా ! సంపూర్ణ ప్రకృతికాశ్రయుడూ, ప్రతిరోమము నందునూ అనంతకోటి బ్రహ్మండములను సృష్టించి - పాలించి - లయము చేయువాడూ, సర్వశక్తిని ప్రసాదించి హరి హర హిరణ్య గర్భులచే కార్యకలాపాదులను ఒనరింపచేయువాడూ, తన కృపాలేశము వలననే ఆదిశేషునిచే భూభారమును వహింపజేయువాడూ, నీ వంటి రాక్షసులను దండించుటకై అవతరించినవాడూ అయిన శ్రీరామచంద్ర భగవానుని దూతనైన నన్నే నీ వేరుగావా ? జనకుని యాగములో నీచే ఈష ణ్మా త్రమైననూ కదల్చబడని శివధనస్సు నవలీలగా భంగముచేసిన శ్రీరామచంద్రునే విస్మరించితివా? ఖర, దూషణ, త్రిశిరులను పదునాల్గువేల సైన్యములతో సహా సంహరించిన వారినే మరచిబోయితివా? నిన్ను తన చంకలో నొక్కి వేధించిన మహాబలశాలి వాలిని ఒకే ఒక్క బాణ ప్రహారములచే నేలపాలు చేసిన రామచంద్రునే నే వెరుగవా ? రావణా ! నీ వాయను మరువగలవు. కాని ఆయన మాత్రము నిన్నెప్పకినీ మరువజాలడు. ఏ మహనీయుడు డింట లేనివేళ కపటవేషదారివై మోసముతో వారి ధర్మపత్నిని నీ వపహరరించి తీసుకొని వచ్చినావో అట్టి రామచంద్ర ప్రభువును విస్మరించిననూ నీవు బ్రతుకజాలవు. నేనా మహిమాన్వితుని దూతను. నన్ను చక్కగా గుర్తుంచుకో. అచిరకాలములోనే ఆ మహాపరాక్రమశాలి నిశితశారాగ్ని జ్వాలలకు నీ లంకయంతయు భస్మీపటలమై పోగలదు. నీ సభాసదుల నామరూపములు కూడ శేషింపవు'' అని హనుమంతుడు మేఘ గంభీర ధ్వనులతో బదులు పలికాడు.
భయరహితమైన ఈ హనుమద్వచోసరళికి రాక్షసలందరూ కంపించపోయారు. వీరత్వముతో రాముని కెదురు నిలిచి పోరజాలమన్న భావము వారికి కలిగింది. దేవతలు మనసారా ఆనందించారు. రావణుడు హముమద్వచనములను ఉపేక్షించాడు. హనుమంతుడు మరల అందుకొని రావణా! ఆకలి వేయగా ఫలములను తింటిని. తద్ద్వారా నావలన అపరాధము జరుగలేదు. చెట్లను విరగగోటుట్ట నా స్వభావమే కదా! నన్ను కొట్టుటకు వచ్చిన దుష్టులనుండి ఆత్మరక్షణేచ్చతో వారిని నేను కూడ కోట్టితిని. అతిక్రమించి నీ కొడుకులే నన్ను బంధింప ప్రయత్నించినారు. కాని నే నతనిని క్షమించుచున్నాను. నీవు నా మాట ఒకటి వినుము. నేను ప్రేమతో, వినయముగా నీకు హితము కలుగ జేసే విషయములను చెప్పు చున్నాను. యావత్ప్ర పంచమునూ మ్రింగివేయు కాలుడు రామచంద్రుని యదీనములో నున్నాడు. అట్టి రామచంద్ర ప్రభువుతో విరోధించి నీ వేమియు చేయజాలవు సరికదా! సురక్షితుడిగా జీవించలేవు. పరమ దయాళువైన రామచంద్ర ప్రభువు సమీపమునకు నీవు జానకీమాతను తీసుకుని వెళ్ళు. ఆ మహామీయుడు శరణాగతుల అపరాధ సర్వస్వమును విస్మరించి క్షమిస్తాడు. వారి శ్రీ చరణములను శరణువేడి ధ్యానించు. నిష్కంటకముగా లంకా రాజ్యమును పాలించి అనుభవించు. ఉత్తమవంశసంజాతుడవు. అతులితై శ్వర్య సంపన్నుడవూ, మహా విధ్వంసుడవూ, అపార బలశాలివీ అయిన నీవు అహంకరించకు. ఇదంతా
మూన్నాళ్ళ
ముచ్చటయే. నేను శపథముచేసి చెప్తున్నాను. రామచంద్రునికివిముఖుడవైనచో నిన్నెవరూ
రక్షించలేరు” అన్నాడు స్థిరంగా. |