జానకీదేవి ఇచ్చిన మాలను మారుతి ప్రేమగా స్వీకరించాడు. కానీ, వెంటనే హనుమంతుడు ఆ హారములోని ఒక్కొక్క మణినీ పంటితో కొరుకుతూ, అతి జాగ్రత్తగా వాటిని పరీక్షిస్తూ విసిరి పారేస్తున్నాడు. అందరూ ఆశ్చర్యంగా అతనివైపు చూస్తుండగా ఆ పని చాలాసేపు నిరాటంకముగా జరిగింది. అది చూసి శ్రీరామచంద్రుడు మందస్మితము చేయుచుండెను. సీతాదేవి ముఖంలో గాంభీర్యం గోచరించింది. భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు కుతూహలంగా చూస్తున్నారు. కానీ, సభాసదులు ఉండబట్టలేక ఆంజనేయా! ఏం చేస్తున్నావు? బహుమూల్యమైన మణులను నేలపాలు చేయకు” అన్నారు. అందులో ఒకరు బిగ్గరగా ఆ! వానరలక్షణాలు ఎక్కడికి పోతాయి? మణుల విలువ వీనికేం తెలుసు?”అన్నారు.
అనేకులు కుపితులగుట. హేళనచేయుట చూసి హనుమంత సోదరులారా! మీ రెందుకు కోపగించుకుంటున్నారో తెలియుటలేదు. నేనీ మణులను పరీక్షిస్తున్నాను. వీటిలో మహత్తర ప్రకాశమున్నది. ఇవి అత్యధిక మూల్యము చెల్లిస్తే కానీ దొరకవు. వీటిని ధరించడంవల్ల సౌందర్యం అధికమౌతుంది. అయితే, గొప్ప సంగతులు ఇవేనా? కాదు. ఏ వస్తువునందు భగవద్దర్శనము కలుగుతుందో అదియే మహత్త్వ పూర్ణమైన వస్తువు. ఈ మణుల యందు భగవద్దర్శనము కలుగునో, లేదోనని పరీక్షిస్తున్నాను. నాకు ఇందులో భగవద్దర్శనం కాలేదు. వీటి ప్రకాశము నాకు అంధకార బంధురముగా కనిపించింది. ఇట్టి వీటితో నాకేమి ప్రయోజనం? ఇవన్నీ కూడా ఏదో ఒకనాడు బద్దలు కావలసినవి కనుకనే నేను వీటిని బద్దలుచేసి పారవేస్తున్నాను” అన్నాడు.
ఆ సమాధానంతో అనేకులకు అతని ఆలోచన అర్థమైంది. కానీ, ఇంకనూ కొందరు సందేహముతో వేదన పడుతున్నారు. వారు లేచి అయితే నీ హృదయంలో శ్రీరాముడున్నాడా! ఉంటే చూపించుఅన్నారు.
“నిశ్చయంగా నా హృదయంలో భగవానుడు ఉన్నాడు. మీరు ప్రత్యక్షంగా ఎలా చూస్తున్నారో అలాగే నా హృదయములో సర్వదా విరాజిల్లు తున్నాడు” అంటూ, హనుమంతుడు తన విశాల వక్షస్థలము చీల్చి సీతా లక్ష్మణభరతశత్రఘ్నులతో శ్రీరామచంద్ర భగవానుడు తన హృదయసింహాసనముపై విరాజిల్లుచుండుటను చూపించాడు. దానితో అందరికందరూ హనుమంతుని మహిమను గానము చేయసాగారు.
అప్పుడు శ్రీరాముడు సింహాసనం నుండి లేచి హనుమంతుని ఆలింగనము చేసుకున్నాడు. ఆ స్పర్శతో హనుమంతుని వక్షస్థలము ఇతోధిక దృఢత్వముమును సంతరించుకుంది. శ్రీరాముడు హనుమంతునికి బహుమానం ఎందుకు ఇవ్వలేదో ఇప్పడు అందరికీ అర్ధమయింది. సీతామాత మందస్మితము చేయసాగింది. |