లంకలో హనుమంతుడు చేసిన ప్రతి పనీ కూడా రావణాసురుని వినాశనానికి, ఏదో విధంగా నష్టం కలిగించడానికే కారణమయ్యింది.
అక్కడ గాఢాంధకారంతో కూడిన ఒక గదిలో శనైశ్చరుడు బంధింపబడి ఉన్నాడు.
హనుమంతుని పాదం శనైశ్చరుడు ఉన్న గది గోడమీద పడీపడటంతోనే అది కాస్తా కూలి పడిపోయింది.
హనుమంతుని ద్వారా విషయం తెలుసుకున్న శనైశ్చరుడు లంకను క్రీగంట చూశాడు.
శనైశ్చరుడి చూపునకు విభీషణాది వైష్ణవి భక్తుల గృహములు తప్ప, తక్కిన లంకంతయూ నాశనమైపోయింది. తర్వాత శనైశ్చరుడు హనుమంతునకు వరమిస్తూ “ఆంజనేయా అచిరకాలములోనే లంక సమస్తము నాశనమైపోతుంది. నీ ప్రయత్నం అంతా సఫలమౌతుంది” అని వెళ్ళిపోయాడు.
శనైశ్చరునకు ముక్తి కలుగుట తో లంక అంతయూ భస్మీ భూతమయింది. అది చూసి హనుమంతుడు తన తోకను శీతలము చేయదలచి సముద్రములోకి దారితీశాడు. స్నానము చేసి మరోసారి సీతామాతను చేరి చూడామణి తీసుకుని, నమస్కరించి ఘోర ఘర్జన చేసి పయనమయ్యాడు.
రాముని కి సీతమ్మ జాడ తెలిపిన హనుమంతుడు
హనుమంతుడు వస్తున్నాడని తెలిసి జాంబవంత, అంగదాదు లందరూ ఆహారం ఏమీ తినకుండా హనుమంతుని రాకకై నిరీక్షింపసాగారు. హనుమంతుని ‘కిలకిల’ శబ్దము విని కార్య సాఫల్య మందలి విశ్వాసము ద్విగుణీకృతము కాగా పురోగమించి అతనిని కౌగలించుకున్నారు.
హనుమంతుడు, తదితరులు అందరూ తింటూ తాగుతూ మధువనాన్ని ద్వంసం చేస్తూ అందరూ మహోత్సాహముతో శ్రీరామ సుగ్రీవులను సమీపించారు.
హనుమంతుడు కరుణాతి కరుణా పూరితమైన మాటలతో సీతామాత దయనీయ పరిస్థితిని వర్ణించాడు. లంక ఐశ్వర్యము, రావణుని శక్తి, అక్కడి ప్రత్యేక విషయములనూ రఘురామునకు వివరించాడు.
హనుమంతుడు చెప్పగా, సీతమ్మ అనుభవిస్తున్న దయనీయ స్థితి తెలుసుకున్న రామచంద్రుడు “హనుమంతా! నీ అంత ఉత్తముడు, ఉపకారి నాకు ఈ ప్రపంచంలో మరెవరూ లేరు. నేను నీకు ఏమి ప్రత్యుపకారం చేయగలను? నీకు ఋణపడి యున్నాను” అన్నాడు కొండంత అభిమానంతో.
శ్రీరాముడి మాటలకు హనుమంతుడు ఆనంద భరితుడయ్యాడు.
రామచంద్రుడు హనుమంతుని ప్రేమగా లేవనెత్తి హృదయమునకు హత్తుకున్నాడు. తనయందు అనన్యభక్తిని వరముగా ప్రసాదించాడు.
శంకర భగవానుడు, ఎందుకోసం హనుమంతునిగా అవతరించాడో ఆ కోరిక నెరవేరింది.