అయోధ్యలో భరతుడు శ్రీరామునికోసం ఎంతగా వేదన చెందుతున్నాడో వర్ణింపజాలము. మారుతి అతని స్థితి నంతనూ చూచెను. భరతుడు జటాజూటముతో కుశాసనాసీనుడై యుండెను. అతని శరీరము శుష్కించి పోయినది. కనులనుండి అశ్రువులు ప్రవహించుచున్నవి. అతని నోటినుండి నిరంతరాయమానముగా రామనామము ఉచ్చరింపబడు చున్నది. తన సమీపమునకు ఎవరు వస్తున్నది, ఎవరు పోతున్నది, ఏమి జరుగుచున్నదీ తెలియనంతటి తన్మయత్వములో ఉన్నాడు. మారుతి అతని ధ్యానమును భంగపరచుచూ “భరతా! ఎవరి విరహముతో నీవు దుఃఖిస్తున్నావో, ఆ రామచంద్రభగవానుడు జానకీ మాతతో లక్ష్మణ సుగ్రీవ విభీషణాదులతో కుశలముగా వచ్చుచున్నాడు” అని చెప్పాడు. అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగజేసే మధురమైన మారుతి పలుకులు ఆలకించి భరతుడు అమందానంద భరితుడై, వెంటనే లేచి నిలిచి హనుమంతుని గాఢంగా ఆలింగనము చేసుకున్నాడు. మాటిమాటికి రామచంద్రుల విషయమై ప్రశ్నించెను. హనుమంతుడు ప్రసన్న చేతస్కుడై అన్ని విషయములనూ వినిపించెను. అప్పుడు వాళ్లిద్దరూ అనంత ఆనందం పొందారు.
“సోదరా! ఇంతటి మహానందప్రదమైన సంతోషకర సమాచారమును వినిపించిన నీకు ఈయదగిన వస్తువు ఏమున్నది? నీకు ఋణపడి యుండుటలోనే నాకు ఆనందమున్నది” అని భరతుడు చెప్పగా, హనుమంతుడు అతని పాదములపై బడి, అతని ప్రేమను అనేక విధములుగా మెచ్చుకుని - “భరతా! రామచంద్రుడు నిరంతరం నిన్నే తల్చుకునేవాడు. ప్రశంసించేవాడు. నీ సద్గుణములను వర్ణించు చుండెడివాడు. నీ నామమునే జపించుచుండెడివాడు” అని పలికి, భరతుడి అనుమతిపై అక్కడినుండి వెళ్ళిపోయాడు. |